
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన స్టెల్త్ గైడెడ్క్షిపణి విధ్వంసక యుద్ధ నౌక ఐఎన్ఎస్ ఇంఫాల్ 2023లో నౌకాదళంలో చేరింది. రెండో ప్రపంచ యుద్ధంలో భాగంగా ఇంఫాల్ యుద్ధం(1944)లో పోరాడిన భారత సైనికుల త్యాగాలకు గుర్తింపుగా నౌకకు ఈ పేరు పెట్టారు.
ఈశాన్య రాష్ట్రంలోని ఒక నగరం పేరును ఓ యుద్ధనౌకకు పెట్టడం ఇదే తొలిసారి. హిందూ మహాసముద్రంలో చైనా ప్రాబల్యం పెరుగుతున్న వేళ మన దేశ రక్షణలో ఇంఫాల్యుద్ధనౌక కీలకపాత్ర పోషిస్తున్నది. దీని పొడవు 163 మీటర్లు, బరువు 7400 టన్నులు. భారత నౌకాదళానికి చెందిన వార్ షిప్ డిజైన్ బ్యూరో దేశీయంగా రూపొందించిన నాలుగు ప్రాజెక్ట్ 15 బ్రావో విశాఖపట్నం క్లాస్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్లలో ఇది మూడోది.
మొదటి ఐఎన్ఎస్ విశాఖపట్నం, రెండోది మోర్ముగావ్, నాలుగోది ఐఎన్ఎస్ విక్రాంత్.ఈ యుద్ధనౌకలను ముంబయిలోని మజగావ్ డాక్ లిమిటెడ్ నిర్మించింది. ఇందులో అధునాతన ఆయుధాలు, సెన్సర్లు ఉన్నాయి. ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణులు, నౌకా విధ్వంసక అస్త్రాలు, టోర్పిడోలను ఈ యుద్ధనౌకలో మోహరిస్తారు. బ్రహ్మోస్ క్షిపణులు కూడా ఇందులో ఉంచవచ్చు.