2024 ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న నేపథ్యంలో ఏపీలో రాజకీయ వేడి రెట్టింపవుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య హోరాహోరీ పోరు మాట అటుంచితే, ఈసారి ఎన్నికల్లో కాస్త భిన్నమైన పరిస్థితి నెలకొంది. సాధారణంగా ఎన్నికల ప్రచారం ప్రారంభించాక ముందే మేనిఫెస్టో ప్రకటిస్తాయి ప్రధాన పార్టీలు. కానీ, ఈసారి మేనిఫెస్టో ప్రకటించక ముందే అటు అధికార వైసీపీ, ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.
వైసీపీ మేనిఫెస్టో జాప్యానికి ప్రధాన కారణం రైతు రుణమాఫీ అని తెలుస్తోంది. వైసీపీ అగ్రశ్రేణి నాయకులంతా మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ అంశాన్ని చేర్చాలని కోరుతున్నారట, కానీ జగన్ మాత్రం ఎటూ తేల్చటం లేదట. ఈ అంశంపై పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని సమాచారం అందుతోంది. మరో పక్క ఉమ్మడి మేనిఫెస్టోపై కూటమిలో కూడా క్లారిటీ రావట్లేదట. ఈ నేపథ్యంలో రైతు రుణమాఫీ అంశమే ఈ ఎన్నికల్లో కింగ్ మేకర్ అవుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
2014 ఎన్నికల్లో చంద్రబాబు రుణమాఫీ ఇవ్వగా జగన్ అది అసాధ్యమని, అప్పటి పరిస్థితుల్లో రుణమాఫీ చేయలేమని కుండబద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సంపూర్ణ రుణమాఫీ చేయలేకపోయాడు. ఇప్పుడు సీఎం జగన్ ఇదే అంశాన్ని ప్రచారంలో పలుమార్లు ప్రస్తావిస్తూ వస్తున్నాడు. చంద్రబాబు రుణమాఫీ చేస్తానని, చేయలేదని గుర్తు చేస్తూ వస్తున్నాడు. మరి, ఇంత కీలకంగా మారిన రుణమాఫీ హామీ ఎవరు ముందుగా ప్రకటిస్తారన్నది వేచి చూడాలి.