కేసీఆర్‌‌ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు : బీర్ల అయిలయ్య

  • పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీర్ల అయిలయ్య

యాదగిరిగుట్ట, వెలుగు : సీఎం కేసీఆర్‌‌ ఎన్ని హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ ఆలేరు నియోజకవర్గ ఇన్‌చార్జి బీర్ల అయిలయ్య విమర్శించారు.  బొమ్మలరామారం మండలం మేడిపల్లి, మైలారం గ్రామాలకు చెందిన 200 మంది బీఆర్ఎస్, బీజేపీ నేతలు మంగళవారం కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ..  సీఎం కేసీఆర్‌‌ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతవరకైనా తెగిస్తారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.  

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కటై పేదప్రజలను దోచుకుతింటున్నాయని ఆరోపించారు.  మతవిద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుతున్న బీజేపీతో సీఎం కేసీఆర్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు.  మోడీ, కేసీఆర్‌‌కు ఓట్లప్పుడే ప్రజలు గుర్తొస్తారని, కల్లబొల్లి మాటలతో మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నారని మండిపడ్డారు.

 ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుడిపాటి మధుసూదన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు సింగిర్తి మల్లేశం, ఎంపీటీసీ శ్రీహరి నాయక్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రావణ్ రెడ్డి తదితరులు ఉన్నారు.