న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ(ఏఎంయూ) మైనారిటీ హోదా వివాదం కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. దీన్ని మైనారిటీ యూనివర్సిటీగా పరిగణించలేమంటూ 1967లో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. ఈమేరకు ఏడుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం 4:3 మెజార్టీతో శుక్రవారం తీర్పు వెలువరించింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా అనుకూలంగా తీర్పు ఇవ్వగా.. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ వ్యతిరేకించారు.
తేలాల్సింది అదే..
చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ తనతో పాటు మరో ముగ్గురి తరఫున జడ్జిమెంట్ రాశారు. ‘‘అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీని చట్టం ద్వారా ఏర్పాటు చేశారని, అందువల్ల మైనారిటీ హోదా పొందలేదని గతంలో బెంచ్ తీర్పు ఇచ్చింది. దాన్ని మేం రద్దు చేస్తున్నం. చట్టం ద్వారా ఏర్పాటు చేసినంత మాత్రానా, యూనివర్సిటీ దాని మైనారిటీ హోదాను కోల్పోదు. అసలు దాన్ని స్థాపించింది ఎవరు? అది యూనివర్సిటీగా ఎలా రూపాంతరం చెందింది? అనేది తేలాల్సి ఉంది. దీన్ని తేల్చేందుకు ఈ కేసును రెగ్యులర్ బెంచ్‌కు బదిలీ చేస్తున్నం” అని జడ్జిమెంట్‌లో పేర్కొన్నారు. తాము తీర్పులో పేర్కొన్న సూత్రాల ఆధారంగా అది తేల్చాలని ఆదేశాలిచ్చారు.
ఇదీ కేసు..
ఇది 1875లో మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజీగా ప్రారంభమైంది. 1920లో చట్టం తీసుకొచ్చి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీగా మార్చారు. చట్టం ద్వారా ఏర్పడిన ఏఎంయూ సెంట్రల్ యూనివర్సిటీ అని, ఆర్టికల్ 30 కింద మైనారిటీ హోదా ఇవ్వలేమని ఎస్.అజీజ్ బాషా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 1967లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 1981లో చట్ట సవరణ చేసి ఏఎంయూకు మళ్లీ మైనారిటీ హోదా కల్పించారు. వర్సిటీలోని పీజీ మెడికల్ కోర్సుల్లో ముస్లింలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2005లో ఉత్తర్వులు ఇచ్చారు. దీన్ని అలహాబాద్ హైకోర్టు 2006లో కొట్టివేసింది. ఆ తర్వాత వివాదం సుప్రీంకోర్టుకు చేరింది.