![కోటా దవాఖానాలో అన్నీ లోపాలే](https://static.v6velugu.com/uploads/2020/01/kota-1.jpg)
- చనిపోయిన పిల్లల సంఖ్య 104
- ఆక్సిజన్ అందుబాటులో లేదు
- అవసరమైన మందులు కరువే
- కిటికీ అద్దాలన్నీ పగిలి, గదుల్లోకి చలి గాలులు
- ఒకే బెడ్‌పైన ఇద్దరేసి పిల్లలు
- ఆస్పత్రిలో స్టాఫ్ కొరత తీవ్రం
- కాంపౌండ్లోనే పందులు
న్యూఢిల్లీ: రాజస్థాన్ కోటాలోని జేకే లోన్ హాస్పిటల్ లో పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నారు. డిసెంబర్ నెలలోనే అక్కడ 100 మంది పిల్లలు చనిపోయారు. గురువారంనాటికి ఈ సంఖ్య 104కి పెరిగింది. ఆస్పత్రిలో లోపాల వల్లే పిల్లలు చనిపోతున్నారు. పిల్లల ఐసీయూలకు ఆక్సిజన్ కొరత వెంటాడుతోంది. అవసరమైన మెడిసిన్ కూడా అందుబాటులో లేవు. కాంపౌండ్‌లో పందులు విచ్చల విడిగా తిరుగుతున్నా పట్టించుకునేవారే లేరు. ట్రీట్మెంట్కు సరిపడినంత స్టాఫ్ కూడా లేరు. కిటికీల అద్దాలు పగిలిపోవడంతో ఆస్పత్రి రూముల్లోకి నేరుగా చల్లగాలి వీయడంతో కూడా పసిపిల్లలు చనిపోవడానికి కారణాలవుతున్నాయి. పరిస్థితి రోజురోజుకు సీరియస్ కావడంతో…ఇప్పుడు ఈ ఇష్యూ రాజకీయ రంగు పులుముకుంది. కోటా హాస్పిటల్ ఇష్యూపై బీజేపీ కాంగ్రెస్‌ను టార్గెట్ చేసింది. బీఎస్పీ కూడా ఈ విషయంలో కాంగ్రెస్ పై దుమ్మెత్తిపోసింది. ఇంతమంది చనిపోతున్నా కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ మాత్రం చలించడంలేదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఫైర్ అయ్యారు. ఈ ఇష్యూపై కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఎందుకు రియాక్ట్ కావడంలేదని బీఎస్పీ చీఫ్ మాయావతి ప్రశ్నించారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌ను టార్గెట్ చేస్తూ గురువారం ట్వీట్ చేశారు. ఈ ఇష్యూను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోలేదని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ సతీశ్ పూనియా విమర్శించారు. పరిస్థితిని తెలుసుకునేందుకు కోటా హాస్పిటల్‌కు వెళ్లిన బీజేపీ ఎంపీలను కాంగ్రెస్ వర్కర్లు అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. అయితే హెల్త్క్రైసిస్ను సమర్థంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర సర్కార్‌కు అన్నివిధాలా సాయపడతామని కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్థన్ హామీ ఇచ్చారు. ఇప్పటికే ఈమేరకు రాజస్థాన్సీఎం గెహ్లాట్‌కు లెటర్ రాశానని గురువారం చెప్పారు.
కోటా ఇష్యూను రాజకీయం చేయొద్దని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కోరారు. రాష్ట్రంలో పిల్లల కోసం మొదటి ఐసీయూను కాంగ్రెస్ గవర్నమెంట్ 2003లో ప్రారంభించిందన్నారు. కోటా లోనూ 2011లో పిల్లల కోసం ఐసీయూను స్టార్ట్ చేశామని చెప్పారు. కేంద్రం సాయంతో రాష్ట్రంలో ఆరోగ్య సర్వీసుల్ని మరింత మెరుగుపరుస్తామని ముఖ్యమంత్రి గెహ్లాట్ చెప్పారు.
ఆగని పిల్లల మరణాలు, ప్రతిపక్షాల ఎటాక్‌తో జరిగిన డామేజ్ ను కంట్రోల్ చేయడానికి కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ రంగంలోకి దిగారు. అసలు అక్కడ ఏం జరుగుతోందని రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ అవినాశ్ పాండేని సోనియా అడిగారు. గురువారం రాజస్థాన్ చీఫ్‌ను ఢిల్లీకి పిలిపించుకుని పరిస్థితిని తెలుసుకున్నారు. మరణాలపై డిటైల్డ్ రిపోర్ట్‌ను కాంగ్రెస్ చీఫ్‌కు అందజేసినట్టు అవినాశ్ ఆ తర్వాత మీడియాకు చెప్పారు.
పిల్లల మరణాలను సీరియస్‌గా తీసుకున్న నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ రైట్స్ (ఎన్‌సీపీఆర్) టీమ్ హాస్పిటల్‌ను సందర్శించి వైఫల్యాలను తప్పుపట్టింది. బీజేపీ ఎంపీల టీమ్‌కూడా హాస్పిటల్‌ను సందర్శించింది. కోటా ఆసుపత్రి ఘటనలపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా విచారం వ్యక్తం చేశారు.
కోటా హాస్పిటల్లో చిన్నపిల్లలు చనిపోవడం కలిచివేస్తోంది. బిడ్డల్ని పోగొట్టుకున్న తల్లులు బాధలు సివిల్ సొసైటీకి సిగ్గుచేటు. ఆడవాళ్లయి ఉండి కూడా సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలు దీన్ని అర్థం చేసుకోకపోవడం బాధాకరం – యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్
ఈ ఇష్యూపై గెహ్లాట్ సర్కార్ ఇప్పటికీ నిర్లక్ష్యంగా ఉండటాన్ని ఖండించాల్సిందే. కాంగ్రెస్ పార్టీ టాప్ లీడర్ షిప్, ఆ పార్టీ లేడీ జనరల్ సెక్రటరీ దీనిపై రియాక్ట్ కాకపోవడం బాధగా ఉంది. చనిపోయినవాళ్ల ఫ్యామిలీ మెంబర్లను ఆమె కలవకపోతే యూపీలో పోలీసు కాల్పుల్లో చనిపోయిన వారి కుటుంబాలను కలవడం ఒక డ్రామా అనుకోవాల్సి ఉంటుంది.– బీఎస్పీ చీఫ్ మాయావతి
చిన్నపిల్లల మరణాలను సర్కార్ సీరియస్‌గా తీసుకుంది. దీనిని రాజకీయం చేయొద్దు. హాస్పిటల్లో చిన్నపిల్లల చావులు నెమ్మదిగా తగ్గుతున్నాయి. ఈ సంఖ్యను మరింతగా తగ్గిస్తాం. తల్లులు, పిల్లలు ఆరోగ్యానికే మేం టాప్ ప్రియారిటీ ఇస్తాం.- రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్
హాస్పిటల్‌కు హెల్త్ మినిస్టర్ ఇంతవరకు వెళ్లలేదు. పిల్లల్ని పోగొట్టుకున్న పేరెంట్స్ తీవ్రమైన బాధలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీనిపై రియాక్ట్ అవడంలేదు. – రాజస్థాన్ బీజేపీ చీఫ్ సతీశ్ పూనియా