ఇండియా షట్లర్లకు ఆల్‌‌‌‌ ఇంగ్లండ్ సవాల్‌‌‌‌.. ఈ సారైనా నిరీక్షణకు ఫలితం దక్కేనా..?

ఇండియా షట్లర్లకు ఆల్‌‌‌‌ ఇంగ్లండ్ సవాల్‌‌‌‌.. ఈ సారైనా నిరీక్షణకు ఫలితం దక్కేనా..?

బర్మింగ్‌‌‌‌హామ్: గాయాలు, ఫిట్‌‌‌‌నెస్ సమస్యలు, ఫామ్‌‌‌‌ కోల్పోయి ఇబ్బంది పడుతున్న ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు, ఇతర ప్లేయర్లు మంగళవారం మొదలయ్యే ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌‌‌‌షిప్ సవాల్‌‌‌‌కు సిద్ధమయ్యారు. 1980లో ప్రకాశ్ పదుకొన్‌‌‌‌, 2001లో పుల్లెల గోపీచంద్ టైటిల్ గెలిచిన తర్వాత ఈ టోర్నీలో మరొకరు విజేతగా నిలవలేకపోయారు. డబుల్‌‌‌‌ ఒలింపిక్‌‌‌‌ మెడలిస్ట్ అయిన సింధు ఇటీవల కండరాల గాయం కారణంగా ఆసియా మిక్స్‌‌‌‌డ్‌‌‌‌ టీం చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌కు దూరమైంది.

ఈ టోర్నీతో రీఎంట్రీ ఇస్తున్న ఆమె తొలి రౌండ్‌‌‌‌లో కొరియా షట్లర్ యున్ కిమ్ తో తలపడనుంది. గత సీజన్‌‌‌‌లో సెమీఫైనల్‌‌‌‌కు చేరిన లక్ష్యసేన్ జపాన్ ప్లేయర్ కోకి వటానాబేతో తొలి మ్యాచ్ ఆడనున్నాడు. 30వ ర్యాంక్‌‌‌‌కు పడిపోయిన సీనియర్ షట్లర్ ప్రణయ్ ఫ్రాన్స్ ఆటగాడు టోమా జూనియర్ పోపోవ్ తో పోరు ఆరంభిస్తాడు. మెన్స్ డబుల్స్‌‌‌‌ లో ఇండియా నంబర్ వన్ జోడీ సాత్విక్ సాయిరాజ్–- చిరాగ్ శెట్టి టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. 

తొలి రౌండ్‌‌‌‌లో డెన్మార్క్ ద్వయం డేనియల్ లండ్‌‌‌‌గార్డ్–- మ్యాడ్స్ వెస్టర్‌‌‌‌గార్డ్ తో  తమ పోరు ఆరంభించనుంది. గత రెండు ఎడిషన్లలో సెమీస్ చేరిన విమెన్స్ డబుల్స్ యువ ద్వయం పుల్లెల గాయత్రి–ట్రీసా జాలీ ఈసారి మరింత ముందుకెళ్లాలని ఆశిస్తోంది. ఈ జంట  చైనీస్ తైపీకి చెందిన  యున్ సంగ్ – చియెన్ హుయ్ యూతో తొలి రౌండ్‌‌‌‌లో తలపడనుంది. అశ్విని పొన్నప్ప– - తనీషా క్రాస్ట్రో, - మిక్స్‌‌‌‌డ్‌‌‌‌ డబుల్స్‌‌‌‌లో రోహన్–  రుత్విక,  ధ్రువ్ కపిలా–- తనీషా, సతీష్ కరుణాకరన్– ఆద్య వరియత్ జంటలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.