ఒట్టిగ ఫ్యామిలీ కరిష్మానే అంటే.. కాంగ్రెస్ బతికేనా!

ఒట్టిగ ఫ్యామిలీ కరిష్మానే అంటే.. కాంగ్రెస్ బతికేనా!
స్వాతంత్ర్య పోరాటంలో 1885 డిసెంబర్ 28న ఆవిర్భవించిన గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ పరిస్థితి ప్రస్తుతం దారుణంగా తయారైంది. 2014, 2019ల్లో వరుసగా రెండు సార్లు లోక్ సభ ఎన్నికల్లో ఓటమి, ఆ తర్వాత కూడా అనేక రాష్ట్రాల్లో అధికారం కోల్పోవడంతో ఆ పార్టీ నిరాశలో కుంగిపోయింది. దేశంలో మారుమూల గ్రామాల్లో సైతం కార్యకర్తలు ఉన్న కాంగ్రెస్ నేడు పూర్తిగా బలహీనపడిపోయింది. దీనికి ప్రధాన కారణం ఆ పార్టీ ఒకే కుటుంబాన్ని నమ్ముకొని రాజకీయాలు చేయడమే. పార్టీలో ఎందరో నాయకులు ఉన్నా వారిపై వారికే నమ్మకంలేని స్థితి కనిపిస్తోంది. కేవలం గాంధీ–నెహ్రూ ఫ్యామిలీ కరిష్మాతో పవర్ వస్తే.. పదవులు అనుభవించాలని చూసే లీడర్సే ఎక్కువయ్యారు. గ్రౌండ్ లెవల్ లో పని చేసి పార్టీని బలోపేతం చేసుకోవాలన్న ఆలోచన దాదాపుగా ఎవరిలోనూ కనిపించడం లేదు. పైగా అంతర్గత కలహాలతో సాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పార్టీ మళ్లీ గాడినపడేనా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్ పార్టీ పుట్టిన తర్వాత అతి పెద్ద సంక్షోభాన్ని ఇప్పుడే ఎదుర్కొంటోంది. దేశానికి స్వాంతంత్ర్యం వచ్చిన తర్వాత ఎక్కువ కాలం పాలించిన ఆ పార్టీ ఇప్పుడు పూర్తిగా తుడిచి పెట్టుకుని పోతుందా అనేంత స్థాయికి దిగజారిపోయింది. ఇది కచ్చితంగా ఆ పార్టీ తనంతట తానే కొని తెచ్చుకున్న కష్టమే. అధికారంలో ఉండగా పెద్ద పెద్ద పదవులు అనుభవించిన వాళ్లంతా నేడు పార్టీ కేడర్ తో మంచి సంబంధాలు కంటిన్యూ చేస్తూ.. వారిని నిలబెట్టుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు. దీని వల్ల కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవల్ లో దెబ్బతినే పరిస్థితి వచ్చింది. మళ్లీ పార్టీలోని సీనియర్ నాయకులంతా కింది స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టి, నిరంతరం పార్టీ కార్యకర్తలతో కలిసి పని చేస్తే తప్ప కాంగ్రెస్ బతికి బట్టకట్టడం అసాధ్యం. లేదంటే జాతీయ రాజకీయాల్లో ఇక ఆ పార్టీ పాత్ర నామ్ కే వాస్తే అన్నట్లుగా మిగిలిపోవడం ఖాయం. ఎల్లకాలం ఆ ఒక్క కుటుంబమేనా? కాంగ్రెస్ నాయకులంతా గాంధీ – నెహ్రూ ఫ్యామిలీ కరిష్మా పైనే ఆధారపడి ఎల్లకాలం పార్టీని నడిపించాలని చూస్తున్నారు. పార్టీ బలోపేతానికి తమ వంతు చేయాల్సిన కృషిని అసలు పట్టించుకోవడం లేదు. కేవలం ఒకే ఒక్క కుటుంబం, లేదా ఒకే మనిషి దేశంలోని ఓటర్లను ఎల్లకాలం ఆకర్షిస్తూ పార్టీని నడిపించడం అసాధ్యమన్నది ఆ నాయకులంతా గుర్తించాలి. పార్టీని ప్రేమిస్తామని చెప్పే నాయకులంతా తమ వంతు కష్టాన్ని ఇవ్వకపోతే ప్రయోజనమేంటి? అన్న ప్రశ్న వాళ్లకు వాళ్లే వేసుకోవాలి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారి 1977లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన సమయంలోనూ ఒక్క ఇందిరా గాంధీ ఫేస్ తప్ప ప్రచారంలో మరో ముఖం పోస్టర్లపై కనిపించలేదు. పార్టీ కోసం వర్క్ చేసి.. ప్రజల్లో కరిష్మా ఉన్న మరో నాయకుడెవరూ ఆ సమయంలో కనిపించలేదు. కాంగ్రెస్ లో నేటికీ అదే పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో కొంత మంది ఐడియాలజీపై నమ్మకంతో కాకుండా అధికారం కోసమే ఉన్నారన్నది నిజం. ఇలాంటి వాళ్లంతా ఇవాళ్టికి కూడా సోనియా గాంధీనో, ప్రియాంక గాంధీనో, రాహుల్ గాంధీనో ముందుకు వచ్చి వాళ్ల కరిష్మాతో పార్టీని నిలబెడితే అధికారంలోకి రావాలని చూస్తున్నారు తప్ప.. గ్రౌండ్ లెవల్ లో కష్టపడేందుకు సిద్ధంగా  ఉన్నట్లు కనిపించడం లేదు. పవర్ పోతే సొంత పనుల్లో బిజీ 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్న సమయంలో యూపీఏ అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీ కేంద్రంలోని కీలక నాయకులంతా రాష్ట్ర స్థాయి నాయకత్వంతో కలిసి పని చేసేలా ప్రణాళిక రూపొందించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కేంద్ర మంత్రులంతా రాష్ట్రాల్లో పర్యటించి, పీసీసీ కమిటీలు, కింది స్థాయి నాయకులతో ఇంటరాక్ట్ అవుతూ పార్టీని నడిపించాలని సూచించారు. కానీ ఆమె సూచనలను పాటించిన వారికంటే పట్టించుకోకుండా వదిలేసిన వాళ్లే ఎక్కువ. 2014లో మళ్లీ అధికారం తమదే అనుకున్న కాంగ్రెస్ తీరా చతికిలపడడంతో పార్టీ నాయకత్వం షాక్ అయింది. అయితే ఓటమికి కారణాలను స్టడీ చేసి మళ్లీ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు నాయకులంతా కష్టపడాల్సింది పోయి.. పదవులు అనుభవించిన సీనియర్ నాయకులు సొంత పనుల్లో బిజీ అయిపోయారు. గడిచిన ఆరున్నరేండ్లుగా కాంగ్రెస్ లోని కీలక నేతల్లో ఎక్కువ మంది పార్టీ కార్యక్రమాలను పక్కన పెట్టి.. తమ లీగల్ ప్రాక్టీస్ లు చేసుకుంటున్నారు. వాళ్లంతా మళ్లీ మళ్లీ పార్టీ రివైవల్ కోసం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుని కష్టపడే వరకు కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉండదు. కాంగ్రెస్కు ఎన్నో బలాలున్నయ్.. కానీ, వాస్తవానికి దేశంలో ఏ పార్టీకీ కాంగ్రెస్ కు ఉన్నన్ని ప్లస్ పాయింట్స్ లేవు. ఆ పార్టీ స్వాతంత్ర్యానికి ముందు నుంచీ ఉండడంతో దేశంలోని ప్రతి మారుమూల పల్లెలోనూ కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. త్రివర్ణ పతాకం, జాతీయ గీతం అందించిన మహానుభావులు ఉన్న పార్టీ. 5 వేల ఏండ్ల భారతీయ సనాతన నాగరికతను కాపాడడంలో, దక్షిణాసియాలోనే ఏకైక ప్రజాస్వామ్య దేశంగా భారత్ ను నిలపడంలో కాంగ్రెస్ పాత్ర ఎంతో ఉంది. స్వాతంత్ర్యం రాక ముందు ఒక్క గుండు సూది కూడా తయారు కాని పరిస్థితుల నుంచి.. ఐటీ, స్పేస్, అటామిక్ ఎనర్జీ సహా ఎన్నో రకాల ఇండస్ట్రీస్ నెలకొల్పడం మొదలు.. నేడు ప్రపంచంలోనే టాప్ ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలపడం వరకు ఆ పార్టీ చేసిన కృషి ఎనలేనిది. హరిత విప్లవంతో ప్రపంచానికి తిండి పెట్టే స్థాయికి తెచ్చినా.. ప్రపంచ దేశాలతో శాంతి దౌత్యం నడిపినా కాంగ్రెస్ కే చెల్లింది. ఆ పార్టీ ఐడియాలజీని వ్యతిరేకించే నేతలు, పార్టీలు ఉన్నాయేమో కానీ, కాంగ్రెస్ అచీవ్మెంట్స్ను కాదనేవాళ్లు లేరు. ఇన్ని బలాలు ఉండడం వల్లే నేటికీ దేశం నలుమూలలా ఆ పార్టీకి కేడర్ ఉండి.. 20% ఓట్ షేర్ ను నిలబెట్టుకోగలుగుతోంది. కానీ ఎన్నికల్లో గెలవడం కోసం ఒకే ఫ్యామిలీ కరిష్మాపైనే అతిగా ఆధారపడడం వల్లే కాంగ్రెస్ పార్టీ నేడు జీరో అయ్యే స్థితికి వస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన నేతలు.. పవర్ పోయాక ప్రజల్లోకి వెళ్లకపోవడంతో జనాల పార్టీ జనాలకు దూరమైంది. అలాగే కేడర్ కూడా మరో శక్తిమంతమైన పార్టీ వైపు చూస్తోంది. గాంధీజీ కూడా ఒక్కరే అంతా నడిపేయలేదు స్వాతంత్ర్య పోరాట సమయంలోనూ గాంధీజీ ఒక్కరే అంతా సాధించేయలేదు. ఆయనేమీ వన్ మ్యాన్ షో చేయలేదు. యుద్ధ సైనికుల్లాంటి నాయకులు దేశం నలుమూలలా స్వాతంత్ర్య పోరాటానికి పిల్లర్స్  గా నిలబడ్డారు. మారుమూల గ్రామాలకు సైతం నాటి కాంగ్రెస్ నేతలు వెళ్లి ప్రజలను స్వాతంత్ర్య పోరాటంలో భాగం చేసి.. అనుకున్న లక్ష్యం సాధించారు. చంపారన్ లో బాబూ రాజేంద్ర ప్రసాద్, బర్దోలీ సత్యాగ్రహంలో సర్దార్ పటేల్, బెంగాల్ లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ సహా దేశవ్యాప్తంగా మాస్ మొబలైజేషన్ లో నెహ్రూ ఇలా ఎందరో నాయకులు కలిసి గ్రౌండ్ లెవల్ లో పని చేస్తేనే 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. కానీ ఈ రోజు కాంగ్రెస్ లో గాంధీ –  నెహ్రూ ఫ్యామిలీ వైపు చూడడం తప్ప మిగతా నాయకులు పని చేయకూడదన్న తీరు కనిపించడమే ఆ పార్టీకి శాపం. హార్డ్ వర్క్ ఒక్కటే పార్టీని నిలబెట్టే మంత్రం సమస్య ఏదైనా పరిష్కారం దొరకాలంటే హార్డ్ వర్క్ చేయడం ఒక్కటే మార్గం. అంతే కానీ వేరే మ్యాజిక్స్ ఏవీ పని చేయవు. ఈ విషయాన్ని నేడు కాంగ్రెస్ లో ఉన్న నాయకులంతా అర్థం చేసుకోవాలి. ఇప్పటి వరకు సోనియా.. ఇకపై రాహుల్ లేదా ప్రియాంక గాంధీల్లో ఎవరో ఒకరు వచ్చేసి కరిష్మాతో ఎదో మిరాకిల్ చేసేసి పార్టీని నిలబెట్టాలనుకోవడం సరైన ఆలోచన కాదు. ఇది రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీలను బ్లేమ్ చేయడానికి ఉపయోగపడుతుందే కానీ పార్టీ బలోపేతం చేయడానికి పనికిరాదు. ‘మ్యాజిక్ రెమిడీలు, డ్రమెటిక్ రిజల్ట్ కోసం చూడొద్దు. పక్కా ప్రణాళిక, కఠినమైన సంకల్పం, క్రమశిక్షణతో పని చేస్తేనే ఏదైనా సాధించగలం’ అని 1975 ఆగస్టు 15న ఎర్రకోటపై నుంచి నాటి ప్రధాని ఇందిరా గాంధీ చేసిన ప్రసంగం స్ఫూర్తిగా కాంగ్రెస్ శ్రేణులు పని చేస్తేనే పార్టీకి భవిష్యత్తు ఉంటుంది.  గతంలో పదవులు అనుభవించిన పెద్దలంతా క్లియర్ విజన్ తో క్రమశిక్షణ కలిగిన నాయకుల్లా పని చేసి, కింది స్థాయి కేడర్ ను నిలబెట్టుకుని వారిలో కాన్ఫిడెన్స్ పెంచాలి. అప్పుడే పార్టీ మళ్లీ పట్టాలెక్కుతుంది. ఆ దిశగా కాంగ్రెస్ లో నాయకులు ఆలోచిస్తోరో లేదో చూడాలి