రేవంత్ నువ్వు కొడంగల్‌కే సీఎంవా? రాష్ట్రానికి కాదా?
ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి విమర్శ
యాదగిరిగుట్ట నుంచి మెడికల్‌కాలేజీని తరలిస్తే ఊరుకోం
అవసరమైతే రిలే నిరాహార దీక్షలకు దిగుతామని హెచ్చరిక
యాదగిరిగుట్ట, వెలుగు: ‘రేవంత్‌రెడ్డి నువ్వు కొడంగల్ కు మాత్రమే ముఖ్యమంత్రివా? రాష్ట్రానికి కాదా?’ అని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి ప్రశ్నించారు. హాస్పిటల్లేదనే సాకుతో గత ప్రభుత్వం యాదగిరిగుట్టకు మంజూరు చేసిన మెడికల్ కాలేజీని.. రేవంత్తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ కు తరలించుకుపోవడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. గురువారం యాదగిరిగుట్టలోని బీఆర్ఎస్ భవన్లో ఆమె ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు.
యాదగిరిగుట్ట నుంచి మెడికల్ కాలేజీని తరలించాలనే ఆలోచనను విరమించుకోవాలన్నారు. ఈ విషయంపై వచ్చే నెల ఒకటో తేదీలోపు స్పష్టత ఇవ్వకుంటే.. బీఆర్ఎస్ పార్టీ తదుపరి కార్యాచరణ ప్రకటిస్తుందని, అవసరమైతే తానే స్వయంగా రిలే నిరాహార దీక్షలకు దిగుతానని సునీత హెచ్చరించారు. కాలేజీని కొడంగల్‌కు తరలిస్తే.. జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. యాదాద్రి జిల్లాలో ఎయిమ్స్ ఉన్న కారణంగానే మెడికల్ హాస్పిటల్ మంజూరు చేయలేదని చెప్పారు.
మెడికల్ కాలేజీ కోసం మల్లాపురం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 64లో 20 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ప్రతిపాదించామని, అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో శంకుస్థాపన చేయలేకపోయామని తెలిపారు. ఎంతో కష్టపడి మంజూరు చేయించుకున్న కాలేజీని సీఎం రేవంత్ తీసుకుపోతానంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కావాలంటే కొడంగల్‌కు మరో మెడికల్ కాలేజీని తెచ్చుకోవాలని సూచించారు. సమావేశంలో ఆమెతో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, నాయకులు హరిశంకర్ గౌడ్, సత్యనారాయణ, యాదగిరిగుట్ట జడ్పీటీసీ అనురాధ తదితరులు ఉన్నారు.