
ముంబై: ఇండియాపై ఏప్రిల్ 2 నుంచి ప్రతీకార టారిఫ్‌లను వేస్తామని యూఎస్ ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఎంత మేర టారిఫ్‌లు వేస్తుందో వేచి చూడాలి. ఈ వారం మార్కెట్ డైరెక్షన్‌ను ట్రంప్ టారిఫ్‌లు ప్రభావితం చేయనున్నాయి. రంజాన్ కారణంగా సోమవారం మార్కెట్‌లకు సెలవు. "ట్రంప్ ఏప్రిల్ 2న ప్రకటించబోయే సుంకలపైనే అందరి దృష్టి ఉంది" అని మెహతా ఈక్విటీస్ లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (రీసెర్చ్) ప్రశాంత్ టాప్సే అన్నారు.
దీంతో పాటు ఈ వారం ఇండియా మాన్యుఫాక్చరింగ్ , సర్వీసెస్ సెక్టార్ల పీఎంఐ డేటా వెలువడనుంది. వీటిని ఇన్వెస్టర్లు జాగ్రత్తగా గమనించాలని సలహా ఇచ్చారు. "ఈ వారం దేశీయంగా ప్రధాన అంశాలేవి లేనందున గ్లోబల్ అంశాలపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఇండియాపై ఏప్రిల్ 2 నుంచి ట్రంప్ ప్రభుత్వం వేసే టారిఫ్‌లు, ఆర్థిక వ్యవస్థపై వీటి ప్రభావం వంటి అంశాలపై మార్కెట్ దృష్టి పెట్టనుంది" అని రెలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ ఎనలిస్ట్ అజిత్ మిశ్రా అన్నారు.
ఎఫ్‌ఐఐల కదలికలు ట్రంప్ టారిఫ్ విధానాలపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. టారిఫ్‌లు ఎక్కువగా పడకపోతే ఇండియన్ మార్కెట్లు ర్యాలీ చేయొచ్చని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ అన్నారు. మరోవైపు -డాలర్ మారకంలో రూపాయి ట్రెండ్, బ్రెంట్ క్రూడ్ కదలికలను కూడా ట్రేడర్లు గమనించాలని ఎనలిస్టులు సలహా ఇస్తున్నారు. కాగా, కిందటి వారం సెన్సెక్స్ 509 పాయింట్లు (0.66 శాతం) పెరగగా, నిఫ్టీ 169 పాయింట్లు(0.72 శాతం) ఎగసింది.
6 సెషన్లలో రూ.31 వేల కోట్ల పెట్టుబడులు..
ఫారిన్ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) ఈ నెలలోని చివరి ఆరు ట్రేడింగ్ సెషన్లలో ఏకంగా రూ. 31,000 కోట్లను ఇండియన్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేశారు. వాల్యుయేషన్లు ఆకర్షణీయంగా ఉండడం, రూపాయి విలువ పెరగడం, ఎకానమీ డేటా మెరుగ్గా ఉండడంతో తిరిగి ఇండియా వైపు ఎఫ్‌ఐఐలు చూస్తున్నారు. ఎఫ్ఐఐలు మార్చి 1–20 తేదీల మధ్య నికరంగా రూ.3,973 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. మార్చి 21 నుంచి మార్చి 28 వరకు రూ. 30,927 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎఫ్‌ఐఐలు నికరంగా రూ. 34,574 కోట్లు, జనవరిలో రూ. 78,027 కోట్లను ఇండియన్ మార్కెట్ల నుంచి విత్‌డ్రా చేసుకున్నారు.