రాహుల్ను పప్పు అన్నవాళ్లే.. ఇప్పుడు ఆయనకు భయపడ్డారు : కూనంనేని

కరీంనగర్ : దేశంలో ఆలీబాబా అరడజన్ దొంగల పాలన జరుగుతోందని, అందులో ఆలీబాబా అంటే నరేంద్ర మోడీ.. అమిత్ షా, లిలిత్ మోడీ, ఆదానీ, అంబానీ, నీరవ్ మోడీ లాంటి ఆరుగురు దొంగలు ఆయన టీమ్ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. రాహుల్ గాంధీ ఏం తప్పు చేశాడని ఆయనకు శిక్ష వేశారు. ఆయనకు కనీసం అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేసారంటే దేశం ఎటు పోతోందని సాంబశివరావు ప్రశ్నించారు. సీపీఐ అనుబంధ వ్యవసాయ కార్మికసంఘం రాష్ట్ర కమిటీ మీటింగ్ లో మాట్లాడిన ఆయన.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

రాహుల్ గాంధీని పప్పు అంటూ ఎద్దేవా చేసిన వాళ్లే ఆయనకు భయపడి ఇదంతా చేసారు. రాహుల్ పై చర్యతో నరేంద్ర మోడీ తన సమాధి తానే తవ్వుకున్నాడని కూనంనేని తప్పుబట్టారు. దేశ ప్రజల సంపద దోచుకున్న అదానీని ఎందుకు అరెస్టు చేయడం లేదు. అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలని ప్రతిపక్షాలు కోరుతుంటే.. ఎందుకు వేయడం లేదని సాంబశివరావు మండిపడ్డారు.