ఇండ్లు, దుకాణాలు కోల్పోయిన బాధితులను ఆదుకుంటాం : బీర్ల అయిలయ్య

యాదగిరిగుట్ట, వెలుగు:కాంగ్రెస్ అధికారంలోకి రాగానే యాదగిరి గుట్టలో రోడ్ల విస్తరణంలో ఇండ్లు, దుకాణాలు కోల్పోయిన బాధితులకు ఆదుకుంటామని ఆలేరు అభ్యర్థి బీర్ల అయిలయ్య హామీ ఇచ్చారు. ఆటోలను కొండపైకి అనుమతిస్తామని మాటిచ్చారు. సోమవారం యాదగిరిగుట్టలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధితో స్థానిక ప్రజల బతుకులు బాగుపడతాయనుకుంటే.. ఉన్న ఉపాధి కోల్పోయి రోడ్ల మీద పడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆటో డ్రైవర్లు, చిరువ్యాపారుల కుటుంబాల బతుకులు ఆగమయ్యాయని వాపోయారు. ప్రజలు కేసీఆర్‌‌ నమ్మే పరిస్థితి లేదని,  అందుకే బీజేపీతో  లోపాయికారి ఒప్పందం చేసుకుని  మళ్లీ అధికారంలోకి  రావాలని చూస్తున్నారని ఆరోపించారు.  ఎన్ని కుట్రలు చేసినా  ఆలేరు సహా రాష్ట్రంలో కాంగ్రెస్  అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు.  ఈ కార్యక్రమంలో గుట్ట మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకలసుధా హేమేందర్ గౌడ్,  టౌన్ అధ్యక్షుడు బందారపు బిక్షపతి, నేతలు భరత్ గౌడ్,  గుండు నర్సింహ్మ గౌడ్,  సుడుగు జీవన్ రెడ్డి,  బిట్టు కిశోర్, హరిబాబు  ఉన్నారు.