మహబూబ్‌నగర్, వెలుగు: వడ్ల రైతులకు చేతిలో చిల్లిగవ్వ మిగుల్తలేదు. సాగుకు వేలల్లో పెట్టుబడులు పెట్టి, పంటను అమ్ముకున్నాక కనీసం వారు చేసిన కష్టానికి కూలీ కూడా గిడ్తలేదు. ప్రభుత్వం మద్దతు ధరకు వడ్లు కొంటున్నామని చెబుతుందే తప్ప, కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని ఖర్చులు రైతుల నెత్తినే రుద్దుతుండడంతో మద్దతు ధర ఏమో కానీ.. అంతా అదనపు భారమే అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలోని పాలమూరులో 196, నాగర్‌కర్నూల్‌లో 222, గద్వాలలో 71, నారాయణపేటలో 137 వడ్ల కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం మద్దతు ధరకు వడ్లు కొనుగోలు చేస్తోంది. అయితే కొనుగోలు కేంద్రాలకు వడ్లను తీసుకొస్తున్న రైతులకు ఖర్చులు ఎక్కువవుతున్నాయి. సుతిలీ, హమాలీ, టార్పాలిన్లు, ట్రాక్టర్ అద్దెలు, చాట కూలీలకు కలిపి మొత్తం దాదాపు రూ.12 వేలకు పైమాటే అవుతున్నాయి. ఇది చాలదన్నట్లు బస్తాకు మూడు, నాలుగు కిలోలు తరుగు తీస్తుండడంతో రైతులు నష్టపోతున్నారు.
యూనిఫాం రేట్లేని హమాలీ చార్జీలు..
పాలమూరు జిల్లాలోని ఒక్కోకొనుగోలు కేంద్రంలో హమాలీ చార్జీలు ఒక్కోతీరుగా తీసుకుంటున్నారు. బాలానగర్‌లో క్వింటాల్‌కు రూ.65, మిడ్జిల్ మండలంలో క్వింటాల్‌కు రూ.40, నవాబ్‌పేట మండలంలో 40 కిలోల బస్తాకు రూ.18 చొప్పున, జడ్చర్ల మండలంలో 40 కిలోల బస్తాకు రూ.22 చొప్పున, గండీడ్ మండలంలో క్వింటాల్‌కు రూ.45 చొప్పున రైతుల నుంచి వసూలు చేస్తున్నారు. యూనిఫాం రేట్లేకపోవడంతో రైతుల నుంచి ఇష్టానుసారంగా కూలి తీసుకుంటున్నారు. హమాలీ రేట్ల విషయంపై గత వారం జరిగిన జడ్పీ మీటింగ్‌లో సభ్యులు ఆందోళన చేయడంతో అడిషనల్కలెక్టర్ఆధ్వర్యంలో సమావేశం నిర్వహిస్తామని చెప్పి, ఇటీవల హమాలీల సంఘం నాయకులతో భేటీ అయ్యారు. ఈ భేటీలో యూనిఫాం రేట్ ఫిక్స్ చేసినట్లు స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు తెలపగా వారు పట్టించుకోవడం లేదు. ఈ విషయంపై రైతులు నిలదీసి మాట్లాడితే, సంచులు ఎత్తకుండా సతాయిస్తున్నారు.
సుతిలీ కూడా ఇస్తలేరు
గతేడాది వానాకాలం సీజన్ వరకు ప్యాడి ప్రొక్యూర్మెంట్ సెంటర్ల ద్వారా రైతులకు సుతిలీలు ఇచ్చేవారు. నిరుడు యాసంగి నుంచి సుతిలీలను ఇస్తలేరు. యాసంగిలో గవర్నమెంట్ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం జిల్లా మార్కెటింగ్ శాఖ నుంచే టార్పాలిన్స్, వెయింగ్ మిషన్లు, మాయిశ్చర్ మిషన్లతో పాటే సుతిలీ సఫ్లై చేయాల్సి ఉంది. ఇందుకు వారికి వన్ పర్సెంట్ కమిషన్ అందుతుంది. గతేడాది పాలమూరులో రూ.240 కోట్ల వడ్లు కొంటే.. అందులో వన్‌పర్సెంట్ కమిషన్ కింద మార్కెటింగ్ శాఖకు రెండున్నర కోట్లు చెల్లించారు. అయినా ఈ ఏడాది ఇప్పటి వరకు రైతులకు సుతిలీ సప్లై చేయలేదు. దీంతో రైతులే సుతిలీ సొంతంగా తెచ్చుకుంటున్నారు. 30 బస్తాల వడ్లను కుట్టేందుకు దాదాపు రెండు బెండిళ్ల సుతిలీ అవసరం అవుతోంది. ఇందుకు రైతులకు రూ.300 వరకు ఖర్చు చేస్తున్నారు. రెండెకరాలు, మూడెకరాలు పండించిన రైతులకు సుతిలీలకు దాదాపు రూ. 1,000 వరకు ఖర్చు చేస్తున్నారు.
టార్పాలిన్లు.. ట్రాక్టర్ల కిరాయిలకే రూ.2 వేలు
వడ్ల కుప్పలపై టార్పాలిన్లు కప్పేందుకు కల్లెంలో ఆరబెట్టిన వడ్లను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చేందుకు రైతులకు దాదాపు రూ.2 వేలకుపైనే ఖర్చు అవుతోంది. ఇందులో ట్రాక్టర్‌కు అద్దె కింద రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు చెల్లిస్తున్నారు. వడ్ల కుప్పలపై టార్పాలిన్లు కప్పేందుకు వాటిని అద్దెకు తెచ్చుకుంటున్నారు. ఒక్కో టార్పాలిన్కు రోజుకు రూ.100 చొప్పున అద్దె చెల్లిస్తుండగా, ఒక వడ్ల కుప్ప మీద కప్పడానికి 4 టార్పాలిన్లు అవసరం అవుతున్నాయి. మార్కెటింగ్ శాఖ నుంచి ప్రతి వడ్ల సెంటర్‌కు 20 చొప్పున టార్పాలిన్లు సఫ్లై చేసినా, వాటిని రైతులకు ఇవ్వడం లేదు.
హమాలీ కూలి కింద రూ.3,250 తీసుకున్నరు
నాకున్న మూడు ఎకరాల్లో వరి వేసిన. ఇందుకు రూ.80 వేల వరకు పెట్టుబడి పెట్టిన. 50 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. వడ్లు అమ్మితే రూ.70 వేలు వచ్చినయి. ఇందులో హమాలీ కూలి కిందనే రూ.3,250 తీసుకున్నారు. పెట్టుబడే ఎల్లలేదంటే.. వచ్చిన డబ్బును కూడా దోచుకుంటున్నారు.
–మామిళ్ల కృష్ణయ్య, రైతు, బాలానగర్
రూ.6,380 తీసుకున్నరు
నాకున్న 4 ఎకరాలతో పాటు మరో రెండున్నర ఎకరాలు కౌలుకు తీసుకొని వరి పండించిన. ఒక్కో బస్తా 40 కేజీల చొప్పున మొత్తం 319 బస్తాల దిగుబడి వచ్చింది. క్వింటాల్‌కు రూ.2,060 చొప్పున ప్రభుత్వం కొన్నది. రూ.300 పెట్టి సుతిలీ నేనే తెచ్చుకున్నా. క్వింటాలుకు 50 రూపాయల (ఒక్కో బస్తాకు రూ, 20) చొప్పున రూ.6,380 హమాలీ చార్జీల కింద తీసుకున్నారు.
–రమేశ్, రైతు, మిడ్జిల్