ప్రజలు శిక్షించినా బీఆర్ఎస్ బుద్ధి మారలేదు :  ప్రభుత్వ విప్​ బీర్ల ఐలయ్య 

ప్రజలు శిక్షించినా బీఆర్ఎస్ బుద్ధి మారలేదు :  ప్రభుత్వ విప్​ బీర్ల ఐలయ్య 

యాదగిరిగుట్ట, వెలుగు : రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ ను శిక్షించినా ఆ పార్టీ నాయకుల బుద్ధి మారలేదని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఎద్దేవా చేశారు. ఆదివారం యాదగిరిగుట్టలోని బీర్ల నిలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. సీఎం, మంత్రుల కాళ్లు మొక్కి ఆలేరు నియోజకవర్గానికి గోదావరి జలాలను తరలించి అసాధ్యాన్ని.. సుసాధ్యం చేశానని పేర్కొన్నారు. ఆలేరుకు గోదావరి జలాలు రావడానికి బీఆర్ఎస్ తెచ్చిన ప్రాజెక్టులే కారణమని చెప్తున్న నాయకులు.. నాడు ఎందుకు గోదావరి జలాలను తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు.

మాజీ మంత్రి హరీశ్ రావు తపాసుపల్లి నీళ్లను సిద్ధిపేటకు తరలించుకుపోతుంటే నోరు మెదపని బీఆర్ఎస్ నాయకులు.. ఇప్పుడు తమవల్లే ఆలేరుకు నీళ్లు వచ్చాయని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. మూసీ ప్రక్షాళనపై ప్రతిపక్షాలు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను రెచ్చగొట్టి మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును ఆపాలని కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా మూసీని ప్రక్షాళన చేసి మూసీకంపు నుంచి బాధితులకు విముక్తి కల్పిస్తామని స్పష్టం చేశారు.

అంతకుముందు బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ చైతన్యామహేందర్ రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ సంజీవరెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీశైలం, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాలరాజుగౌడ్, మాజీ ఉప సర్పంచ్ భరత్ గౌడ్, ఆలేరు మాజీ ఎంపీపీ అశోక్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.