ఎంతో గోస పడి, నష్టపోయి, త్యాగాలు చేసి సాధించిన రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం గత తొమ్మిది సంవత్సరాల నుంచి బీసీలకు మరీ మొండి చేయి చూపించిందని బీసీ కులాలన్నీ ఎన్నికల ముందు ఒక్కసారిగా గళం విప్పుతున్నాయి. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలన్నీ బిక్షలుగా మారినాయి. అభివృద్ధి పథకాలన్నీ అటకెక్కినాయి.
బీసీ కులాలు రాజకీయంగా చైతన్యం చాటుకుంటే తప్ప ఆ కులాలకు న్యాయం జరిగే పరిస్థితులు..వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో జరిగేటట్లు కనిపించడం లేదు. పద్మశాలీలు రాజకీయ యుద్ధభేరీ మోగించడానికి సిద్ధమవుతున్నారు. అలాగే, ఇతర బీసీ కులాలు కూడా జనసమీకరణలతో తమ శక్తిని చాటుకుంటున్నాయి. తొమ్మిదేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై బీసీ కులాలన్నీ ఇవాళ అన్ని విధాలుగా విశ్లేషించుకున్నాయి. చైతన్యం దిశగా అడుగులు వేస్తున్నాయి.
బతుకుదెరువు లేక తెలంగాణ పద్మశాలి కుటుంబాల నుంచి లక్షలాది మంది భీవండి, షోలాపూర్, సూరత్, అహ్మదాబాద్, బొంబాయి నగరాలకు, గల్ఫ్ దేశాలకు ఉపాధి, జీవనాధారం కొరకు వలస వెళుతున్నారు. మిగిలిన అనేక వెనుకబడిన కులాల యువత కూడా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరకక కొట్టుమిట్టాడుతున్నారు. ఎవరి వృత్తిని వారే చేసుకుని బతకండి అని పాలకులు చెబుతున్నారు. గొర్లు తీసుకొండి, చాపలు తీసుకొండి, చెప్పుల దుకాణాలు పెట్టుకొండి, దోబీ ఘాట్స్ కట్టుకొండి అని నామమాత్రపు తాయిలాలు ఇస్తూ పనికిరాని పథకాలతో ప్రజలను మభ్య పెడుతున్నారే తప్ప, చదువుకోండని అంటలేరు. తెలంగాణ వ్యాప్తంగా చదువు అటకెక్కింది, ప్రతి యూనివర్సిటీ లో నిధుల కొరత, ఫాకల్టీ కొరత, తరగతి గదుల కొరత.. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్. మీ పూర్వపు వృత్తులు మీరే చేసుకొండి. జాగీర్లు, ఎస్టేట్లు, రాజకీయ అధికారం మాకే ఉండనివ్వండి, మా భూములు మావే అని చెప్పినట్లుఉంది.
గ్లోబలైజేషన్, సరళీకరణ, ప్రైవేటీకరణ చేసిన పాలకులు బీసీలు మాత్రం కులవృత్తులు చేసుకోండని ముఖ్యమంత్రియే స్వయంగా చెబుతున్నారు. తెలంగాణ లో అత్యధికంగా ఉన్న పద్మశాలీ కులస్తులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత తొమ్మిది సంవత్సరాల నుంచి చట్టసభల్లో అవకాశం కల్పించలేదు. అక్కడక్కడ వ్యక్తిగతంగా ఏర్పాటు చేసుకున్న పవర్ లూమ్ మగ్గాలకు వడ్డీ రాయితీ, పెట్టుబడి రాయితీ, కరెంటు రాయితీలు కూడా ఇవ్వడం లేదు. కనీసం చేనేత బట్టలను ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయడం తెలంగాణ రాష్ట్రంలో నిలిపివేశారు. ఉన్న కొద్ది చేనేత మగ్గాలను కూడా ఆదరించక నిరుత్సాహ పరుస్తున్నది ఈ ప్రభుత్వం. సమస్యలను పరిష్కరించడానికి బీసీ నాయకులు చేసే ప్రయత్నాలు ఫలించడం లేదు.
యాదవ సభ
దీనికి తోడు అదే రోజున రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వేదికగా యాదవ సమాజం కూడా తమ రాజకీయ హక్కుల కోసం గర్జిస్తున్నారు. జనాభా ప్రాతిపదికన 22 ఎమ్మెల్యేలు, 7 ఎమ్మెల్సీలు, 5 లోక్ సభ సీట్లతో పాటు రాజ్యసభలో సైతం తగిన ప్రాతినిధ్యం కల్పించాలని, గొర్రెల కోసం కాకుండా రాజకీయాధికారం కోసం గొంతెత్తాలని ఆగష్టు 13 న సరూర్ నగర్ గ్రౌండ్ వేదికగా లక్ష జనంతో రాజకీయ యుద్ధభేరి నగారా మోగిస్తున్నారు.
ఈ రెండు కులాలు అత్యధిక జనాభా కలిగిన బీసీ కులాలు కావడంతో రెండూ కూడా ఒకే రోజున రాజకీయ యుద్ధభేరీలను ఏర్పాటు చేసుకోవడం, మిగతా బీసీ కులాల వారిని ఆ దిశగా ఆలోచించేలా చేస్తున్నాయి. ఇందులో భాగంగానే గౌడ, ముదిరాజ్, మున్నూరు కాపు, రజక, నాయీబ్రాహ్మణ తదితర కులాలు కూడా ఇదే పంథాను ఆచరించేలా సన్నాహకాలు నడుస్తున్నట్టు వినికిడి. ప్రభుత్వానికి వివిధ రాజకీయ పార్టీలకు కనువిప్పు కలిగించే విధంగా ప్రస్తుతం జరుగుతున్న సభలను దిగ్విజయం చేయాల్సిన అవసరం బీసీ సమాజం మీద ఉంది. మిగిలిన సామాజిక వర్గాల నాయకులు కూడా సంఘీభావం తెలపాలని కోరుతున్నాం.
బీసీల సమష్టి పోరాటం
కనీసం ఎన్నికల సందర్భంలోనైనా బీసీ కులాలు, సంఘాల నాయకులు రాజకీయ పార్టీలకు అతీతంగా మేధావుల నాయకత్వంలో సంఘటితమై రాజ్యాంగం ప్రకారం తమకు చెందవలసిన అన్ని హక్కులను లాక్కునే సమయం ఆసన్నమైందని గుర్తుంచుకోవాలి.
ఉపేక్షించినట్లయితే కార్పొరేట్ రాజకీయాలను ప్రజలపై రుద్దుతూ పేద వర్గాలను బానిసలుగా చేసుకొని మద్యం మత్తులో భిక్షగాళ్లను చేసే ప్రక్రియలు మరింత వేగవంతం చేసే ప్రమాదం పొంచి ఉంది. ఈ ఎన్నికల సందర్భంలో బీసీ కులాల విద్యావంతులు, యువత, కార్మికులు చైతన్యవంతమైన మహిళలు సమష్టి పోరాటాలు చేసి రాజకీయాధికారం సాధించి బీసీ కులాలను అభివృద్ధి పథంలో నడపాలి.
బీసీ కులాల్లో పెరుగుతున్న చైతన్యం
నిచ్చెన మెట్లలాగా బీసీ కులాల ప్రజలను బానిసలకు బతకండని శాసిస్తున్నారు ఈ పాలక వర్గాలు. ఇదంతా ఎందుకు జరుగుతున్నదంటే వెనుకబడిన కులాల ప్రజలు అందరూ ఒకే తాటి మీదకు వచ్చి రాజకీయంగా సంఘటితం కాకపోవడం వల్లే. అన్యాయానికి గురవుతున్నా, ప్రజలు ఐక్యంగా పోరాడకుంటే ఈ కుటుంబ ఆధిపత్య కార్పొరేట్ రాజకీయ వ్యవస్థలో ఏ సమస్యా పరిష్కారం కాదు. గత తొమ్మిదేండ్ల అనుభవాలు చెబుతున్నాయి.
ఈ సామాజిక వర్గాలకు న్యాయం చేయక అణచివేతకు గురిచేసిన రాజకీయ పార్టీలకు తగిన విధంగా కనువిప్పు జరిగేలా సబ్బండ వర్గాలన్నీ సంఘటితం కావాలి. భిక్షం వేసినట్టుగా అరకొర సంక్షేమ పథకాలను ఆశగా చూస్తే ఎల్లకాలం ఎదురుచూపులే, కప్పదాటు మాటలు, వాగ్దానాలు, పథకాలు ప్రకటనలకే మిగులుతున్నాయి. 2.2 కోట్ల జనాభా ఉన్న ఈ సామాజిక వర్గాలకు కనీసం 50% మంది శాసనసభ్యులు, శాసనమండలిలో 50% సభ్యులు, ఎంపీలుగా ఉండాల్సిన హక్కు ఈ ప్రజలకు ఉంది. ఏ రాజకీయ పార్టీ గానీ, ప్రభుత్వం గానీ వాళ్లంతట వాళ్లే అధికారాన్ని పంచి ఇవ్వరని గత అనుభవాలు చెబుతున్నాయి.
అందుకే సబ్బండ వర్గాలన్నీ ఒక్కో కులంగా సంఘటితమవుతూ రాజకీయాధికారం దిశగా అడుగులు వేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం మూడో అసెంబ్లీ ఎన్నికలకు తయారవుతున్న తరుణంలో అన్నివర్గాలకు ప్రస్తుత సమయం చాలా కీలకం. గౌడ, యాదవ, పద్మశాలి, బోయ ఇలా కులాలన్నీ కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నాయి.
పద్మశాలి కోరుట్ల సభ
పద్మశాలీ కులం సంఘటితం కావడానికి కోరుట్లలో ‘పద్మశాలి రాజకీయ యుద్ధభేరి’ సభ జరుగుతున్నది. అందుకే ఈ నెల అనగా ఆగస్టు 13వ తేదీ 2023 రోజున కోరుట్ల పట్టణంలో లక్ష మంది ప్రజలతో పద్మశాలి రాజకీయ గర్జన చేస్తున్నారు. వివిధ రంగాల్లో పనిచేస్తున్న పద్మశాలి మేధావులు, అధికారులు, కార్మిక నాయకులు, చిరు వ్యాపారస్తులు, ఇంకా ఇతరులు ఈ సభలో పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర గుజరాత్లలో ఉన్న ముఖ్యమైన నాయకులు కూడా ఈ సభలో పాల్గొంటున్నారు.
- డా. దాసరి కిరణ్, సోషల్ ఎనలిస్ట్