వాట్సాప్, ఇన్స్ స్టా యూజర్లకు అలర్ట్.. అదిరిపోయే సరికొత్త ఫీచర్స్

వాట్సాప్, ఇన్స్ స్టా యూజర్లకు అలర్ట్.. అదిరిపోయే సరికొత్త ఫీచర్స్

వాట్సాప్​.. ఎప్పటికప్పుడు కొత్త అప్​డేట్లు తీసుకొస్తూ ఉంటుంది. యూజర్లకు అనుకూలంగా, ఉపయోగపడేలా ఉండేందుకు ఇప్పటికే చాలా ఫీచర్లు అందుబాటులోకి తెచ్చింది. ఈమధ్యే వాట్సాప్​ స్టేటస్​లో మ్యూజిక్​ ఆప్షన్​ను కూడా యాడ్ చేసింది. ఇంతలోనే స్టేటస్​కు సంబంధించి మరికొన్ని అప్​డేట్స్​ తీసుకొచ్చింది వాట్సాప్​.​ 

లొకేషన్ షేరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

వాట్సాప్​లో లొకేషన్ షేరింగ్​ గురించి తెలిసిందే. అయితే ఇప్పుడు వాట్సాప్ స్టేటస్​లోనూ లొకేషన్ షేర్ చేసుకునే వీలు కల్పిస్తోంది కంపెనీ. అందుకోసం ఏం చేయాలంటే.. వాట్సాప్​ ఓపెన్ చేసి అప్​డేట్ ట్యాబ్​కు వెళ్లాలి. యాప్​ కెమెరాతో ఫొటో క్యాప్చర్ చేయాలి. అందుకోసం గ్యాలరీలోని ఫొటో లేదా వీడియో కూడా యాడ్ చేయొచ్చు. తర్వాత స్క్రీన్​ పైభాగంలో ఉన్న స్టిక్కర్​ (sticker) ఐకాన్​ మీద ట్యాప్ చేయాలి. దాంతో క్లాక్​ (clock) ఐకాన్​ పక్కన లొకేషన్ స్టిక్కర్ కనిపిస్తుంది. దానిపై ట్యాప్ చేసి, స్టేటస్​లో లొకేషన్ సెర్చ్ చేయాలి. లొకేషన్ ఎంచుకున్నాక ట్యాగ్ చేయాలి. అంతేకాదు.. లైవ్ లొకేషన్​ను షేర్ చేసేందుకు కూడా ఎంచుకోవచ్చు. 


ఇన్​స్టా రీల్స్

వాట్సాప్​లో ఇన్​స్టా రీల్స్ క్రియేటర్ల కోసం కొత్త అప్​డేట్ వచ్చింది. ఇది ఇన్​స్టా రీల్స్ చేసేవాళ్లకు బాగా ఉపయోగపడుతుంది. వాళ్లు చేసే రీల్స్ ఎక్కువ మందికి షేర్ అయ్యే చాన్స్ ఉంటుంది. మామూలుగానే చాలామంది వాళ్లకు నచ్చిన రీల్​ని ఇతరులతో పంచుకోవాలి అనుకుంటుంటారు. అందులో భాగంగా ఇన్​స్టాగ్రామ్ రీల్​ని వాట్సాప్ స్టేటస్​లో కూడా షేర్ చేస్తుంటారు. అయితే అది ఓపెన్ చేసిన వెంటనే రీల్ ప్లే అవ్వదు. 

లింక్​ మీద క్లిక్​ చేస్తే అది ఇన్​స్టా ఇంటర్​ఫేస్​కు రీడైరెక్ట్​ అవుతుంది. అక్కడ దాన్ని ప్లే చేస్తే రీల్ చూసే వీలుంటుంది. కానీ ఇప్పుడు అలా కాకుండా.. వాట్సాప్​ స్టేటస్​ ఓపెన్​ చేయగానే ఇన్​స్టా రీల్​ ఆడియోతోపాటు ప్లే అవుతుంది. అదెలాగంటే.. ముందుగా ఇన్​స్టాగ్రామ్​ ఓపెన్ చేసి రీల్​ ఎంచుకోవాలి. ఆ రీల్ కిందున్న షేర్ ఐకాన్​ మీద ట్యాప్​ చేస్తే.. వాట్సాప్ సింబల్ కనిపిస్తుంది. దాన్నుంచి వాట్సాప్​ స్టేటస్​ ఆప్షన్​కి వెళ్లాలి. అంతే.. రీల్​ డైరెక్ట్​గా వాట్సాప్ స్టేటస్​లో చేరిపోతుంది. చూసేవాళ్లకు రీల్​తోపాటు ఆడియో కూడా వినిపిస్తుంది. 

ఆటో డౌన్​లోడ్​కు చెక్!

వాట్సాప్​లో వచ్చే గుడ్​ మార్నింగ్​ మెసేజ్​ల నుంచి ఫొటోలు, ఫైల్స్, జిఫ్​లు, స్టిక్కర్స్ వంటివి ఒక్కరోజులో బోలెడు వస్తుంటాయి. ముఖ్యంగా ఫొటోలు, వీడియోలు ఆటో డౌన్​లోడ్ అవుతుంటాయి. వాటివల్ల స్టోరేజీ నిండిపోయి ఫోన్ పనితీరు నెమ్మదిస్తుంది. చాలామంది అవసరంలేని వాటిని వెంటనే డిలీట్ చేస్తుంటారు. కానీ, ప్రతిసారీ గ్యాలరీకి వెళ్లి వాటిని తీసేయాలంటే విసుగొస్తుంది. కాబట్టి ఈ ఆటో డౌన్​లోడ్ సమస్యకు చెక్​ పెట్టడం బెస్ట్ సొల్యూషన్. 

అందుకోసం ఏం చేయాలంటే.. వాట్సాప్​లో సెట్టింగ్స్​కి వెళ్లి చాట్స్ ఆప్షన్ ఎంచుకోవాలి. అందులో మీడియా విజిబిలిటీ ఆప్షన్​ను టర్న్​ ఆఫ్​ చేస్తే సరి. అదే గ్రూప్​ల్లో అయితే చాట్​లో వ్యక్తిగత లేదా గ్రూప్​ చాట్​పై ట్యాప్ చేయాలి. అందులో మీడియా విజిబిలిటీ ఆప్షన్​లో ‘నో’ మీద ట్యాప్ చేసి ‘ఓకే’ చేయాలి. ఐఫోన్​లో అయితే చాట్స్​ ఆప్షన్​లో ఫొటోలకు సేవింగ్ డౌన్​లోడ్​ ఆఫ్ చేయాలి. గ్రూప్​లో అయితే ఫొటో ‘సేవ్​’ ఆప్షన్​లో ‘నెవర్’ అని​ ఎంచుకోవాలి.