రేషన్ కార్డులు ఎందుకియ్యలేదో కేసీఆర్ ను నిలదీయాలి : బీర్ల అయిలయ్య

రేషన్ కార్డులు ఎందుకియ్యలేదో  కేసీఆర్ ను నిలదీయాలి :  బీర్ల అయిలయ్య
  • ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య  

యాదగిరిగుట్ట, వెలుగు:  పదేళ్ల  బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఎందుకు ఇవ్వలేకపోయారో బీఆర్ఎస్ నాయకులు మొదట కేసీఆర్ ను అడగాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య  అన్నారు.  నిరుపేదకు కూడా రేషన్ కార్డు ఇవ్వని బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పై  మాట్లాడే  అర్హతే లేదన్నారు. 

 ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం బుధవారం తుర్కపల్లి మండలం ధర్మారం, ఇబ్రహీంపూర్ గ్రామసభల్లో, అదేవిధంగా యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో నిర్వహించిన వార్డు సభలో ఆయన పాల్గొన్నారు.   గ్రామసభల్లో అధికారులు చదువుతున్న జాబితాలో పేర్లు లేనివారికి ప్రభుత్వ పథకాలు రావని బీఆర్ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని సూచించారు. 

ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియ అని, అర్హులైన ప్రతిఒక్కరికీ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు.   కార్యక్రమంలో మదర్ డెయిరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి, ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఐనాల చైతన్యా మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు కానుగు బాలరాజు గౌడ్, పట్టణ మాజీ అధ్యక్షుడు, మాజీ ఉప సర్పంచ్ గుండ్లపల్లి భరత్ గౌడ్ పాల్గొన్నారు.