- బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం బీఆర్ఎస్ డమ్మీ క్యాండిడేట్లు
- ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
యాదగిరిగుట్ట, వెలుగు : బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒకటేనని, ఎంపీ ఎన్నికల్లో బీజేపీ గెలిచేందుకు బీఆర్ఎస్ డమ్మీ అభ్యర్థులను పెట్టిందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య విమర్శించారు. బొమ్మలరామారం మండలానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ లీడర్, భువనగిరి మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ రామిడి రాంరెడ్డితో పాటు బొమ్మలరామారం మండలం హాజీపూర్, చౌదర్ పల్లి గ్రామాలకు చెందిన 100 మంది బీఆర్ఎస్ నాయకులు.. శుక్రవారం యాదగిరిగుట్టలోని ఎమ్మెల్యే నిలయంలో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య
కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. వారికి బీర్ల అయిలయ్య పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బీర్ల అయిలయ్య మాట్లాడుతూ.. లోక్సభ ఎన్నికల్లో తమకు ఓటమి తప్పదని గ్రహించిన బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. బీజేపీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి డ్రామాలు ప్లే చేసినా భువనగిరి పార్లమెంట్ సీటును కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమని స్పష్టం చేశారు.
భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి లక్షకు పైగా మెజారిటీతో గెలవబోతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో యాదగిరిగుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం, ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈరసరపు యాదగిరి గౌడ్, యాదగిరిగుట్ట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుడిపాటి మధుసూదన్ రెడ్డి, హాజీపూర్ సర్పంచ్ కవిత వెంకటేశ్ గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సింగిర్తి మల్లేశం తదితరులు ఉన్నారు.