
యాదగిరిగుట్ట, వెలుగు : దేశప్రజల సొమ్మును ప్రధాని మోదీ కార్పొరేట్లకు దోచిపెడుతున్నారని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆరోపించారు. ఆదివారం యాదగిరిగుట్టలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'జై బాపు, జై భీమ్, జై సంవిధాన్' కార్యక్రమంలో ఫ్యామిలీతో కలిసి ఆయన హాజరయ్యారు. మహాత్మాగాంధీ, అంబేద్కర్ ఫొటోలు, రాజ్యాంగం పుస్తకాన్ని చేతిలో పట్టుకుని ప్రజలకు రాజ్యాంగం విలువను తెలుపుతూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం అంటే ప్రధాని మోదీకి ఏమాత్రం విలువ లేదని, అందుకే పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ ను కించపర్చే విధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారని మండిపడ్డారు. భారత రాజ్యాంగం అంటే బీజేపీ దృష్టిలో పుస్తకం మాత్రమేనని, కానీ తమ దృష్టిలో రాజ్యాంగం అంటే పవిత్ర గ్రంథం అని పేర్కొన్నారు.
దేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసమే 'జై బాపు, జై భీమ్, జై సంవిధాన్' కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. పేదలంటే మోదీకి పట్టింపే లేదని, ఆయన ధ్యాసంతా దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేయడంపైనే ఉందని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో యాదగిరిగుట్ట మాజీ ఉప సర్పంచ్ భరత్ గౌడ్, మాజీ కౌన్సిలర్ మల్లేశ్ యాదవ్, పట్టణ అధ్యక్షుడు భిక్షపతి, వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింహగౌడ్, నాయకులు హేమేందర్ గౌడ్, కోల కృష్ణ, మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షుడు ఎండీ సలాం తదితరులు పాల్గొన్నారు.