ట్రిపుల్ ఆర్ అలైన్​మెంట్​ మారుతుందా.. మంత్రి ప్రకటనతో రైతుల్లో చిగురిస్తున్న ఆశలు

ట్రిపుల్ ఆర్ అలైన్​మెంట్​ మారుతుందా.. మంత్రి ప్రకటనతో రైతుల్లో చిగురిస్తున్న ఆశలు
  • మరోవైపు భూసేకరణకు కసరత్తు ప్రారంభం
  • పరిహారాలపై దృష్టిపెడుతున్న అధికారులు 

సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్​ నియోజకవర్గంలో రెండేళ్ల క్రితం రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్ ఆర్ ఆర్) కోసం అలైన్​మెంట్​ ఖరారు చేసి హద్దులు నిర్ధారించి పబ్లిక్ హియరింగ్ చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల ముందు భూ సేకరణ, పరిహారాల చెల్లింపు కోసం త్రీడీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ట్రిపుల్​ఆర్​పై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి కామెంట్స్ పై ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది. గతంలో చేసిన అలైన్​మెంట్​ మారితే తమ భూములు బయటపడుతాయని పలువురు రైతులు ఆశలు పెట్టుకుంటున్నారు. మరోవైపు అధికారులు భూసేకరణకు కసరత్తు  ప్రారంభించారు. 

962 ఎకరాల సేకరణ

గజ్వేల్ నియోజకవర్గంలో 32 కిలోమీటర్ల మేర సాగే ట్రిపుల్​ఆర్​ కోసం 962.27 ఎకరాలను అధికారులు సేకరించడానికి సిద్ధమయ్యారు. జగదేవ్ పూర్, గజ్వేల్, వర్గల్, మర్కుక్, ములుగు మండలాల పరిధిలోని 17 గ్రామాల్లో 1168 మంది రైతుల నుంచి ట్రిపుల్ ఆర్ కోసం భూములను సేకరించడానికి రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే ప్రాథమిక కసరత్తు పూర్తి చేసిన అధికారులు సేకరించే భూముల పరిహారాలపై దృష్టి పెడుతున్నారు. మూడు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు. నియోజకవర్గం పరిధిలోని పంట పొలాలగుండానే ట్రిపుల్ ఆర్ అలైన్​మెంట్​ వెళుతోంది.

సెంట్రల్ గవర్నమెంట్ ట్రాన్స్ పోర్ట్, నేషనల్​హై వే మినిస్ట్రీ  ఆమోద ముద్ర పడిన తర్వాత అలైన్​మెంట్​ మార్పునకు అవకాశం ఉంటుందా అనే చర్చ అందరిలో మొదలైంది. రింగ్ రోడ్డుకు 60 కిలో మీటర్ల దూరం నుంచి వెళ్లాల్సిన ట్రిపులార్ ముందుకు జరిగిందని మంత్రి కోమటి రెడ్డి వెంకట్​రెడ్డి కామెంట్స్​చేయడంతో అలైన్​మెంట్​ మారుతుందని రైతులు భావిస్తున్నారు.  

పేద రైతుల్లో టెన్షన్.. టెన్షన్..

రీజినల్​ రింగ్​రోడ్​ నిర్మాణం పేద రైతులను టెన్షన్​కు గురిచేస్తోంది. ట్రిపులార్ అలైన్​మెంట్​ ఖరారైన ప్రాంతాల్లో భూములు బహిరంగ మార్కెట్​లోఎకరాకు రూ. కోటి నుంచి రూ. 2 కోట్లు  పలుకుతున్నాయి. దీంతో  ప్రభుత్వం విలువైన భూములు తీసుకొని పరిహారం పేరిట తక్కువ చెల్లిస్తారని పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఆఫీసర్లు అలైన్​మెంట్​ కోసం హద్దుల దిమ్మెలు కూడా పాతారు.

 ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి పేరు మల్లారెడ్డి. వర్గల్ మండలం నెంటూరుకు చెందిన రైతు. తనకున్న నాలుగు ఎకరాల్లో ఇద్దరు కొడుకులతో కలసి వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నారు. ట్రిపుల్​ఆర్​ అలైన్​మెంట్​ లో భాగంగా తన నాలుగు ఎకరాల్లో రెండెకరాలు పోయే పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల వారి ఉపాధి దెబ్బతినడమే కాకుండాఎకరాకు రూ. కోటి నుంచి రెండు కోట్ల వరకు పలికే విలువైన భూమిని కోల్పోతున్నారు. ఇదే సమయంలో మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి కామెంట్స్ మల్లారెడ్డి కుటుంబంలో ఆశలు రేకెత్తిస్తోంది. ఒకవేళ అలైన్​మెంట్​ మారితే తన విలువైన భూమి తమకే దక్కుతుందని భావిస్తున్నారు. ఇది మల్లారెడ్డి లాంటి వందలాది  చిన్నకారు రైతుల్లో ఆశల్ని పెంచుతోంది.   

ట్రిపుల్​ఆర్​ తో జీవనాధారం కోల్పోతాం 

ట్రిపుల్​ఆర్​ తో మా కుంటుంబానికి చెందిన ఐదు ఎకరాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఈ  భూముల్లో తరతరాలుగా వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నాం. ఇప్పుడు ఉన్న ఫలంగా మా జీవనాధారాన్ని లాక్కొని మమ్మల్ని రోడ్డున పడేస్తామంటే ఎలా..?  పంట పొలాల నుంచి రింగ్ రోడ్డు వేయడాన్ని ప్రభుత్వం మానుకుంటే బాగుంటుంది.

మైసగోని కనకరాజు, రైతు, సామల పల్లి