హైదరాబాద్ సిటీలో కల్లు తాగేటోళ్లకు బ్యాడ్ న్యూసే ఇది..

సంగారెడ్డి, వెలుగు: కల్తీ కల్లు తయారీకి వినియోగించే అల్ఫ్రాజోలం తయారు చేస్తున్న ముఠాను సంగారెడ్డి పోలీసులు పట్టుకున్నారు. రెండు వారాల క్రితం 350 గ్రాముల అల్ఫ్రాజోలం పట్టుబడిన ఘటనలో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి. నిందితులు అల్ఫ్రాజోలం తయారీకి ఏకంగా ఓ పరిశ్రమనే ఏర్పాటు చేసినట్లు గుర్తించిన పోలీసులు ఎనిమిది మందిని అరెస్ట్‌‌ చేసి, సుమారు రూ. 60 కోట్ల విలువైన వస్తువులు, బిల్డింగ్స్‌‌ను సీజ్‌‌ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ చెన్నూరి రూపేశ్‌‌ శనివారం మీడియాకు వెల్లడించారు.

మెదక్‌‌ జిల్లాకు చెందిన రియల్‌‌ ఎస్టేట్‌‌ వ్యాపారి గిర్మగాని సుధీర్‌‌ గౌడ్‌‌ తన భార్య శ్రీవాణి, తమ్ముడు ప్రవీణ్‌‌గౌడ్‌‌, ఒడిశాకు చెందిన బిశ్వేశ్వర్‌‌ సింగ్‌‌ అనే వ్యక్తితో కలిసి అల్ఫ్రాజోలం తయారు చేయాలని ప్లాన్‌‌ చేశాడు. ఇందుకు ముత్తంగికి చెందిన రాజేశ్వరశర్మ జోషితో పాటు మరికొందరు సహకరించారు. 2023లో హైదరాబాద్‌‌ శివారులోని అబ్దుల్లాపూర్‌‌మెట్‌‌ వద్ద ఓ పాడుబడిన కంపెనీని తీసుకున్నారు.

లండన్‌‌లో పీజీ చేస్తున్న ఓ స్టూడెంట్‌‌ సాయం తీసుకొని అల్ఫ్రాజోలం తయారీ మొదలు పెట్టారు. ఇలా తయారు చేసిన అల్ఫ్రాజోలంను కిలో రూ. 4 లక్షల చొప్పున హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో అమ్మడంతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌‌లకు సైతం సరఫరా చేసేవారు. ఇలా వచ్చిన డబ్బులతో విల్లాలు, భూములు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ దందాలో మొత్తం 17 మంది ఉన్నట్లు బయటపడగా ఇందులో గిర్మగాని సుధీర్‌‌, బిశ్వేశ్వర్‌‌సింగ్‌‌, రాజేశ్వరశర్మ జోషి, గిర్మగాని శ్రీవాణి, బోడ శశికుమార్‌‌, కలాలి అశోక్‌‌గౌడ్‌‌, లింగన్నగారి నారాయణగౌడ్‌‌, సాయిలును అరెస్ట్‌‌ చేసి, 740 గ్రాముల అల్ఫ్రాజోలం, 3 కార్లు, ఆరు సెల్‌‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే గిర్మగాని సుధీర్‌‌గౌడ్‌‌, వట్పల్లి సంగమేశ్వర్‌‌గౌడ్‌‌, విశాల్‌‌గౌడ్‌‌, సాయి గౌడ్, అమీర్, శ్రీకాంత్, మంగ శ్రీనివాస్‌‌గౌడ్‌‌, తొగిట రాజశేఖర్, సుధాకర్‌‌ పరారీలో ఉన్నారని ఎస్పీ తెలిపారు.