ప్రజల సొమ్ముతో ఉత్సవాలా..మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి

ఎడపల్లి, వెలుగు: గడిచిన 20 రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేర ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసిందని మాజీ మంత్రి, కాంగ్రెస్​నేత సుదర్శన్​రెడ్డి దుయ్యబట్టారు. శనివారం ఎడపల్లి మండలంలోని బషీర్ ఫారం వద్ద ఉన్న అలీసాగర్ ఎత్తిపోతల పంప్ హౌస్ ను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం వేల కోట్ల ఖర్చుతో ప్రాజెక్ట్​లు నిర్మించి, ప్రజలకు సాగునీరు అందిస్తున్నామని పదేపదే చెబుతున్నా.. ఆచరణలో కనిపించడం లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే శ్రీరాంసాగర్, శ్రీశైలం, నాగార్జున సాగర్ లాంటి అనేక ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్​లు నిర్మించినట్లు పేర్కొన్నారు. 

ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్​ తో తెలంగాణ మొత్తం నీళ్లందిస్తున్నామని ప్రగల్బాలు పలకడం సరికాదన్నారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్ట్​లకు విస్తరణ, ఆధునీకరణ పేరుతో వేల కోట్లు దుర్వినియోగం చేశారన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల కోసం కేటాయించిన రూ.100 కోట్లతో  ఒరిగేందేమీ లేదని, కాంగ్రెస్ హయాంలో ఇదే రూ.100 కోట్లతో తాము అలీ సాగర్ ప్రాజెక్ట్​నిర్మించి, రైతాంగానికి సాగునీరందించామన్నారు. ఉత్సవాలకు ప్రజల సొమ్ము కాకుండా, వాళ్ల పార్టీ ఫండ్ ​కేటాయిస్తే బాగుండేదన్నారు. ప్రాజెక్ట్​ను సందర్శించిన వారిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, లీడర్​భాషా మొహైనుద్దీన్ ఉన్నారు.