
ఆంధ్రప్రదేశ్ లో రేపటి నుంచి ప్రారంభంకానున్న ఇంటర్మీడియేట్ పరీక్షల నిర్వహణకు ఇంటర్మీడియట్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. మార్చి 1 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్, మార్చి 2న సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ప్రారంభంకానున్నాయి. మార్చి 1 నుంచి 20 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,559 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు 10 లక్షల వరకూ అభ్యర్థులు హాజరుకానున్నారు. ఇందులో ఇంటర్ మొదటి సంవత్సరం 4.73 లక్షల మంది, ఇంటర్ రెండో సంవత్సరం 5.29 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
పరీక్షల నిర్వహణకు బోర్డు పకడ్భందీ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఆయా పరీక్ష కేంద్రాల్లో అన్ని గదుల్లో సీసీ కెమెరాలు పెట్టారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్ధుల హాజరును ఆన్‌లైన్ ద్వారా తీసుకోనున్నారు. అలాగే పరీక్ష పేపర్లకు క్యూఆర్ కోడ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. పేపర్‌ను ఎక్కడ ఫొటో తీసినా, స్కాన్ చేసినా వెంటనే వివరాలు తెలిసిపోయేలా ఏర్పాటు చేశారు.