నారాయణ పూర్ మండల కేంద్రంలో బీజేపీలోకి భారీ చేరికలు
యాదాద్రి భువనగిరి జిల్లా: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు ఉప ఎన్నికలో ఇవ్వబోయే తీర్పు కోసం దేశమంతా ఎదురు చూస్తోందని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తనను గెలిపించిన మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానపరచినందుకు తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని నారాయణపూర్ మండల కేంద్రంలో బీజేపీ పార్టీలోకి పలువురు చేరారు.
అల్లందేవి చెరువు గ్రామం 5వ వార్డు సభ్యురాలు సుర్వి ఆండాళ్లు (సీపీఎం) 1 వార్డు సభ్యుడు వంటల గణేష్ (సీపీఎం)తో పాటు వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు బీజేపీ పార్టీలో చేరారు. ఇదే మండలంలోని పోర్లగడ్డ తండా, నాగమోనిగూడెం, పుట్టపాక నుండి వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు కూడా బీజేపీలో చేరారు. బీజేపీ పార్టీలో చేరడానికి వచ్చిన అందరికీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘనందన్ రావు, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. మునుగోడు తీర్పు కోసం దేశం మొత్తం ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారని అన్నారు. తన మీద నమ్మకంతో ఎమ్మెల్యే రఘనందన్ రావు సమక్షంలో పార్టీలో చేరిన వారికి ధన్యవాదాలు తెలిపారు. మునుగోడు గడ్డ పై కాషాయ జెండా ఎగరేసేంత వరకూ పోరాడాలని పార్టీ శ్రేణులకు రాజగోపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.