
తెలంగాణలో మరో మూడు రోజుల పాటు డగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ జిల్లాల్లో రాగల మూడు రోజులు తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు పగటిపూట ఇళ్ల నుంచి బయటికి రావొద్దని అధికారులు సూచించారు.
దేశమంతటా అదే పరిస్థితి
జూన్ మాసం సగం గడిచినా ఎండల తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. ఉదయం 8 గంటలు దాటిందంటే చాలు జనాలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. రాబోయే రోజుల్లో పది రాష్ట్రాల్లో వేడిగాలులు వీచే అవకాశముందని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా బిహార్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్రలోని విదర్భ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ లో రాగల మూడు రోజులు వేడిగాలుల తీవ్రంగా వీస్తాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో బిహార్‌లో రెడ్ అలెర్ట్ ప్రకటించగా, జార్ఖండ్‌లో జూన్ 17 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. గోవా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎండవేడిని దృష్టిలో ఉంచుకొని పాఠశాల సెలవులను పొడిగించాయి.
ఏపీకి వర్ష సూచన
ఏపీలో ఈ నెల 18 నుంచి 21 మధ్య నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు అమరావతి వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నెల 19 నుంచి తిరుపతి, సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి, వైఎస్సార్, చిత్తూరు జిల్లాలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది.