ఆదిలాబాద్ :నేడే ఓట్ల పండుగ

  • ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు
  • పది నియోజకవర్గాల బరిలో 148 మంది అభ్యర్థులు 

ఆదిలాబాద్  నెట్​వర్క్, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆయా జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ల పర్యవేక్షణలో ఎన్నికల సిబ్బందికి బుధవారం ఈవీఏం, వీవీప్యాట్లు, ఇతర సామాగ్రి అందజేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీటీడీసీ కేంద్రంలో కలెక్టర్ రాహుల్ రాజ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రత్యేక బస్సుల్లో ఎన్నికల సిబ్బంది ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఉమ్మడి జిల్లాలోని మొత్తం పది నియోజకవర్గాల్లో 22,64,071 మంది ఓటర్లు ఉన్నారు. ప్రధాన పార్టీలతో పాటు, ఇతర పార్టీల వారు, ఇండిపెండెంట్లు కలిపి మొత్తం 148 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు.

ఎన్నికల కోసం నోడల్ అధికారులు, పీవో, ఏపీవో, ఓపీ, సెక్టోరియల్, రూట్ అధికారులు, మైక్రో అబ్జర్ల దాదాపు మొత్తం 10,716 మంది ఈ ఎన్నికల కోసం పనిచేయనున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు అధికారులు అనేక చోట్ల మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పూలు, బెలూన్లతో అందంగా తీర్చిదిద్దారు. కేంద్రాల వద్ద ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తిచేసినట్లు కలెక్టర్లు తెలిపారు. 

సమస్యాత్మక కేంద్రాలపై ఫోకస్..

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సమస్యాత్మక కేంద్రాలపై అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. జిల్లాలో 2,856 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా అందులో 308  కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించారు. ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్ ప్రారంభం కానుడగా.. ఆయా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా స్థానిక పోలీసులతో పాటు ఉమ్మడి 34 కంపెనీల బీఎస్ఎఫ్ బలగాలు మోహరించాయి. ఆదిలాబాద్ జిల్లాకు మహారాష్ట్ర నుంచి 550 మంది హోంగార్డులను విధుల్లోకి తీసుకున్నారు. పెట్రోలింగ్ పార్టీలు, క్విక్ రియాక్షన్ టీమ్స్, స్ట్రయికింగ్ ఫోర్సు ఇలా ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు.

గురువారం ఉదయం 6 గంటల నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉండనుంది. ఈ నేపథ్యంలోనే ఐదుగురికంటే ఎక్కువ మంది గుమిగూడవద్దని హెచ్చరిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 2400, ఆసిఫాబాద్​లో 2,200, నిర్మల్ జిల్లాలో 2500 మంది పోలీసులలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం 5.30 గంటలకే మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. అన్ని పార్టీల పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో ఈ ప్రక్రియ సాగుతుంది. అనంతరం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరం వరకు ఆంక్షలు ఉంటాయి.