రేపు మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక జరగనుంది. కల్వకుర్తి ఎమ్మెల్యేగా కసిరెడ్డి నారాయణరెడ్డి గెలవడంతో ఆయన.. తన ఎమ్మెల్సీ పదవికి ఆయన రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త మన్నే జీవన్ రెడ్డి , బీఆర్ఎస్ నుంచి మాజీ జడ్పీ చైర్పర్సన్ నవీన్ రెడ్డి పోటీలో ఉన్నారు.
ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ ఓటర్లను ఇప్పటికే క్యాంపుకు తరలించాయి. క్యాంపులో ఉన్న స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు అంతా నేరుగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటెయ్యనున్నారు. ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సమీక్ష నిర్వహించారు. గోవా, ఊటీ, కొడైకెనాల్ నుంచి బీఆర్ఎస్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు..ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పాల్గొనబోతున్నారు.
Also Read: పంటలు ఎండిపోవడం ప్రకృతి వైపరీత్యం కాదు పాలకుల వైఫల్యమే
క్రాస్ ఓటింగ్ పై రెండు పార్టీలు నమ్మకం పెట్టుకున్నాయి. మొదటి ప్రాధాన్యత ఓట్ల క్రమంలోనే విజయం సాధించాలని కాంగ్రెస్ భావిస్తుంటే ఎలాగైనా...పాత స్థానాన్ని దక్కించుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. మెజార్టీ ఓటర్లు తమతోనే ఉన్నారన్న ధీమాతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు క్యాంపు రాజకీయాలు చేస్తున్నాయి. రేపు ఎమ్మెల్సీ పోలింగ్ లో పాల్గొనేలా నేరుగా క్యాంపు నుంచి ఓటర్లను తీసుకువచ్చేందుకు రెండు పార్టీలు ఏర్పాట్లు చేశాయి.
మహబూబ్ లో ఎమ్మెల్సీ ఎన్నికలకు మొత్తం 1439 ఓట్లు ఉన్నాయి. ఇద్దరు ఎంపీలు, 14మంది MLAలు, ముగ్గురు MLCలు, 888 మంది MPTCలు, 83 మంది ZPTCలు, 449 మంది కౌన్సిలర్లు.. తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి సైతం ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.