- దళిత బంధుపై 48 గంటల దీక్ష
- మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి
నిర్మల్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా ఇవ్వకపోయినా కేంద్ర నిధులతో ప్రధాని నరేంద్ర మోడీ రైల్వే లైన్ మంజూరు చేశారని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. దశాబ్దాల కలను నిజం చేసిన ప్రధాని నరేంద్ర మోడీని నిర్మల్ ప్రజలంతా గుండెల్లో పెట్టుకుంటారని అన్నారు. ఏండ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను చెల్లించేందుకు నిరాకరించినా ప్రధాని ప్రత్యేక చొరవతో కేంద్రమే నిధులన్నీ భరించేలా చేశారన్నారు. రైల్వే లైన్ మంజూరైన సందర్భంగా నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో నరేంద్ర మోడీ ఫొటోకు క్షీరాభిషేకం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
దళిత బంధు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం దళితులను మోసం చేస్తోందని మండిపడ్డారు. నిర్మల్ లో దళితులందరికీ దళిత బంధు పథకాన్ని అందించాలని, ఇందుకు వచ్చే మంగళవారం నుంచి 48 గంటల పాటు దీక్ష చేపట్టనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ సమావే శంలో లోక్ సభ ఇన్చార్జ్ అయ్యనగారి భూమయ్య, పార్టీ ప్రధాన కార్యదర్శి సామ రాజేశ్వర్ రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ సాదం అరవింద్, మున్సిపల్ కౌన్సిలర్ రాజేందర్, జిల్లా కార్యదర్శి విలాస్, వైస్ ప్రెసిడెంట్ అలివేలు మంగ, కమల్ నయన్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఒడిసెల అర్జున్ తదితరులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ ప్రజల కళ నెరవేర్చిన ఎంపీ
బోథ్ : ఆదిలాబాద్ నుంచి నిర్మల్ మీదుగా హైదరాబాద్వరకు రైల్వే లైన్‌ను మంజూరు చేయించి ఎంపీ సోయం బాపూరావు ఆదిలాబాద్ జిల్లా ప్రజల చిరకాల కోరికను నెరవేర్చారని బీజేపీ ఓబీసీ మోర్చా ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు రాజుయాదవ్ అన్నారు. మంగళవారం ఆయన బోథ్‌లో పర్యటించి మాట్లాడారు. బాపూరావు కృషితో ఆదిలాబాద్, బోథ్, నిర్మల్ నియోజకవర్గ ప్రజలకు రవాణా మార్గం సుగుమమవడంతో పాటు గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ఈ సందర్భంగా ప్రధాని, కేంద్ర రైల్వే మంత్రికి, ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు.