మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ) రోహిత్ వెల్లడించారు. నల్గొండలోని ఆర్జాలబావి దగ్గరున్న FCI గోదాంలో కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కు సంబంధించిన వివరాలు తెలుసుకొనేందుకు v6 ఆయనతో ముచ్చటించింది. 21 టేబుల్స్ పై 15 రౌండ్లలో కౌంటింగ్ జరగనుందని, ఒక్కో రౌండ్ లో 21 పోలింగ్ కేంద్రాల ఓట్లు లెక్కిస్తామని ఆర్ఓ రోహిత్ తెలిపారు.
మొదటగా 686 పోస్టల్ బ్యాలట్ ఓట్లను లెక్కించి.. తర్వాత ఈవీఎంలు ఓపెన్ చేస్తామన్నారు. 8.30 గంటలకు కౌంటింగ్ ప్రారంభిస్తామని, ఒక్కో టేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్ వైజర్, ఇతర అధికారులు ఉంటారని వివరించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద అభ్యర్ధి లేదా అతడి తరఫు ఏజెంట్ ఉండేందుకు అనుమతి ఇస్తామన్నారు. 47 మంది అభ్యర్ధులుండడంతో కౌంటింగ్ ఎప్పటి వరకు కొనసాగుతుందో స్పష్టంగా చెప్పలేమని స్పష్టంచేశారు. కౌంటింగ్ హాల్ వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామన్నారు.
ఎన్నికల సంఘం నిబంధనలను పకడ్బందీగా అమలు చేస్తామన్నారు. మొదటి రౌండ్ ఫలితం ఉదయం 9 గంటలకు.. చివరి రౌండ్ ఫలితం మధ్యాహ్నం 1గంట వరకు ప్రకటిస్తారు. మొదటగా చౌటుప్పల్, తర్వాత నారాయణపురం, మునుగోడు, చండూరు, మర్రిగూడెం, నాంపల్లి, గట్టుప్పుల్ మండలాల ఓట్లు లెక్కిస్తారు. కౌంటింగ్ లో పాల్గొనే సిబ్బంది కి మూడు దఫాలుగా శిక్షణ ఇచ్చారు.