మత్తును చిత్తుచేద్దాం..డ్రగ్స్ కంట్రోల్​ పై అన్నిశాఖల ఫోకస్

మత్తును చిత్తుచేద్దాం..డ్రగ్స్ కంట్రోల్​ పై అన్నిశాఖల ఫోకస్
  •     విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్ కమిటీల ఏర్పాటు
  •     గంజాయి రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం
  •     అంతర్ పంటగా గంజాయి సాగు చేస్తే ప్రభుత్వ పథకాలు కట్ 

రాష్ట్రంలో డ్రగ్స్ అంటేనే భయపడాలని సీఎం రేవంత్​ రెడ్డి హెచ్చరించిన నేపథ్యంలో జిల్లాలో సైతం డ్రగ్స్ నిర్మూలనపై అధికార యంత్రాంగం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. పోలీసు శాఖ ఒక్కటే కాకుండా అన్ని శాఖల భాగస్వామ్యంతో జిల్లాను గంజాయి రహితంగా మార్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

ఆదిలాబాద్, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో పల్లె పట్టణమన్న తేడా లేకుండా ఇటీవల కాలంలో గంజాయి సాగు, రవాణా, వినియోగం పెద్ద ఎత్తున పెరిగింది. మత్తు పదార్థాలకు బానిసై యువత చిత్తవుతోంది. కొంత మంది విద్యార్థులు సైతం వీటి బారిన పడిన ఉదంతాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే డ్రగ్స్ నిర్మూలనకు కొత్త ప్రభుత్వం అధికారులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో..  జిల్లా యంత్రాంగం ప్రణాళిక రూపొందిస్తుంది. ఆదిలాబాద్​లో కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌష్ ఆలం ఆధ్వర్యంలో ప్రత్యేక టీంలు ఏర్పాటు చేస్తున్నారు. 

డ్రగ్స్​అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే కాకుండా సరిహద్దుల్లో కట్టుదిట్టమైన నిఘా, సాగును అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపట్టారు. గంజాయిని అంతర్​ పంటగా సాగు చేస్తే రైతులకు రైతుబంధుతో పాటు ఇతర పథకాలు నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నారు. 


కమిటీల్లో తల్లిదండ్రులు, విద్యార్థులు ముఖ్యంగా విద్యార్థులు మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కమిటీల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతోపాటు పోలీసులు, టీచర్లను నియమించి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. పల్లెల్లో ర్యాలీలు, సదస్సులు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. అటు గంజాయి వాడుతున్న వారిని సైతం గుర్తించి వైద్య సదుపాయం అందించేందుకు  చర్యలు చేపట్టారు. జిల్లా సరిహద్దులో ఉన్న మహారాష్ట్ర నుంచి రైలు, రోడ్డు మార్గాల ద్వారా మత్తు పదార్థాలు రవాణా జరుగకుండా తనిఖీలు పటిష్ఠం చేయనున్నారు. 

అంతర్ పంటగా సాగు..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి, కంది, సోయా, మిర్చి, జొన్న పంటల్లో అంతర్ పంటగా గంజాయిని సాగు చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కొంత మంది రైతులు ఇలా సొంతంగా సాగు చేస్తుండగా, మరికొందరు స్మగ్లర్లు అమాయక రైతుల వద్ద నుంచి పంట పొలాలు కౌలుకు తీసుకొని అందులో అంతర్ పంటగా గంజాయి సాగు చేస్తున్నారు. ఇటీవల పోలీసుల దాడుల్లో చాలా చోట్ల గంజాయి సాగును గుర్తించి నిందితులను అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఇతర జిల్లాల నుంచి విత్తనాలు తీసుకొచ్చి అంతర్ పంటగా సాగు చేస్తున్నట్లు తెలిసింది. 

ఉట్నూర్, ఇంద్రవెల్లి, తలమడుగు, బేల, ఆదిలాబాద్, తాంసి, బోథ్, నేరడిగొండ, ఆసిఫాబాద్, కెరమెరి, జైనూర్, సిర్పూర్, సారంగాపూర్, పెంబి, కడెం, వాంకిడి, తదితర ప్రాంతాల్లో పలువురు రైతులు గంజాయి సాగు చేస్తున్నారు. ఆ తర్వాత ఉమ్మడి జిల్లాలోని పట్టణాలతోపాటు కరీంనగర్, హైదరాబాద్, మహారాష్ట్రకు తరలిస్తూ స్మగ్లర్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఇటు మహారాష్ట్ర నుంచి రైల్వే మార్గాల్లో సైతం గంజాయి ఉమ్మడి జిల్లాలకు చేరుకుంటుంది. ఒక పక్క జిల్లాలో పండించిన గంజాయితో పాటు అటు మహారాష్ట్ర నుంచి వచ్చిన గంజాయిని పట్టణాల్లో విక్రయిస్తున్నారు. ఇటీవల పలు పట్టణాల్లో పోలీసులు తనిఖీల్లో గంజాయి విక్రేతలను పట్టుకున్న సంఘటనలు ఉన్నాయి. 

గంజాయి పట్టుబడ్డ కేసులు..

    ఏప్రిల్ 11న బేల మండలంలోని సాంగ్వి గ్రామానికి చెందిన పొచ్చిరాం ఆదిలాబాద్​కు బైక్ పై గంజాయి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.  నిందితుడి నుంచి సుమారు రూ.1.75 లక్షల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 

    మే 2న గుడిహత్నూర్ మండలంలోని మచ్చాపూర్ సమీపంలో ఓ చేనులో సాగు చేస్తున్న గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైతు కృష్ణపై కేసు నమోదు చేసి, ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. 

    జూన్ 12న నేరడిగొండ మండలంలో రోల్ మామడ టోల్ ప్లాజా వద్ద 6 కిలోల గంజాయిని తరలిస్తున్న హైదరాబాద్​కు చెందిన సంతోష్ కుమార్​ను అరెస్టు చేశారు. ఈయన సిరికొండ మండలంలోని ధర్మాసాగర్ గ్రామానికి చెందిన వ్యక్తుల వద్ద గంజాయి కొనుగోలు చేసి  హైదరాబాద్​కు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

జీవితం నాశనం చేసుకోవద్దు

మత్తు పదార్థాల నియంత్రణ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. ఎక్కడికక్కడ పోలీసులు అప్రమత్తంగా ఉండి తనిఖీలు చేపడుతున్నారు. యువత, విద్యార్థుల మత్తుకు అలవాటు పడి జీవితం నాశనం చేసుకోవద్దు. ఇప్పటికే విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నాం. గ్రామాల్లో సైతం ప్రజలకు, రైతులకు గంజాయి సాగు పట్ల జాగ్రత్తగా ఉండాలని చైతన్య సదస్సులు నిర్వహిస్తున్నాం.
- గౌస్ ఆలం, జిల్లా ఎస్పీ