బిల్లులన్నీ పెండింగ్​లోనే..రావాల్సింది  రూ. 20 కోట్లకు పైనే..

  • యాదాద్రిలో డెవలప్​మెంట్ వర్క్స్​ ప్రోగ్రెస్​పై ఎఫెక్ట్​
  • జిల్లాకు సంబంధించి సెక్రటేరియట్​లో 300 పైగా చెక్కులు 
  • మార్చి దాటితే చెక్కులన్నీ చెత్తబుట్టలోకే..

యాదాద్రి, వెలుగు: బిల్లుల పెండింగ్​ కారణంగా యాదాద్రి జిల్లాలో డెవలప్మెంట్ వర్క్స్​ ప్రోగ్రెస్​పై ప్రభావం పడుతోంది. నెలలు గడుస్తున్నా బిల్లులు రాకపోవడంతో సర్పంచ్​లు, కాంట్రాక్టర్లు ఇబ్బంది పడుతున్నారు. స్పెషల్​ డెవలప్​మెంట్​ ఫండ్​ (ఎస్​డీఎఫ్​) కింద పంచాయతీలు, మున్సిపాలిటీలకు పెద్ద ఎత్తున డెవలప్మెంట్​ వర్క్స్​ మంజూరు చేస్తున్నట్టు దత్తత గ్రామమైన వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ రెండేండ్ల కింద ప్రకటించారు. యాదాద్రి జిల్లాకు 2430 వర్క్స్​కు రూ. 108 కోట్ల ఫండ్స్​వస్తున్నట్టు తేలింది. దీంతో జిల్లాలోని సర్పంచ్​లు, బీఆర్​ఎస్​ లీడర్లు ఆశపడ్డారు. రూ. 5 లక్షల లోపు పనులను నామినేటెడ్​గా సర్పంచ్​లు, పార్టీ లీడర్లకు ఎమ్మెల్యేలు కేటాయించడంతో మరింత ఆనందంలో మునిగిపోయారు. ఈ ఆనందంలో కొందరు సర్పంచ్​లు, లీడర్లు జిల్లా వ్యాప్తంగా రూ. 28 కోట్ల విలువైన 370 పనులు ప్రారంభించారు. వీటిలో సగానికిపైగా వర్క్స్​ కంప్లీట్​అయ్యాయి. సర్పంచ్​లు, కాంట్రాక్టర్లు ఇవ్వాల్సిన వాళ్లకు కమీషన్లు ఇచ్చి బిల్లులకు సంబంధించిన చెక్కులను ఈ కుబేర్​లో ఎంట్రీ చేయించారు. సెక్రటేరియట్​కు వెళ్లిన చెక్కులు వెళ్లినట్టే ఆగిపోయాయి. నిధుల లేమి కారణంగా ఆరు నెలలు గడుస్తున్నా బిల్లులు రిలీజ్​ కావడం లేదు. దీంతో కొత్తగా వర్క్స్​ ప్రారంభించడానికి ఎవరూ ముందుకు 
రావడం లేదు. 

సీడీఎఫ్​ వర్క్స్ దీ అదే పరిస్థితి.. 

నియోజకవర్గ అభివృద్ధి నిధులు (సీడీఎఫ్​) కింద పనులు చేపట్టిన సర్పంచ్​లు, కాంట్రాక్టర్ల బిల్లులు కూడా రావడం లేదు. ఒక్కో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీడీఎఫ్​ కింద రూ. 3 కోట్ల డెవలప్​మెంట్ వర్క్స్​ చేపట్టవచ్చు. దీంతో ఆలేరు, భువనగిరి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ తమతమ నియోజకవర్గాల్లో కొన్ని వర్క్స్​ కేటాయించారు. నకిరేకల్ నియోజకవర్గంలోని రామన్నపేట, మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్, నారాయణపురం, తుంగతుర్తి నియోజకవర్గంలోని మోత్కూరు, అడ్డగూడూరు మండలాల్లో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పనులు చేయించారు. కానీ ఈ వర్క్స్​కు సంబంధించిన బిల్లుల చెక్కులు కూడా సెక్రటేరియట్​లోనే ఆగిపోయాయి. 

నిల్చిన రూ. 20 కోట్లు 

ఎస్​డీఎఫ్, సీడీఎఫ్​తో పాటు కలెక్టర్​ఆధీనంలోని కృషీయల్​బ్యాలెన్స్​ ఫండ్​ (సీబీఎఫ్​) చెక్కులు కలిపి 300కు పైగా సెక్రటేరియట్​లో నిలిచిపోయాయి. ఈ చెక్కుల విలువ సుమారు రూ. 20 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. 

ఆగిన వెహికల్స్​అలవెన్స్​ 

వివిధ డిపార్ట్​మెంట్స్​ హెచ్​వోడీల వెహికల్స్​ అలవెన్స్​ కూడా ఆపేసినట్లు తెలుస్తోంది. జిల్లాలో దాదాపు 60 మంది హెచ్​వోడీలు, మరో 50 మంది ఇతర ఆఫీసర్లకు వెహికల్స్​ అలవెన్స్​ ఇస్తోంది. ఒక్కొక్కరికీ రూ. 32,340 చొప్పున అలవెన్స్​ ఇవ్వాల్సి ఉంది. అయితే ఆరు నెలలుగా ఈ అలవెన్స్​ను ఇవ్వడం లేదని సమాచారం. ఈ లెక్కన దాదాపు రూ. 2 కోట్ల వరకూ ఆఫీసర్లకు వెహికల్స్​ అలవెన్స్​ రావాల్సి ఉంది. 

మార్చి 31 దాటితే అంతే..!

ఈ నెలాఖరు నాటికి బిల్స్​రిలీజ్​కాకుంటే చెక్కులన్నీ పనికిరావు. డెవలప్​మెంట్​ వర్క్స్​కు సంబంధించిన బిల్లులైతే మళ్లీ మొదటి నుంచి ప్రారంభించి చెక్కులను తిరిగి ఈ కుబేర్​లో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఆఫీసర్స్​ వెహికల్స్​ అలవెన్స్​ మాత్రం ఇక రానట్లే. దీంతో ఆరు నెలల అలవెన్స్​ తాము నష్టపోతున్నామని ఆఫీసర్లు చెబుతున్నారు.