![మహదేవపూర్ మండలంలో కాళేశ్వరం కుంభాభిషేకానికి రెడీ](https://static.v6velugu.com/uploads/2025/02/all-arrangements-have-been-completed-for-kumbhabhishekam-to-be-held-in-kaleshwaram_WQOpVhLKS7.jpg)
మహదేవపూర్, వెలుగు : జయశంకర్ భూపాలపల్లి మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో నిర్వహించనున్న కుంభాభిషేకానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గోపురాలపైకి వెళ్లేందుకు మెట్లను ఏర్పాటు చేశారు. పుష్కరఘాట్ వద్ద పుణ్యస్నానాలకు ఏర్పాటు పూర్తి చేసినట్లు ఈవో మహేశ్ తెలిపారు. కాళేశ్వరం మహా కుంభాభిషేక మహోత్సవాల ఆహ్వాన పత్రికను కలెక్టర్ రాహుల్ శర్మకు ఐడీవోసీ ఆఫీస్‌లో ఈవో అందజేశారు.
ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు..
కాళేశ్వరంలో జరుగుతున్న కుంభాభిషేకం ఏర్పాట్లను బుధవారం కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే వేర్వేరుగా పరిశీలించారు. కలెక్టర్ మహా కుంభాభిషేకం గోడపత్రికలు ఆవిష్కరించి, మాట్లాడుతూ రాష్ర్టంలో మొదటిసారిగా జరుగుతున్న మహా కుంభాభిషేకం కార్యాన్ని ఘనంగా జరపాలన్నారు. దాదాపు 42 ఏండ్ల తరువాత జరుగుతున్న కార్యక్రమానికి చాలా ప్రాధాన్యత ఉందన్నారు. అన్ని శాఖల అధికారులు సమిష్టి కృషితో విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమాన్ని భక్తులు వీక్షించేందుకు వీలుగా ఎల్ ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. భక్తులు రద్దీ నియంత్రణ, క్యూ పాటించడానికి వీలుగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, దేవాలయ శాఖ రీజినల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణారావు, డిప్యూటీ కమిషనర్ సుమలత, డీపీవో నారాయణరావు, ఇరిగేషన్ ఈఈ తిరుపతి, పీఆర్ ఇంజినీర్ వెంకటేశ్వర్లు, డీపీఆర్వో శ్రీనివాస్, కాటారం డీఎస్పీ రామిరెడ్డి, ఆలయ ఈవో మహేశ్, అర్చకులు కృష్ణ మూర్తి శర్మ తదితరులు పాల్గొన్నారు. కాళేశ్వరంలో ఏర్పాట్లను ఎస్పీ కిరణ్ ఖరే పరిశీలించారు. మహా కుంభాభిషేకంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు చోటివ్వదన్నారు. ఆలయ పరిసరాలు, మెయిన్ ఘాట్, వీఐపీ ఘాట్లను, బైపాస్ రోడ్డును పరిశీలించి సూచనలు చేశారు. వాహనాలకు పార్కింగ్ ఉండే విధంగా, ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్పీ వెంట కాటారం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి , మహదేవపూర్ సీఐ రామ్ చందర్రావు, ఎస్సై జి.తమాశ రెడ్డి పాల్గొన్నారు .