మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా పబ్లిక్కు అలర్ట్.. పాణం మంచిగ లేదని.. ఈ క్లినిక్లకు మాత్రం పోవొద్దు !

మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా పబ్లిక్కు అలర్ట్.. పాణం మంచిగ లేదని.. ఈ క్లినిక్లకు మాత్రం పోవొద్దు !

మేడ్చల్ జిల్లా: అర్హత లేకుండా ట్రీట్మెంట్ చేస్తున్న వాళ్లపై, క్లినిక్లపై మేడ్చల్ జిల్లా (DMHO ) వైద్య అధికారులు కొరడా ఝుళిపించారు. మేడ్చల్ జిల్లా వైద్య అధికారి డాక్టర్ ఉమా గౌరీ అలాంటోళ్ల, క్లినిక్ల లైసెన్స్ రద్దు చేశారు. ఈ సందర్భంగా ఉమా గౌరీ మాట్లాడుతూ.. అర్హతకు మించి వైద్యం అందించినా, అనుమతులు లేకుండా హాస్పిటల్స్, క్లినిక్లు నడిపినా చర్యలు తప్పవని హెచ్చరించారు.

మేడిపల్లి మండలం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ చెంగిచర్లలో ఒక హాస్పిటల్ లైసెన్స్ రద్దు చేసి, రెండు క్లినిక్లను సీజ్ చేశామని తెలిపారు. అర్హత లేకున్నా వైద్యం అందిస్తున్నారనే ఫిర్యాదుతో తెలంగాణ వైద్య మండలి అధికారులు గురువారం మేడిపల్లి మండలం బోడుప్పల్లో తనిఖీలు చేశారు.

వైద్యమండలి అధికారులు తనిఖీ చేసిన ఒక హాస్పిటల్ కు మేడ్చల్ జిల్లా అధికారి డాక్టర్ ఉమా గౌరీ శనివారం వెళ్లారు. వివరాలు సేకరించారు. హాస్పిటల్కు లైసెన్స్ రద్దు చేశారు. బోడుప్పల్ వెల్ విషెర్స్ హాస్పిటల్కు వెళ్లి.. విచారించగా ఇక్కడ రిజిస్ట్రేషన్ సమయంలో గౌతమి అనే వైద్యురాలి పేరు ఉందని చెప్పారు. 

కానీ.. గౌతమి అనే ఆమె రెండు సంవత్సరాలగా పై చదువులకు వెళ్లారని.. ఇప్పుడు లేరని తనిఖీల్లో తేలిందని ఉమా గౌరి చెప్పారు. ఇక్కడ ఫార్మాసిస్ట్ వైద్యం అందిస్తున్నారని, అందుకే హాస్పిటల్ లైసెన్స్ రద్దు చేశామని DMHO తెలిపారు.

అలానే అర్హతకు మించి వైద్యం అందిస్తున్న రక్షిత్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ను, పల్స్ క్లినిక్ను సీజ్ చేశారు. అర్హత లేకుండా వైద్యం అందించినా, అనుమతులు లేకుండా క్లినిక్లు, హాస్పిటల్స్ నడిపినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మేడ్చల్ జిల్లా DMHO డాక్టర్ ఉమా గౌరి హెచ్చరించారు.