పోలింగ్​కు రెడీ..లోక్ సభ ఎన్నికల నిర్వాహణకు పకడ్బందీగా ఏర్పాట్లు

పోలింగ్​కు రెడీ..లోక్ సభ ఎన్నికల నిర్వాహణకు పకడ్బందీగా ఏర్పాట్లు
  •     క్రిటికల్​ పోలింగ్​ స్టేషన్లపై స్పెషల్​ ఫోకస్​ 
  •     మీడియాతో ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్లు వీపీ గౌతమ్, ప్రియాంక అల 

భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం టౌన్, వెలుగు : సార్వత్రిక ఎన్నికలకు సిర్వం సిద్ధం చేసినట్టు ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్లు వీపీ గౌతమ్, డాక్టర్​ ప్రియాంక అల తెలిపారు.  శనివారం ఆయా జిల్లాల కలెక్టరేట్ లో ఎన్నికల ఏర్పాట్లపై మాట్లాడారు. కేంద్ర ఎన్నికల కమిషన్ పోలింగ్ సమయం ఒక గంట పొడిగించిందన్నారు. ఖమ్మం జిల్లాలో సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటు వేయవచ్చని రిటర్నింగ్​ అధికారి గౌతమ్​తెలిపారు. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో 1896 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు కలిపి 16 లక్షల 31 వేల 39 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. పారదర్శక ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ గ్రామంలోని శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కాలేజీలో, మధిరలోని ప్రభుత్వ పాలిటెక్నిక్  కాలేజీలో, వైరాలోని సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో, సత్తుపల్లి లోని జ్యోతి నిలయం హైస్కూల్ లో, కొత్తగూడెంలోని రామచంద్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, అశ్వారావుపేటలోని వ్యవసాయ కళాశాలలో ఈవీఎం స్ట్రాంగ్ రూములు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

జిల్లాలో ఇప్పటి వరకు 98 శాతం స్లిప్పులు ఇంటింటికీ తిరిగి పంపిణీ చేసినట్లు తెలిపారు. పోలింగ్ కు 48 గంటల ముందు నుంచి సైలెన్స్ పీరియడ్ లో ప్రచార కార్యక్రమాలపై, లౌడ్ స్పీకర్లపై నిషేధం ఉంటుందన్నారు.144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. ఒపీనియన్ పోల్, ఎగ్జిట్ పోల్ నిషేధించినట్లు చెప్పారు. 11 సాయంత్రం 6 గంటల నుంచి 13 పోలింగ్ పూర్తయ్యేంత వరకు వైన్స్ షాప్స్, బార్లు బంద్ చేసినట్లు తెలిపారు. ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఓటర్లకు సూచించారు. 

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో.. 

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని ఐదు నియోజకవర్గాలను మావోయిస్ట్​ ప్రభావిత ప్రాంతాలుగా ఎన్నికల సంఘం గుర్తించిందని కలెక్టర్​ ప్రియాంక అల తెలిపారు. జిల్లాలో పోలింగ్​ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే ఉంటుందని వెల్లడించారు. జిల్లాలోని 1,105 పోలింగ్​ కేంద్రాలకు గానూ 169 పోలింగ్​ కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించామన్నారు. అన్ని పోలింగ్​ కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు.

మావోయిస్ట్​ ప్రభావిత ప్రాంతాల్లోని పోలింగ్​ కేంద్రాల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. జిల్లాలోని అన్ని పోలింగ్​ కేంద్రాలకు సిబ్బంది ఆదివారం సాయంత్రం వరకు చేరుకునేలా ప్లాన్​ చేశామన్నారు. అన్ని పోలింగ్​ కేంద్రాల్లో ఓటర్లకు అవసరమైన సౌకర్యాలు కల్పించామని వివరించారు.

పటిష్ట బందోబస్తు 

స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా పెట్టామన్నారు. జిల్లాలోని 209 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలపై స్పెషల్​ఫోకస్​పెట్టినట్లు చెప్పారు. 2391 మంది పోలీసులు, 6 కంపెనీల సీఐపీఎఫ్ బలగాలు బందోబస్తు విధుల్లో ఉంటాయన్నారు. 20 ప్రత్యేక టీమ్​లు  శాంతిభద్రతల, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు జరిగేలా చూస్తాయని వివరించారు.