Australian Open : సిట్సిపాస్‌‌కు షాక్‌..‌ తొలి రౌండ్‌‌లోనే ఓడిన గ్రీస్ స్టార్‌‌‌‌

మెల్‌‌బోర్న్‌‌: ఆస్ట్రేలియన్ ఓపెన్‌‌ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో రెండో రోజే అతి పెద్ద సంచలనం. టైటిల్ ఫేవరెట్లలో ఒకడు, గ్రీస్ స్టార్ ప్లేయర్ స్టెఫనోస్ సిట్సిపాస్‌‌కు తొలి రౌండ్‌‌లోనే షాక్ తగిలింది. 20 ఏండ్ల అమెరికా యంగ్‌‌స్టర్‌‌, అన్‌‌సీడెడ్ ‌‌అలెక్స్ మిఖెల్సెన్ అద్భుత ఆటతో  2023 సీజన్ రన్నరప్ సిట్సిపాస్‌‌ను ఓడించి తన కెరీర్‌‌‌‌లో అతి పెద్ద విజయం సాధించాడు. సోమవారం జరిగిన మెన్స్ సింగిల్స్‌ మొదటి రౌండ్‌‌లో అలెక్స్ 7-–5, 6–-3, 2–-6, 6-–4తో 11వ సీడ్‌‌ సిట్సిపాస్‌‌ను ఓడించి ఔరా అనిపించాడు. 

మూడేండ్ల వయసులో టెన్నిస్   మొదలు పెట్టిన మిఖెల్సెన్, చిన్నప్పుడు తన తల్లి, స్కూల్ టీచర్ అయిన  సోండ్రాతో కలిసి ఆడుతూ ఆటలో ఓనమాలు నేర్చుకున్నాడు. తన కాలేజీ రోజుల్లో టెన్నిస్‌‌ ప్లేయర్‌‌‌‌ అయిన సోండ్రా తర్వాత ఆటను వదిలేసినా తన కొడుకును మాత్రం ప్రొఫెషనల్ ప్లేయర్‌‌‌‌గా తీర్చిదిద్దింది. ప్రస్తుతం 42వ ర్యాంక్‌‌లో ఉన్న  మిఖెల్సెన్ గతేడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌‌లో మూడో రౌండ్‌‌కు చేరుకున్నాడు. ఈసారి తొలి రౌండ్‌‌లోనే మేటి ఆటగాడు సిట్సిపాస్‌‌ను ఓడించి సంచలనం సృష్టించాడు. గ్రాండ్ స్లామ్‌‌ టోర్నీల్లో  టాప్– 20 ర్యాంకర్‌‌‌‌పై మొదటి విజయం ఖాతాలో వేసుకున్నాడు.

సిట్సిపాస్‌‌తో పోరులో అతను స్వేచ్ఛగా ఆడాడు. బలమైన సర్వీస్‌‌ రిటర్న్‌‌లతో  ఆకట్టున్నాడు. నాలుగో సెట్‌‌లో మూడు అద్భుతమైన సర్వీస్‌‌ రిటర్న్‌‌లు చేసి కీలకమైన బ్రేక్‌‌ సాధించాడు. ఆ తర్వాత తన సర్వీస్‌‌లో కాస్త ఇబ్బంది పడి రెండు బ్రేక్ పాయింట్లను కోల్పోయినప్పటికీ చివరి గేమ్‌‌లో ప్రశాంతంగా ఆడి మ్యాచ్ ముగించాడు. ఈ మ్యాచ్‌‌లో  ఎనిమిది ఏస్‌‌లు కొట్టిన అలెక్స్‌‌ ఎనిమిది డబుల్ ఫాల్ట్స్‌‌, 40 అనవసర తప్పిదాలు చేశాడు. 46 విన్నర్లు, 5 బ్రేక్ పాయింట్లతో పైచేయా సాధించాడు. మరోవైపు సిట్సిపాస్‌‌ 13 ఏస్‌‌లు కొట్టి రెండు డబుల్ ఫాల్ట్స్‌‌ మాత్రమే చేసినా.. 45 విన్నర్లు, నాలుగు బ్రేక్ పాయింట్లకే పరిమితం అయ్యాడు.  

సినర్‌‌, జొకోవిచ్‌‌, స్వైటెక్‌‌‌‌ శుభారంభం

డిఫెండింగ్ చాంపియన్‌‌, టాప్ సీడ్ జానిక్ సినర్‌‌ ‌‌(ఇటలీ) మెగా టోర్నీలో శుభారంభం చేశాడు.  తొలి రౌండ్‌‌లో అతను 7-–6 (7/2), 7-–6 (7/5), 6–-1తో నికోలస్ జెరీ (చిలీ)పై విజయం సాధించాడు. తొలి రెండు సెట్లను టై బ్రేక్స్‌‌లో గెలిచిన సినర్‌‌‌‌ మూడో సెట్‌‌లో విజృంభించి చిలీ ప్లేయర్ ఆట కట్టించాడు. మూడో సీడ్ కార్లోస్‌‌ అల్కరాస్ (స్పెయిన్‌‌) 6–1, 5–7, 6–1తో అలెగ్జాండర్‌‌‌‌ షెవ్‌‌చెంకో (కజకిస్తాన్‌‌)పై ఈజీగా నెగ్గాడు. ఇక, 25వ గ్రాండ్‌‌స్లామ్‌‌పై కన్నేసిన సెర్బియా లెజెండ్‌‌ నొవాక్ జొకోవిచ్‌‌ బోణీ చేశాడు. ఆమెరికాకు ఆడుతున్న తెలుగు సంతతి ఆటగాడు బసవారెడ్డి నిశేష్‌‌తో మ్యాచ్‌‌లో తొలి సెట్‌‌ కోల్పోయినా తర్వాత తన మార్కు ఆటతో గెలిచాడు. 

బ్రిటన్ గ్రేట్ ఆండీ మర్రే కోచింగ్‌‌లో బరిలోకి దిగిన ఏడో సీడ్ నొవాక్‌‌  4–6, 6–3, 6–4, 6–2తో నిశేష్‌‌ను ఓడించాడు. విమెన్స్ సింగిల్స్‌‌లో రెండో సీడ్ పోలాండ్‌‌ స్టార్,  ఐదు గ్రాండ్‌‌స్లామ్స్ విన్నర్ ఇగా స్వైటెక్  6–-3, 6–-4 తో కాటెరినా సినియాకోవా (చెక్‌‌ రిపబ్లిక్‌‌)ను వరుస సెట్లతో ఓడించింది. ఎండతో ఇబ్బంది పడిన  అమెరికా స్టార్‌‌ మూడో సీడ్  కోకో గాఫ్  6-–3, 6–-3 తో  తన తోటి ప్లేయర్‌‌‌‌, 2020 చాంపియన్ కెనిన్‌‌పై  విజయం సాధించింది. ఏడో సీడ్‌‌ ‌‌ జెస్సికా పెగులా, 12వ సీడ్‌‌ డయానా ష్నైడర్, 28వ ర్యాంకర్‌‌‌‌ స్వితోలినా,  జపాన్ స్టార్ ఒసాకా ముందంజ వేయగా.. 16వ సీడ్ ఒస్తాపెంకో, 21వ ర్యాంక్ అజరెంకా తొలి రౌండ్‌‌లోనే ఓడి నిరా పరిచారు.