- నేడు భారత్ బంద్ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అలర్ట్
- రంగంలోకి భద్రతా బలగాలు
- వాహనాల రాకపోకలపై ఆంక్షలు..రోడ్ల మూసివేత
భద్రాచలం, వెలుగు : విప్లవోద్యమంపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపుతున్నాయంటూ మావోయిస్టు పార్టీ శుక్రవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆంధ్రా, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బంద్‌ను సక్సెస్చేయాలంటూ సరిహద్దుల్లోని వాహనాలపై మావోయిస్టులు దాడులు చేస్తున్నారు. బుధవారం రాత్రి చత్తీస్‌గఢ్‌లో బస్సు, లారీలకు నిప్పు పెట్టిన మావోయిస్టులు..తెలంగాణ సరిహద్దున భద్రాచలానికి సమీపంలో ఉన్న ఆంధ్రా విలీన చింతూరు మండలం వీరాపురం వద్ద కారును ఆపి ప్రయాణికులను కిందికి దింపి నిప్పు పెట్టారు.
ఈ ఘటనలో కారు పూర్తిగా కాలిపోయింది. విజయవాడ–-జగదల్పూర్జాతీయ రహదారిపై భారత్‌బంద్‌ను విజయవంతం చేయాలంటూ వాల్‌పోస్టర్లు, కరపత్రాలు వదిలారు. దీంతో నాలుగు రాష్ట్రాల పోలీసులతో పాటు కేంద్ర ప్రభుత్వం అలర్టయ్యింది. భారీగా భద్రతా బలగాలను రంగంలోకి దింపింది. వారు సరిహద్దుల్లోని గిరిజన గ్రామాలు, అటవీ ప్రాంతాల్లో కూంబింగ్మొదలుపెట్టారు.
రాకపోకలపై ఆంక్షలు
మావోయిస్టుల దూకుడు, భారత్‌బంద్ కారణంగా రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. గురువారం రాత్రి నుంచే భద్రాచలం, చింతూరులో వాహనాలను నిలిపివేస్తున్నారు. చత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రాకు వెళ్లే రూట్లలో ప్రైవేటు వాహనాలను కూడా అనుమతించడం లేదు. చింతూరు పోలీసులు ఏకంగా చట్టి వద్ద రోడ్డును మూసేశారు. కారును తగులబెట్టడంతో మరే ఇతర ఘటనలు జరగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రజాప్రతినిధులు, మావోయిస్టుల హిట్ లిస్టులో ఉన్న వారిని టౌన్లు, నగరాలకు వెళ్లిపోవాలని నోటీసులు ఇచ్చారు.
ప్రతి పోలీస్‌స్టేషన్‌పరిధిలో రెడ్అలర్ట్ ప్రకటించారు. వాహన తనిఖీలతో పాటు, అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడం, మాజీ మావోయిస్టులను అదుపులోకి తీసుకుని పరిస్థితిని సమీక్షించడం వంటి చర్యలు చేపట్టారు. పోలీసు ఆఫీసర్లకు సెలవులు కూడా రద్దు చేశారు. ఆర్టీసీ రాత్రి సర్వీసులను క్యాన్సిల్చేయడంతో పాటు మండల కేంద్రాల్లో నైట్‌హాల్ట్ చేసే బస్సులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ప్రభుత్వ ఆఫీసుల వద్ద బందోబస్తు పటిష్టం చేశారు. భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, వాజేడు, వెంకటాపురం, చింతూరు తదితర మండలాల్లో నిఘా పెంచారు.కాగా, దుమ్ముగూడెం మండలం పైడిగూడెం గ్రామంలో మావోయిస్టులు ఆయుధాలతో ప్రవేశించి హల్చల్ చేశారు. అక్కడ సెల్ టవర్ కి నిప్పు పెట్టారు. శుక్రవారం నాటి భారత్ బంద్ ను విజయవంతం చేయాలని వాల్ పోస్టర్ లు వదిలివెళ్లారు.
రెండు బస్సులు దహనం చేసిన మావోయిస్టులు
భారత్‌బంద్‌ను విజయవంతం చేయాలని మావోయిస్టులు గురువారం రాత్రి చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో రెండు బస్సులను దహనం చేశారు. జిల్లా పరిధిలోని ఆవపల్లి నుంచి రాయ్‌పూర్ వెళ్తున్న రాయల్ట్రావెల్స్ కు చెందిన బస్సును ఆవపల్లి వద్ద తగలబెట్టారు. ఈ విషయాన్ని ఎస్పీ ఆంజనేయ వర్షనేయ్ ధ్రువీకరించారు. జగదల్పూర్ నుంచి బాసగూడ వస్తున్న బస్సుకు తిమ్మాపూర్వద్ద మావోయిస్టులు తగులబెట్టారని చెప్పారు. బాసగూడ పీఎస్ పరిధిలో ఈ ఘటన జరగ్గా బలగాలను అప్రమత్తం చేసినట్లు చెప్పారు.