కొవిడ్​ కొత్త వేరియంట్​పై అలర్ట్

మంచిర్యాల, వెలుగు: కొవిడ్ కొత్త వేరియంట్​ జేఎన్​1​ కేసులు రాష్ట్రంలో పెరుగుతున్న నేపథ్యంలో మంచిర్యాల జిల్లా వైద్యారోగ్యశాఖ అలర్ట్​అయ్యింది. జిల్లాలో వైరస్​వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించింది. జిల్లాలోని అన్ని ప్రైమరీ హెల్త్​సెంటర్లలో ఆర్టీపీసీఆర్​ కిట్లను సిద్ధంగా ఉంచుకోవడంతో పాటు రోజువారీగా టెస్టుల సంఖ్యను పెంచాలని డీఎంహెచ్​వో సుబ్బరాయుడు బుధవారం ఆదేశాలు జారీ చేశారు.

సంక్రాంతి పండుగ సీజన్​ను దృష్టిలో ఉంచుకొని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, బయటకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా మాస్కులు పెట్టుకోవాలని సూచించారు. కొవిడ్​ కొత్త వేరియంట్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డీఎంహెచ్​వో పోస్టర్లను  రిలీజ్​ చేశారు. ఈ కార్యక్రమంలో కొవిడ్​ నోడల్​ఆఫీసర్ ఫయాజ్, జిల్లా మాస్​ మీడియా ఆఫీసర్​బుక్క వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.  

1461 బెడ్లు రెడీ..

జిల్లాలోని పీహెచ్​సీలు, సీహెచ్​సీలు, అన్ని గవర్నమెంట్​ హాస్పిటళ్లతో పాటు 17 ప్రైవేట్​హాస్పిటళ్లలో 1461 బెడ్లను అధికారులు రెడీ చేశారు. ఐసీయూ 246, ఆక్సిజన్​ సపోర్టెడ్​502, ఐసోలేషన్​ బెడ్లు 372 అందుబాటులో ఉన్నాయి. జిల్లాలో 7438 పీపీఈ కిట్లు, 20,715 ఎన్​95 మాస్కులు, 304 ఆక్సీమీటర్లు, 108 నెబులైజర్లు, 249 ఆక్సిజన్​ సిలిండర్లు సిద్ధంగా ఉన్నాయి.