భీమదేవరపల్లి, వెలుగు: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ స్వకృషి మహిళా డెయిరీ 22వ వార్షిక మహాసభ బుధవారం సంఘం ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముల్కనూర్ సొసైటీ అధ్యక్షుడు అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి మాట్లాడుతూ కరువు ప్రాంతంలో క్షీర విప్లవాన్ని తీసుకువచ్చిన మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. 203 గ్రామాల్లో 23,214 మంది సభ్యులతో ఏటా 2 కోట్ల లీటర్లకు పైగా పాలు సేకరిస్తూ రూ.168 కోట్ల వ్యాపారాన్ని కొనసాగించడం అభినందనీయమన్నారు.
అనంతరం సంఘ అధ్యక్షురాలు బుర్ర ధనశ్రీ మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.11.57 కోట్ల బోనస్‌ను సభ్యులకు ఆయా గ్రామాల్లోని సంఘంలో అందించనున్నట్లు తెలిపారు. అనంతరం ఈ ఏడాది గేదే, ఆవు పాల విభాగంలో ఎల్కతుర్తి మండలం గోపాల్‌పూర్‌కి చెందిన గుజ్జెటి సరిత ఇరవై లక్షల పాల బిల్లు పొంది, అగ్రస్థానంలో నిలవడంతో ఆమెను ఘనంగా సన్మానించారు. పాల ఉత్పత్తులకు సంబంధించి నూతన లోగోలను విడుదల చేశారు. కార్యక్రమంలో జీఎం భాస్కర్‌రెడ్డి, పాల సంఘాల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.