మీరు బ్యాంకు నుంచి లోన్ తీసుకున్నారా..! అయితే, తప్పక తెలుసుకోవాల్సిందే. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులు బ్యాంక్ ఆఫ్ బరోడా సహా కెనరా బ్యాంక్, యూకో బ్యాంకులు రుణాలపై స్వల్పంగా వడ్డీ రేట్లను పెంచాయి. ముఖ్యంగా బ్యాంక్ ఆఫ్ బరోడా 3 నెలలు, 6 నెలలు, సంవత్సరాల పదవీకాలాలపై 5 బేసిస్ పాయింట్లు వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో లోన్లు తీసుకున్న ఖాతాదారులపై భారం పడనుంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా మూడు నెలల కాలవ్యవధికి MCLRని 8.45 శాతం నుంచి 8.5 శాతానికి పెంచగా.. ఆరు నెలల కాల వ్యవధికి 8.7 శాతం నుంచి 8.75 శాతానికి సవరించినట్లు తెలిపింది. ఇక, ఒక సంవత్సరం రుణాలకు MCLR 8.9 శాతం నుంచి 8.95 శాతంగా ఉండనుంది. పెంచిన వడ్డీ రేట్లు ఆగస్టు 12 నుంచి అమల్లోకి రానున్నాయి.
MCLR అంటే ఏమిటి?
ఎంసీఎల్ఆర్ అనేది ప్రామాణిక రుణ రేటు. బ్యాంకులు ఎంసీఎల్ఆర్ కంటే తక్కువకు రుణం అందించే అవకాశం ఉండదు. 2016 ఏప్రిల్ 1 నుంచి ఎంసీఎల్ఆర్ విధానాన్ని ఆర్బీఐ ప్రవేశపెట్టింది. నిధుల వ్యయం, నిర్వహణ వ్యయాలు, లాభాల మార్జిన్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని బ్యాంకులు కనీస వడ్డీ రేటును నిర్ణయిస్తాయి. ఎంసీఎల్ఆర్ తగ్గిస్తే వడ్డీ రేట్లు తగ్గి ప్రియంగా లోన్లు లభిస్తాయి. అదే ఎంసీఎల్ఆర్ పెంచితే వడ్డీ రేట్లు పెరిగి లోన్లు భారంగా మారతాయి.
కాగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వరుసగా తొమ్మిదో సారి బెంచ్‌మార్క్ వడ్డీ రేటును 6.50% వద్ద కొనసాగించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం వెలువడిన తరువాతనే బ్యాంకులు MCLRని సమీక్షించాయి. UCO బ్యాంక్ అసెట్ లయబిలిటీ మేనేజ్‌మెంట్ కమిటీ (ALCO) నిర్దిష్ట పదవీకాలానికి రుణ రేటులో 5 బేసిస్ పాయింట్లు (bps) పెరుగుదలను ఆమోదించింది. ఇది ఆగస్టు 10 నుండి అమలులోకి రానుంది. మరోవైపు, కెనరా బ్యాంక్ తన లెండింగ్ రేటును పదవీకాల వ్యవధిలో 5 బేసిస్ పాయింట్లు పెంచింది. పెంచిన వడ్డీ రేట్లు ఆగస్టు 12 నుండి అమలులోకి రానున్నాయి.