- రంగంలోకి మాజీ ఎమ్మెల్యే.. రెండు వర్గాలతో చర్చలు
- ఎక్కడికీ వెళ్లొద్దని ఆదేశాలు
- కుర్చీ చేజారితే మళ్లీ దక్కదని హెచ్చరిక
- ఫిబ్రవరి 9న మోత్కూర్ చైర్మన్‌పై అవిశ్వాసం
- క్యాంప్‌లో 9 మంది కౌన్సిలర్లు
యాదాద్రి, వెలుగు : ఆలేరు మున్సిపాలిటీ అవిశ్వాసం అనూహ్య మలుపులు తిరుగుతోంది. అవిశ్వాసం తేదీ దగ్గరకు వస్తుండడంతో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత రంగంలోకి దిగి కౌన్సిలర్లతో చర్చలు జరుపుతున్నారు. ఆలేరు మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య(బీఆర్ఎస్)పై గతేడాది జనవరి 31న సొంత పార్టీ కౌన్సిలర్లతో పాటు కాంగ్రెస్, బీజేపీ, ఇండిపెండెంట్ కౌన్సిలర్లు అవిశ్వాసం నోటీసు ఇచ్చారు. ఆ సమయంలో యాదగిరిగుట్ట చైర్మన్ సుధ సహా మరికొందరు హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవడంతో అవిశ్వానికి బ్రేక్ పడింది.
అయితే గతేడాది అక్టోబర్ 6న అవిశ్వాసంపై ముందుకెళ్లొచ్చని హైకోర్టు తీర్పు ఇచ్చింది. కానీ, ఎన్నికల కోడ్‌రావడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి, కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో అవిశ్వాస ప్రక్రియ మళ్లీ మొదలైంది. 8 మంది కౌన్సిలర్లు మరోసారి కలెక్టర్ హనుమంతు జెండగేను కలవడంతో ఈ నెల 27న మీటింగ్ తేదీని ఖరారు చేశారు.
దీంతో చైర్మన్ వస్పరి శంకరయ్య ఒకవైపు, అసమ్మతి కౌన్సిలర్ల తరఫున బేతి రాములు సహా మరికొందరు క్యాంపులకు తెరలేపారు. ఇదిలా ఉండగా అసమ్మతి శిబిరంలో ఉన్న ఇద్దరు కౌన్సిలర్లతో చైర్మన్ శంకరయ్య చర్చలు జరపగా... ఒకరు ఆయన వైపునకు వచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో శంకరయ వర్గంలో ఐదుగురు, మరో వర్గంలో ఏడుగురు ఉన్నారని సమాచారం. ఈ ఐదుగురితో శంకరయ్య క్యాంపు ఏర్పాటు చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.
కలిసే ఉండాలని మాజీ ఎమ్మెల్యే ఆదేశం
నెల రోజులుగా అవిశ్వాసం అంశంపై మౌనంగా ఉన్న ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత జరుగుతున్న పరిణామాలను చూసి రంగంలోకి దిగారు. ఇటీవలే చైర్మన్ వస్పరి శంకరయ్యతో మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత మరో వర్గంలో ఉన్న బేతి రాములు సహా ఇతరులతో మాట్లాడి అసలేం జరుగుతుందో ఆరా తీశారు.
అనంతరం ఇతర పార్టీలకు చెందిన ముగ్గురు కౌన్సిలర్లు మినహా బీఆర్ఎస్కు చెందిన 9 మంది కలిసే ఉండాలని, చైర్మన్ పీఠం చేజారితే తిరిగి దక్కదని హెచ్చరించారు. క్యాంపులకు వెళ్లాల్సిన అవసరం లేదని, తాను ఎప్పుడు పిలిస్తే అప్పుడు తన వద్దకు రావాలని ఆదేశించారు. దీంతో చైర్మన్ క్యాంపును రద్దు చేసుకున్నారని తెలుస్తోంది. ఒక కౌన్సిలర్ మాత్రం హైదరాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే కనుసన్నల్లో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
ఉమ్మడి మీటింగ్..?
ఈ నెల 27(శనివారం) అవిశ్వాస మీటింగ్జరగాల్సి ఉంది. అందుకే బీఆర్ఎస్కు చెందిన 9 మంది కౌన్సిలర్లతో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ఉమ్మడిగా మీటింగ్ నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ముఖాముఖిగా కౌన్సిలర్లు కూర్చోబెట్టి తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడడానికి కారణాలను తెలుసుకొని మధ్యే మార్గంగా పరిష్కారం చూపిస్తారని సమాచారం. ఇదే జరిగితే ఆలేరు అవిశ్వాసం వీగిపోయే అవకాశం ఉంది. అయితే శంకరయ్యకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కౌన్సిలర్లు మాత్రం వెనక్కు తగ్గేట్టుగా లేరని ఓ అసమ్మతి కౌన్సిలర్ తెలిపారు.
క్యాంపులో మోత్కూర్ కౌన్సిలర్లు
మోత్కూరు మున్సిపల్ చైర్మన్ తీపిరెడ్డి సావిత్రి (బీఆర్ఎస్)పై వచ్చే నెల 9న అవిశ్వాస మీటింగ్ నిర్వహించాలని కలెక్టర్ హనుమంతు జెండగే నిర్ణయం తీసుకున్నారు. దీంతో అవిశ్వాస తీర్మానంపై వైస్ చైర్మన్ బొల్లేపల్లి వెంకటయ్య సహా ఐదుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు, నలుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు క్యాంపునకు వెళ్లిపోయారు. అవిశ్వాసానికి సంబంధించిన ఫారం-2 నోటీసులు ఇవ్వడానికి కౌన్సిలర్లకు మోత్కూరు కమిషనర్శ్రీకాంత్ ఫోన్ చేయగా.. తాము అందుబాటులో లేమని చెప్పారు. నోటీసులు కచ్చితంగా తీసుకోవాల్సిందేనని కమిషనర్స్పష్టం చేయడంతో క్యాంపులో ఉన్న 9 మంది కౌన్సిలర్లు వేర్వేరు కార్లలో వచ్చి నోటీసులు తీసుకున్నట్లు తెలిసింది.