సీపీఆర్ చేసి వ్యక్తి ప్రాణాలు కాపాడిన పోలీసులు

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి గురువారం పొలం వద్ద పనిచేస్తుండగా ఆకస్మాత్తుగా ఛాతిలో నొప్పి వచ్చి పడిపోయాడు. పోలీసులు సీపీఆర్ చేసి అతడి ప్రాణాలు కాపాడారు. సిరిసిల్ల రోడ్డులోని బ్రిడ్జి వద్ద కాసర్ల నర్సింలు (50) అనే వ్యక్తి పొలంలో ట్రాక్టర్​తో దున్నుతున్నాడు. ఛాతిలో నొప్పిరావడంతో ట్రాక్టర్​ సీట్లోనే పడిపోయాడు. అక్కడే ఉన్న వంశీ హైవేపై పెట్రోలింగ్​ నిర్వహిస్తున్న పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

పోలీసులు  పొలంలోకి వెళ్లి నర్సింలుకు సీపీఆర్​ చేశారు. కొద్దిసేపటికి ఆయన స్పృహలోకి రాగానే భుజాలపై రోడ్డుపై ఉన్న వెహికిల్​ వరకు మోసుకొచ్చారు. జిల్లా హాస్పిటల్​లో చేర్పించి, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. సీపీఆర్ ​చేసి వ్యక్తి ప్రాణాలు కాపాడిన ఎస్ఐ భూమయ్య, కానిస్టేబుళ్లు​ సురేశ్, హుస్సేన్​లను  ఎస్పీ సింధూశర్మ అభినందించారు.