యాదగిరిగుట్ట, వెలుగు : లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటు కూడా గెల్వదని, కాంగ్రెస్15 ఎంపీ స్థానాలను గెలిచి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ధీమా వ్యక్తం చేశారు. యాదగిరిగుట్టలోని తన నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. పదేండ్లు అడ్డగోలుగా దోచుకుతిన్న కేటీఆర్, హరీశ్ రావుకు.. అధికారం లేకపోవడంతో ఆగమాగమవుతున్నారని ఎద్దేవా చేశారు. అధికారం పోయిన ఫ్రస్టేషన్ లో కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావట్లేదన్నారు.
బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతుంటే.. కల్వకుంట్ల కుటుంబానికి వణుకు పట్టుకుందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో ఊహించని పేర్లు బయటికొస్తున్నాయని, ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఐదు గ్యారెంటీలను అమలు చేశామని, దీనిని బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీ రెండూ లోపాయికారి ఒప్పందం చేసుకుని ముందుకు సాగుతున్నాయని ఆరోపించారు.
తుక్కుగూడ సభకు ఆలేరు నుంచి 9,999 మంది క్యాడర్..
ఈనెల 6న తుక్కుగూడలో కాంగ్రెస్ నిర్వహించే 'జనజాతర' బహిరంగ సభకు ఆలేరు నియోజకవర్గం నుంచి 9,999 మంది కార్యకర్తలు తరలివెళ్లనున్నట్లు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య వెల్లడించారు. తుక్కుగూడ సభలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కలిసి కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించనున్నట్లు తెలిపారు. మేనిఫెస్టోలో యువ న్యాయ్, కిసాన్ న్యాయ్, నారీన్యాయ్, శ్రామిక్ న్యాయ్, ఎస్సీ దారీ వంటి పథకాలతోపాటు మరో 25 గ్యారెంటీలను ప్రకటించనున్నట్లు చెప్పారు. తుక్కుగూడ సభ నుంచి కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల ప్రచారం ప్రారంభమవుతుందన్నారు.
భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. సమావేశంలో డీసీసీ చీఫ్ అండెం సంజీవరెడ్డి, పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, యాదగిరిగుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కానుగు బాలరాజుగౌడ్, ఆలేరు ఎంపీపీ గందమల్ల అశోక్, రాజాపేట మండల అధ్యక్షుడు నమిలె మహేందర్ గౌడ్, తుర్కపల్లి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చాడ భాస్కర్ రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ ధనావత్ శంకర్ నాయక్, బొమ్మలరామారం, మోటకొండూర్ మండలాల అధ్యక్షులు సింగిర్తి మల్లేశం, యెల్లంల సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.