అలిశెట్టి ఊపిరి పోసుకున్నదీ.. ఊపిరి ఆగినదీ ఇయ్యాల్నే
కష్టజీవి బతుకును సిరాలో నింపి అక్షరాలతో అగ్గి పుట్టించినోడు.. కలంతో కవాతు చేసినోడు అలిశెట్టి ప్రభాకర్. పెన్సిల్‌తో బొమ్మలేసినా, పెన్నుతో కవిత్వం రాసినా అది ప్రజాపక్షమే. పాలకులను ప్రశ్నించడం, అన్యాయాన్ని ఎదిరించడం, సుత్తిలేకుండా సూటిగా చెప్పడం అలిశెట్టి మాదిరి మరొకరికి సాధ్యం కాదేమో. 1954 జనవరి 12న జగిత్యాలలో జన్మించాడు. తండ్రి మరణంతో కుటుంబ బరువును మోస్తూ.. పుట్టిన గడ్డ మీద పూర్ణిమా స్టూడియో, కరీంనగర్ లో శిల్పి స్టూడియోలు నడిపాడు. జగిత్యాల జైత్రయాత్ర ప్రభావంతో విప్లవ కవిత్వాన్ని ఆయుధంగా ఎంచుకుండు. హైదరాబాద్‌కు మకాం మార్చిన తర్వాత చిత్రలేఖ స్టూడియో సాహితీ మిత్రులకు ఓ అడ్డాలా మారింది. ఎంతో పెద్ద విషయాన్ని చిన్నచిన్న పదాలతో చెప్పడం అలిశెట్టి ప్రత్యేకత.
‘‘29 రోజుల విరహాన్ని భరిస్తే ఒకే ఒక్క రోజు ‘జీతం’ జవరాలితో జలసాలు’’ అందరి కష్టాలను కవిత్వంలో గానం చేశాడు. కానీ తన కష్టాలు ఎవరికి చెప్పుకునేవాడు కాదట. చేతిలో డబ్బుల్లేక, ఇల్లు గడవక చాలా కష్టాలు పడ్డాడు అలిశెట్టి. కష్టజీవి గురించి బాగా తెలిసినోడు గావట్టే ఒక్కమాటలో ఎంతో చెప్పాడిలా…‘పాలరాతి బొమ్మైనా పార్లమెంటు భవనమైనా వాడు చుడితేనే శ్రీకారం వాడు కడితేనే ఆకారం’
‘‘పాత ప్రభుత్వాలతో చితికిపోయిన ప్రజలు.. కొత్త ప్రభుత్వాలతో ‘చితి’కి పోకుంటే చాలు’’ రాజకీయాలు, ఆర్థిక అసమానతలు, సినిమాలు దేన్ని వదలకుండా కవిత్వంతో కడిగేశాడు. అలిశెట్టి రాసిన ప్రతి అక్షరం వెనక ఓ అర్థం ఉంటుంది. ఐదేళ్ల కోసం జరిగే ఎన్నికల గురించి ఆయన రాసింది. ఎన్నికలు జరిగినంత కాలం ఇప్పుడే రాసినట్టు అనిపిస్తుంది. పాలకులనే కాదు ప్రజలను కూడా ప్రశ్నించిన కవి అలిశెట్టి. ‘ఐదేళ్లకోసారి అసెంబ్లీలో మొసళ్లూ పార్లమెంట్లోకి తిమింగలాలూ ప్రవేశించడం పెద్ద విశేషం కాదు జనమే ఓట్ల జలాశయాలై వాటిని బతికించడం విషాదం’
పండితుల భాష, సంస్కృత పదాలు, సంధులు సమాసాలకు సంబంధంలేని జనం భాషలో రాసిండు. ఆ రోజుల్లో అలిశెట్టి ఎంత వరకు చదివాడోగని…చదువుల సారాన్ని ఒక్క మాటలో తేల్చేశాడు. ‘చదువు పొలంలో ఎంత దున్నితే నిరుద్యోగం పంట అంత అధికమౌతుంది’ అప్పటికి ఇప్పటికీ ఇది అక్షర సత్యం. ఆయన రాసిన ఎన్నో కవితలు పుస్తకాలు అచ్చయ్యాయి. ‘ఎర్రపావురాలు’ ఎగరేస్తూ, ‘మంటల జెండాలు’ మోస్తూ, ‘చురకలు’ అంటిస్తూ, ‘రక్తరేఖ’ రాస్తూ, ‘ఎన్నికల ఎండమావి’లా సాగిండు. ‘సిటీ లైఫ్’ మీద ఆయన రాసింది ఎంత చెప్పినా తక్కువే.
కొంత పేరు రాగానే కవులు, రచయితలు ప్రభుత్వాలకు దగ్గరగా ఉండాలని, అవార్డుల కోసం ఆరాటం, సన్మానం కోసం పోరాటం చేస్తుంటారు. మన అలిశెట్టి అట్ల కాదు. కవి అన్నవాడు ప్రజలవైపు ఉండాలి, ప్రజా సమస్యలు రాయాలని గట్టిగా నమ్మిండుగాబట్టే.. ఇంత ధైర్యంగా ఈ కవిత రాయగలిగాడు. ‘అర్భకుడైన కవి ఒకడు అవార్డులు, సన్మానాల కోసం దేబిరించడం తప్ప నగరంలో నేడు అవాంఛనీయ సంఘటనలేవి జరగలేదు’ .ఓ వైపు ఆర్థిక సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేస్తుండగానే టీబీ సోకింది. మెరుగైన వైద్యం చేయించుకోవాలని చాలా మంది మిత్రులు చాలాసార్లు చెప్పినా వినలేదట అలిశెట్టి. ఆరోగ్యం క్షీణిస్తున్నా అక్షర సమరం మాత్రం ఆపలేదు.
ఆ రోజుల్లో ఎందరో కవులకు, రచయితలకు సినీ రంగం బంగారు బాటలు వేసింది. కానీ అక్షరాన్ని నమ్ముకున్న అలిశెట్టి దాన్ని అమ్ముకోలేకపోయాడు. అందరిలా సినీ పరిశ్రమ వైపు వెళ్తే కావాల్సినంత పేరు, సరిపడా డబ్బు సంపాదించి దర్జాగా బతికేవాడేమో. అది తన దారి కాదని.. జనకవి అయ్యాడు. ‘‘నాలుగు గ్లాసులు కలిసి ఒక సీసాను చెరబట్టగా లేనిది రెండు బూతు పాటలు పెట్టి ఒక్క తెలుగు సినిమాను ‘తెర’బట్టలేరా...’’
తను శవమై… ఒకరి వశమై… అంటూ వేశ్యల వ్యథలపై ఆయన రాసింది ఎందరినో ఆలోచింప చేసింది. కవిత్వాన్ని రాస్తూనే 1993 జనవరి 12న కన్నుమూశాడు అక్షర యోధుడు. పుట్టింది, చనిపోయింది జనవరి పన్నెండునే. జయంతి, వర్ధంతి ఒకే రోజు. తెలంగాణలో పుట్టినందుకో, పుట్టిన కులం వల్లనో అలిశెట్టికి రావాల్సిన గుర్తింపు రాలేదు, దక్కాల్సిన గౌరవం దక్కలేదు. తెలంగాణ రాష్ట్రంలోనైనా అలిశెట్టి జయంతి, వర్ధంతులను అధికారంగా జరిపితే బాగుంటుంది. అలిశెట్టి రాసుకున్నట్టే…ఆయన మరణం చివరి చరణం కాలేదు.