ఆగస్టు 15లోపు పంట రుణమాఫీ : బీర్ల ఐలయ్య

  •     ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

యాదగిరిగుట్ట, వెలుగు : ఆగస్టు 15లోపు రైతులకు పంట రుణమాఫీ చేస్తామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్పష్టం చేశారు. ఏకకాలంలో రూ.2 లక్షల వరకు రుణాలు మాఫీ చేసి మాట నిలబెట్టుకుంటామని హామీ ఇచ్చారు. మంగళవారం యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం వేల్పుపల్లి, గందమల్ల, తుర్కపల్లి, వాసాలమర్రిలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని,  ఇచ్చిన హామీలను నెరవేర్చి రైతన్నకు అండగా నిలుస్తామన్నారు.

రైతుబీమా, రైతుబంధు వంటి సంక్షేమ పథకాలను యథాతథంగా అమలు చేస్తామన్నారు. దేశంలో రైతులకు పెద్దపీట వేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మాత్రమేనని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు చేస్తామని, మిగతా టైం మొత్తం ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించడం కోసమే పని చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ సుశీలారవీందర్ నాయక్

బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, ఎంపీటీసీలు  నవీన్ కుమార్, కరుణాకర్, మోహన్ బాబు నాయక్, ఏఎంసీ మాజీ చైర్మన్ శంకర్ నాయక్, కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చాడ భాస్కర్ రెడ్డి, మహిళా విభాగం మండల అధ్యక్షురాలు చైతన్యామహేందర్ రెడ్డి, తహశీల్దార్ దేశానాయక్, ఎంపీడీవో ఝాన్సీ లక్ష్మీబాయి, ఏడీఏ పద్మావతి, ఏవో దుర్గేశ్వరి తదితరులు పాల్గొన్నారు.