- ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు ముస్తాబైన యాదగిరిగుట్ట, వేములవాడ
- గుట్టలో ఉదయం 5.15 గంటల నుంచి 6.30 గంటల వరకు నారసింహుడి దర్శనం
- యాదగిరిగుట్టలో నేటి నుంచి 15 వరకు అధ్యయనోత్సవాలు
యాదగిరిగుట్ట/వేములవాడ, వెలుగు : ముక్కోటి ఏకాదశి వేడుకలకు యాదగిరిగుట్ట, వేములవాడ ఆలయాలు ముస్తాబు అయ్యాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుక్రవారం నిర్వహించనున్న ఉత్తర ద్వారదర్శనానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. యాదగిరిగుట్టలో శుక్రవారం ఉదయం 5.15 గంటల నుంచి 6.30 గంటల వరకు స్వామి వారు ఉత్తరద్వారం గుండా దర్శనం ఇవ్వనున్నారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండడంతో ఉత్తర రాజగోపురం ఎదుట బారికేడ్లు, గ్రిల్స్ ఏర్పాటు చేశారు. ప్రధానాలయం, ఆలయ మాడవీధులు, ఆలయ పరిసరాలను పూలు, విద్యుత్ లైట్లతో అలంకరించారు. సాధారణ భక్తులకు ఇబ్బందులు కలగకుండా వీఐపీల కోసం ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు.
రద్దీ కారణంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు చేపట్టారు. ఉత్తర ద్వారదర్శనం అనంతరం స్వామివారిని ఆలయ మాఢ వీధుల్లో ఊరేగించనున్నారు. అనంతరం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు గర్భాలయంలో స్వయంభు నారసింహుడి దర్శనం ఇవ్వనున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుక్రవారం ఒక్కరోజు బ్రేక్ దర్శనాలతో పాటు నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణాలు, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహహోమం, జోడుసేవలు, లక్షపుష్పార్చన, ఆర్జిత నిజాభిషేకం, సహస్రనామార్చన వంటి కైంకర్యాలను రద్దు చేశారు.
ALSO READ : కరీంనగర్ జిల్లాలో స్థానిక ఎన్నికలకు ఏర్పాట్లు షురూ
వేములవాడలో...
ముక్కోటి ఏకదాశి వేడుకల సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయాన్ని విద్యు్ద్దీపాలు, పూలతో ముస్తాబు చేశారు. శుక్రవారం ఉదయం సుప్రభాతసేవ, ఆలయ శుద్ధి, ప్రాతఃకాల పూజ నిర్వహించి 5.10 గంటల తర్వాత ఉత్తర ద్వారం గుండా హరిహరుల దర్శనం కల్పించనున్నారు. భక్తులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున అర్జిత సేవలైన అభిషేక టికెట్లు రద్దు చేసి అన్నపూజ సేవా టికెట్స్‌ను మాత్రం యథావిధిగా కొనసాగించనున్నట్లు ఆఫీసర్లు తెలిపారు.
యాదగిరిగుట్టలో నేటి నుంచి అధ్యయనోత్సవాలు
యాదగిరిగుట్టలో శుక్రవారం నుంచి అధ్యయనోత్సవాలు ప్రారంభం కానున్నాయి. శుక్రవారం మొదలయ్యే ఉత్సవాలు ఈ నెల 15 వరకు ఆరు రోజుల పాటు కొనసాగనున్నాయి. అధ్యయనోత్సవాల్లో భాగంగా 10న ఉదయం లక్ష్మీనరసింహస్వామి అలంకారం, సాయంత్రం మత్స్యాలంకారంలో స్వామివారు కనిపించనున్నారు. అలాగే 11న వేణుగోపాల కృష్ణాలంకారం, గోవర్ధనగిరిధారి అలంకారం, 12న రామావతారం, వెంకటేశ్వరస్వామి అలంకారం, 13న కృష్ణుడు, కాళీయమర్ధనుడి అలంకారం, 14న వటపత్రశాయి అవతారం
వైకుంఠనాథుడి అలంకారం, 15న ఉదయం శ్రీలక్ష్మీనరసింహస్వామి అలంకారం నిర్వహించనున్నారు. దీంతో అధ్యయనోత్సవాలు ముగుస్తాయి. అధ్యయనోత్సవాలు జరిగే ఆరు రోజుల పాటు ఆర్జిత సేవలైన హోమం, నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణాలు, బ్రహ్మోత్సవాల కైంకర్యాలను రద్దు చేస్తున్నట్లు ఆఫీసర్లు ప్రకటించారు.