బీజేపీని ఎదుర్కోవాలంటే దళితులంతా ఐక్యం కావాలి

బీజేపీని ఎదుర్కోవాలంటే దళితులంతా ఐక్యం కావాలి
  • రాష్ట్ర సీపీఎం కార్యదర్శి  జాన్ వెస్లీ పిలుపు

ఖమ్మం రూరల్, వెలుగు :  బీజేపీ విధానాలను తిప్పి కొట్టాలంటే దళితులు ఐక్యం కావాలని, రాష్ట్ర సీపీఎం కార్యదర్శి, కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి(కేవీపీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు జాన్ వెస్లీ పిలుపు నిచ్చారు. ఖమ్మం రూరల్ మండలంలోని రామ్ లీలా ఫంక్షన్ హాల్ లో కేవీపీఎస్ పాలేరు డివిజన్ సదస్సు ఆదివారం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఆయన ముందుగా నాయుడుపేట చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీ ప్రారంభించారు. 

అనంతరం జాన్ వెస్లీ మాట్లాడుతూ రాష్ట్రంలో దళితుల సమస్యలపై, అంటరానితనంపై ఎన్నో  పోరాటాలు చేసి విజయాలు సాధించిన ఘనత కేవీపీఎస్ కు దక్కుతుందన్నారు. దేశంలో దళితుల వెనుకబాటుకు మనువాదమే ప్రధాన కారణమని పేర్కొన్నారు. దళితులంతా ఐక్యమై రాజీలేని పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.  

అనంతరం 25 మందితో పాలేరు డివిజన్ కొత్త కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.  కేవీపీఎస్ జిల్లా నాయకులు బండి రమేశ్​,  కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్, ఐద్వా రాష్ట్ర నాయకురాలు మాచర్ల భారతి, ఐద్వా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రమణ, బండి పద్మ, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ పాల్గొన్నారు.