- గ్రామాల్లో రెండు రోజులుగా వివరాలు సేకరిస్తున్న ఆశాలు, ఏఎన్ఎంలు
- ఇప్పటికీ 310 మందికి జ్వరం
హనుమకొండ, వెలుగు : వారం రోజులుగా కురుస్తున్న ముసురు వాన వల్ల సీజనల్ వ్యాధులు విజృంభించే ప్రమాదం ఉండటంతో అధికారులు అలెర్ట్ అయ్యారు. కలెక్టర్ ప్రావీణ్య ఆదేశాలతో జిల్లాలో ఇంటింటి సర్వే ప్రారంభించారు. జ్వరాల బాధితుల వివరాలను ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు సేకరిస్తున్నారు. బాధితులకు మెడిసిన్ అందించడంతో పాటు.. వ్యాధులు ప్రబలకుండా దోమల నివారణ కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ప్రభుత్వ గురుకుల విద్యాసంస్థల్లోనూ హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నారు.
14,200 ఇండ్లు.. 310 మందికి లక్షణాలు
హనుమకొండ జిల్లాలో ఇప్పటివరకు 15 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. వారం నుంచి వర్షాలు కురుస్తుండటంతో గ్రామాల్లో పారిశుధ్యం లోపించి, దోమలు విపరీతంగా వ్యాప్తి చెందుతున్నాయి. దీంతో జ్వర బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. జ్వరాలను కట్టడి చేసేందుకు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. జిల్లాలో 75 వేలకు పైగా ఇండ్లు ఉన్నాయి. ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్నారు. రెండు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా 14,200 ఇండ్లలో సర్వే పూర్తి చేశారు.
అందులో 310 మంది జ్వరంతో బాధ పడుతున్నట్లు గుర్తించారు. అంతేగాకుండా ఒక డెంగ్యూ కేస్ నమోదు కాగా, డయేరియా 4, దగ్గు, జలుబులాంటి లక్షణాలు 48 మందికి ఉన్నట్లు తేల్చారు. ఈ మేరకు వారికి మెడికల్ కిట్లు కూడా అందించారు.జ్వరం, దగ్గు, జలుబు, డయేరియా తదితర లక్షణాలతో బాధపడుతున్నవారి వివరాలు సేకరిస్తున్నారు.
గురుకుల విద్యాసంస్థల్లో రెండో రౌండ్
గురుకుల విద్యాసంస్థల్లో అధికారులు హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికీ 67 హాస్టళ్లలో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి, 7,161 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. అందులో 284 మంది విద్యార్థులకు జ్వరం లక్షణాలు కనిపించడంతో వారికి అవసరమైన మందులు ఇచ్చి ట్రీట్ మెంట్ అందజేశారు. గ్రామాలు, విద్యాసంస్థల్లో ఎక్కడైనా ఎక్కువ మందికి జ్వరం, ఇతర వ్యాధుల లక్షణాలు ఉంటే సమాచారం అందించేందుకు ఎపిడమిక్ సెల్ ను కూడా ఏర్పాటు చేశారు .
బాధితులు ఎక్కువ ఉంటే హెల్త్ క్యాంపులు
జిల్లాలో జ్వరాలు ప్రబలకుండా ఇప్పటినుంచే ముందస్తు చర్యలు చేపడుతున్నాం. అందులో భాగంగానే వైద్యారోగ్యశాఖ మంత్రి, కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామాల్లో ఇంటింటి సర్వే చేస్తున్నాం. జ్వర పీడితులు ఎక్కువ మంది ఉన్నచోట్లా ప్రత్యేకంగా వైద్య శిబిరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఎక్కడైనా వ్యాధులు ప్రబలితే వైద్యాధికారులకు సమాచారం అందించాలి. దోమల నియంత్రణకు కూడా తగిన చర్యలు తీసుకోవాలి.
- డాక్టర్ సాంబశివరావు, డీఎంహెచ్వో, హనుమకొండ