- ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్
- కేసీఆర్బరిలో ఉన్న కామారెడ్డి నుంచి అత్యధికంగా 39 పోటీ
నిజామాబాద్, వెలుగు : జిల్లా పరిధిలోని ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 1,549 పోలింగ్ సెంటర్లలో 13,94,986 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 6,61,460 మంది పురుషులు, 7,33,468 మంది స్త్రీలు ఉన్నారు. మొత్తం 77 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. అర్బన్ సెగ్మెంట్లో అధికంగా 21 మంది పోటీపడుతున్నారు. రూరల్, బోధన్‌లో 14 మంది, ఆర్మూర్ లో 13, బాల్కొండ 8, బాన్సువాడలో ఏడుగురు పోటీ చేస్తున్నారు. పోలింగ్విధులు నిర్వహించడానికి 7,458 మందిని నియమించారు.
143 సెక్టార్లను ఏర్పాటు చేసి ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ టీమ్‌ల ద్వారా నిఘా పెట్టనున్నారు. అధికారులు ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రిని తరలించారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా పోలింగ్జరుగనుంది. అనంతరం పోలీస్‌భద్రత మధ్య వీవీప్యాడ్, ఈవీఎంలను డిస్ట్రిబ్యూషన్సెంటర్లలో అప్పగిస్తారు. అక్కడి నుంచి జిల్లా కేంద్రంలోని కౌంటింగ్ సెంటర్(స్ర్టాంగ్‌రూమ్) కు తరలిస్తారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లాలో 455 సెన్సిటివ్, 193 హైపర్ సెన్సిటివ్ పోలింగ్ బూత్‌లను గుర్తించారు.
ఆయా ప్రాంతాల్లో పరిశీలనకు 250 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. పోలింగ్ విధుల కోసం తొమ్మిది కంపెనీల కేంద్ర పోలీసు బలగాలు, 3 వేల మంది జిల్లా పోలీసులను నియమించారు. ఎమర్జెన్సీ కోసం మహారాష్ట్ర పోలీసులను రప్పించారు. 1690 వెబ్ కాస్టింగ్ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటిని కలెక్టరేట్‌నుంచి మానిటరింగ్ చేస్తారు. ఎక్కడ చిన్న సమస్య వచ్చినా నిమిషాల్లో వాలిపోయేలా పోలీసులను సన్నద్ధం చేశారు. 80 ఏండ్లు దాటిన 2,248 మంది వృద్ధుల ఇండ్లకు వెళ్లి సిబ్బంది సేకరించిన ఓట్లు ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్‌కు చేరాయి.
కామారెడ్డి : అసెంబ్లీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే సిబ్బంది పోలింగ్సెంటర్లకు చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం బందోబస్తు
చేపట్టింది.
కామారెడ్డిలో తీవ్ర పోటీ
కామారెడ్డిలో తీవ్రమైన పోటీ ఉంది. ఇక్కడ 39 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. బీఆర్ఎస్తరఫున ఆ పార్టీ అధినేత కేసీఆర్, కాంగ్రెస్ నుంచి టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, బీజేపీ నుంచి జడ్పీ మాజీ చైర్మన్ వెంకటరమణారెడ్డి పోటీలో ఉన్నారు. వీరితో పాటు వివిధ పార్టీలకు చెందిన వారు,
స్వతంత్ర అభ్యర్థులు 36 మంది సైతం పోటీ పడుతున్నారు. మొత్తం 2,52,460 మంది ఓటర్లుండగా, 1,22,019 పురుషులు, 1,30,417 స్త్రీలు, 24 మంది ఇతరులు ఉన్నారు.
స్వేచ్ఛగా ఓటేయండి
ఓటర్లు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటేయాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వి పాటిల్పేర్కొన్నారు. ఓటేయడం ప్రతీఒక్కరి నైతిక బాధ్యత అని అన్నారు. ఓటర్ కార్డు, స్లిప్పులు లేకపోయినా ఎన్నికల సంఘం గుర్తించిన 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒక దానితో పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటెయొచ్చని సూచించారు.
జితేశ్ వి పాటిల్, కామారెడ్డి కలెక్టర్
ఎల్లారెడ్డి బరిలో 11 మంది, జుక్కల్‌లో 17..
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 11 మంది బరిలో నిలిచారు. బీఆర్ఎస్ నుంచి జాజాల సురేందర్, కాంగ్రెస్ నుంచి మదన్ మోహన్‌రావు, బీజేపీ నుంచి వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి పోటీ పడుతున్నారు. మొత్తం 2,20,531 మంది ఓటర్లుండగా, 270 పోలీంగ్కేంద్రాలను ఏర్పాటు చేశారు. జుక్కల్‌లో 17 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి హన్మంత్‌షిండే, కాంగ్రెస్‌నుంచి లక్ష్మీకాంత్రావ్, బీజేపీ నుంచి అరుణతార పోటీలో ఉన్నారు. 1,99,962 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.