30 ఉద్యోగాలకు వెళ్లి రిజెక్టయ్యాడు. పెద్దగా క్వాలిఫికేషన్లు లేవు. అసలు యూనివర్సిటీ ఎంట్రన్స్‌లోనే పాస్ కాలేదు. అయినా పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించాడు. చిన్న అపార్టుమెంట్లో ఆన్లైన్ వ్యాపారానికి అలీబాబా ఈ–కామర్స్ ఆరంభించాడు. ఇప్పుడది ప్రపంచంలో మార్కెట్ లీడర్. మైబ్యాంక్ నుంచి చిన్న వెంచర్లకు మూడు నిమిషాల్లోనే రుణాలిచ్చే సిస్టమ్ ఆరంభించాడు. ఇక, చాలు అనుకున్నాడు. 55 ఏళ్లకు రిటైరైపోయి, తన సంపదను చదువుకూ, ఆరోగ్యానికీ ఖర్చు చేయాలనుకున్నాడు. ఇంతకీ ఎవరీ దానకర్ణుడు?
రిటైర్మెంట్ అనే మాట వింటే… ఉద్యోగుల గుండె ఝల్లుమంటుంది. మరికొన్నేళ్లు సర్వీసులో ఉంటే బాగుండు అనుకుంటారు. జాక్ మా అలా అనుకోలేదు. వచ్చే ఏడాది రిటైరవుతానని 54 ఏళ్లకే ప్రకటించేశారు. తాను స్థాపించిన కంపెనీ ఆన్లైన్ బిజినెస్‌ని ప్రపంచాన్ని శాసించే స్థాయికి తెచ్చినా, తన సంపద విలువ 2 లక్షల 95 వేల కోట్ల రూపాయలు అయినా ఒక సాదాసీదా ఉద్యోగిగా రిటైర్ కావడం చిన్న విషయం కాదు. మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్‌ని ఆదర్శంగా తీసుకుని అలీబాబా ఫౌండర్ చైర్మన్ పదవి నుంచి జాక్ మా రిటైరయ్యారు. నిజానికి, 2013లోనే కంపెనీ సీఈవో పదవి నుంచి తప్పుకుని, ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. బిల్ గేట్స్ మాదిరిగానే జాక్ మాలోకూడా ధార్మిక లక్షణాలు ఎక్కువ. తనను తాను దాతగా చెప్పుకోవడానికే ఇష్టపడతారు. పిల్లల చదువు, హాస్పిటల్ ఖర్చులు తదితర సర్వీసుకి జాక్ మా తన సంపద ఖర్చు చేయాలనుకుంటున్నారు.
పాతికేళ్ల వయసుకే జీవిత కాలపు అనుభవం గడించేసిన వ్యక్తి జాక్ మా. తూర్పు చైనాలోని హాంగ్జౌ నగరంలో ఒక బీద ఫ్యామిలీ నుంచి వచ్చారు. చదువులో ఆయనను ప్రోత్సహించినవాళ్లు లేరు. ఉద్యోగానికి అప్లయి చేస్తే తీసుకున్నవాళ్లు లేరు. కేఎఫ్‌సీ సహా 30 కంపెనీలు జాక్ మా రెజ్యూమెని పక్కనపడేశాయి. చివరికి ఒక కాలేజీలో ఇంగ్లీష్ టీచర్‌గా జీవితం మొదలెట్టారు. తన వ్యక్తిగత విషయాల్లో ఎప్పుడూ దాపరికం లేకుండా చూసుకున్నారు. కాలేజీ స్టూడెంట్లతో తన అనుభవాలు పంచుకోవడం జాక్ మా అలవాటు. ‘నేను చాలాసార్లు ఫెయిలయ్యాను. ఓసారి కేఎఫ్‌సీకి నాతోపాటు 24 మంది అప్లయి చేస్తే నా ఒక్కడికే ఉద్యోగం రాలేదు. అయిదుగురం కలిసి పోలీసు ఉద్యోగానికి వెళ్తే మిగతా నలుగురిని తీసుకున్నారు. మరోసారి ఒక ఫోర్ స్టార్ హొటల్లో సర్వర్ ఉద్యోగానికి నేను, నా కజిన్ వెళ్లాం. రెండు గంటలపాటు క్యూలో నిలబడ్డాం. నా కజిన్‌ని తీసుకుని నన్ను రిజక్ట్ చేశారు. అలాగని, నేనెప్పుడూ నిరాశ పడలేదు. ఇదొక ట్రైనింగ్ అనుకునేవాణ్ణి’ అనేవారు. తనకు జీవితంలో ఎదురైన కష్టాలు చూసి కుంగిపోలేదు. తనకు అవకాశం రాగానే తనలాంటివాళ్లకు సేవ చేయాలన్న నిర్ణయానికి ఆనాడే వచ్చారు. ఇతర సాఫ్ట్వేర్ టైకూన్లు ప్రేమ్‌జీ, బిల్ గేట్స్ మాదిరిగానే జాక్ మా కూడా దానధర్మాలతో ఫిలాంత్రఫిస్ట్గా మారారు.
ఆత్మస్థయిర్యంతో ముందడుగు వేస్తే విజయం మీ వెంటే నడుస్తుందన్నది జాక్ మా సిద్ధాంతం. ఓసారి యంగ్ గ్లోబల్ లీడర్స్ నెట్వర్క్ మీటింగ్‌లో మాట్లాడినప్పుడు ఇదే చెప్పారు. వచ్చే 30 ఏళ్లలో మీరు ఏం చేయబోతున్నారో ఈ రోజే నిర్ణయించుకోండన్నారు.
మీరు 20 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉన్నప్పుడు ఒక మంచి బాస్‌ని ఫాలో అవ్వండి. ఒక మంచి కంపెనీలో చేరి దేనినైనా సక్రమంగా ఎలా చేయాలో నేర్చుకోండి.
30 నుంచి 40 ఏళ్ల మధ్యలో మీకోసం ఏమైనా చేయాలనుకుంటే చేసేయండి. ఒకవేళ ఫెయిలైనా తట్టుకోగలుగుతారు. అయితే, మీ కుటుంబం, పిల్లలు వంటివి దృష్టిలో పెట్టుకుని ప్రయారిటీస్ ఏమిటో తెలుసుకోండి.
40 ఏళ్లు దాటిపోయాక ఏదైనా కొత్త ఫీల్డ్‌లోకి, ఏదైనా కొత్త వెంచర్లోకి వెళ్లాలనుకోవద్దు. దానికంటే మీరు దేనిలో రాణిస్తారో అదే చేయండి.
50 ఏళ్లు నిండిపోయాక యువతను, తర్వాత తరాన్ని తీర్చిదిద్దడానికి, వాళ్ల ఎదుగుదలకు టైమ్ కేటాయించండి.
60 ఏళ్లు దాటాక ఏమీ చేయొద్దు… మీ మనవలతో కాలం గడపండి’ అని యంగ్ గ్లోబల్ లీడర్లకు చెప్పారు.
జాక్ మా 33 ఏళ్లప్పుడు సొంతంగా కంప్యూటర్ కొనుక్కున్నారు. దానిలో ‘బీర్’ పదాన్ని సెర్చ్ చేస్తే చైనా తయారీ బీర్లు ఏవీ కనిపించలేదు. ఆశ్చర్యపోయారు. 1999లో అలీబాబా ఆన్లైన్ వ్యాపారానికి అదే నాంది.
కొందరు ఫ్రెండ్స్‌కి నచ్చజెప్పి పెట్టుబడులు పెట్టించి తన అపార్టుమెంట్లోనే ‘అలీబాబా’ని ఆరంభించారు. అంచెలంచెలుగా ఎదిగేలా చేశారు. ఈ రోజున ఆన్లైన్ బిజినెస్‌లో ప్రపంచంలోనే అలీబాబాని మించిన ఈ–కామర్స్ కంపెనీయే లేదంటారు.
పేటీయం, బిగ్బాస్కెట్లో పెట్టుబడులు
ఎర్లీ స్టేజ్‌లో తనకు ఎదురైన అనుభవాల్లాంటివి యువతకు రాకూడదన్న ఉద్దేశంతో, 2015లో అలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్ సపోర్టుతో ‘మైబ్యాంక్’ నుంచి రుణాలు ఇప్పిస్తున్నారు. దీనిద్వారా చైనా ఎకానమీని సమూలంగా మార్చేసే పనిలో పడ్డారు. చిన్న చిన్న వ్యాపారులకు అప్పులివ్వడమే ‘మైబ్యాంక్’ లక్ష్యం. స్మార్ట్ ఫోన్‌ద్వారా అప్లయి చేస్తే… కేవలం మూడు నిమిషాల్లో ప్రాజెక్టును అప్రూవ్ చేయడం ప్రత్యేకత. ఇప్పటివరకు కోటి 60 లక్షల చిన్న కంపెనీలకు దాదాపు 29 వేల కోట్ల డాలర్లు (రూపాయల్లో 20 లక్షల 85 వేల కోట్లు) అప్పులిచ్చారు. రియల్‌టైమ్ పేమెంట్స్ డేటా, రిస్క్ మేనేజ్మెంట్ సిస్టం వంటి 3,000 రకాల పద్ధతుల్లో లోన్ అప్రూవల్ జరుగుతుంది. అందువల్ల చెల్లింపులు సక్రమంగా జరుగుతున్నాయి. రుణాల ఎగవేత రేటు ఒక్క శాతమే. ఆయన పెట్టుబడులు ఇండియాలోని పేటీయం, బిగ్‌బాస్కెట్, జొమాటో, స్నాప్‌డీల్ లాంటి ఆన్లైన్ సంస్థల్లోనూ, లాజిస్టిక్స్ కంపెనీ ఎక్స్‌ప్రెస్ బీస్లోనూ ఉన్నాయి. జాక్ మా తన చుట్టూ ఈ–కామర్స్‌ని తిప్పుకున్నట్లే… రేపట్నుంచి చైనా యువతను ఎంటర్ప్రెన్యూర్లుగా తీర్చిదిద్దే పనిలో బిజీగా ఉండబోతున్నారు.
టీచింగ్‌లో తరిస్తా
ఏడాది క్రితమే 54 ఏళ్లు రాగానే జాక్ మా తన రిటైర్మెంట్ని ప్రకటించేశారు. ఆరు నెలల క్రితం మరోసారి పారిస్‌లో జరిగిన వివా టెక్ కాన్ఫరెన్స్‌లో… ‘ఈ సెప్టెంబర్‌లోనే నేను రిటైరవుతున్నాను. మళ్లీ టీచింగ్‌లోకి వెళ్తాను’ అన్నారు జాక్. ఒక ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ కాలేజీలో ఇంగ్లీష్ టీచర్‌గా ఆయన జీవితం మొదలైంది. ఇంటర్నెట్ ప్రపంచానికి అందుబాటులోకి వస్తుందని తెలిసి, జాబ్‌ని వదిలేశారు. 1999లో హాంగ్జౌలోని తన రెండంతస్తుల అపార్టుమెంట్లో ‘ఆలీబాబా’ కంపెనీని ఆరంభించారు. దీని ఉద్దేశం చిన్న వ్యాపారులకు సాయపడడమే. 30 ఏళ్లపాటు వ్యాపారంలో మునిగితేలాక… రిటైర్మెంట్ తర్వాత ఏం చేయాలన్నది ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. అన్నట్టుగానే సెప్టెంబర్ 10న కంపెనీ పుట్టిన రోజున తన బాధ్యతలను ఫ్యామిలీకి కాకుండా ప్రొఫెషనల్ వారసుడిగా అలీబాబా సీఈవో డేనియల్ జాంగ్కి అప్పగించేశారు. తాను సంపాదించినదంతా చైనాలోని స్కూళ్లు, కాలేజీల్లో చదువును మెరుగుపరచడానికి ఖర్చు చేస్తానంటున్నారు జాక్ మా. ప్రస్తుతం 55 ఏళ్లవాడైన జాక్.. బీజీ బిజినెస్ లైఫ్ నుంచి తప్పుకుని మరో 15 ఏళ్లపాటు టీచర్‌గా పనిచేస్తానని చెబుతున్నారు.
ఫెయిల్యూర్స్‌ను దాటుకుంటూ…
చిన్నప్పుడు జాక్ మాకి ఇంగ్లీషు వచ్చేది కాదు. ఇంటికి దూరంగా ఉండే ఓ హోటల్‌కి సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి, అక్కడ బసచేసే ఫారినర్స్‌తో మాట్లాడేవారు.
జాక్ మా కాలేజీ ఎడ్యుకేషన్ లో బాగా పూర్. రెండుసార్లు లోకల్ యూనివర్సిటీ ఎంట్రన్స్‌లో, పదిసార్లు హార్వర్డ్ ఎంట్రెన్స్‌లో ఫెయిలయ్యారు.
దాదాపు 30 ఉద్యోగాలు ట్రై చేస్తే.. అన్ని చోట్లా రిజెక్టయ్యారు.
చైనా కంపెనీలకు వెబ్ సైట్లు డెవలప్ చేయడం మొదలెట్టారు.
ఫ్రెండ్స్ పెట్టుబడితో ఈ–కామర్స్ సంస్థ అలీబాబా ఆరంభించారు.
2014లో న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో లిస్టింగ్ అయ్యింది.
అలీబాబా సంస్థ ఎంటర్టైన్మెంట్ఇండస్ట్రీలోకి కూడా ప్రవేశించింది.
చిన్న సినిమాలు కొనడంతో మొదలై ‘మిషన్ ఇంపాజిబుల్’ సహా అనేక సిన్మాలకు పెట్టుబడులు పెట్టింది.
అలీబాబా సంస్థకు సొంతంగా ‘యూకు’ పేరుతో వీడియో స్ట్రీమింగ్ వెబ్సైట్ కూడా ఉంది.
ఫుడ్ బిజినెస్‌లోకి కూడా అలీబాబా ఎంటరై, మంచి లాభాలు సంపాదించింది.
మైబ్యాంక్లో పెట్టుబడులు పెట్టి స్టార్టప్ కంపెనీలకు లోన్లు ఇస్తున్నారు. కేవలం మూడు నిమిషాల్లోనే లోన్ అప్రూవ్ చేయడం దీని ప్రత్యేకత.
ఈ కామర్స్ చుట్టూనే బిజినెస్
ఈ కామర్స్ చుట్టూనే అలీబాబా కంపెనీ బిజినెస్ అంతా తిరిగింది. కంపెనీ టోటల్ బిజినెస్ లో 80 శాతం ఈ కామర్స్ ద్వారానే జరిగింది. న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ లిస్టింగ్ ద్వారా అలీబాబా సంస్థ బిజినెస్ వరల్డ్ లోకి ప్రవేశించింది. అలీబాబా సంస్థలో దొరకని వస్తువంటూ ఉండదు.