ఆర్థిక మంత్రికి 4 సవాళ్లు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈనెల 5న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌ ఎలా ఉండబోతుందన్న ఆసక్తి అందరిలో నెలకొంది.కేంద్రంలో రెండోసారి అధికారాన్ని చేపట్టాక 2019–20 ఆర్థిక సంవత్సరానికి  సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్నారు. బడ్జెట్ లో వివిధ వర్గాల ప్రజలు తమ  ఆకాంక్షలు నెరవేరాలని కోరుతున్నారు. బడ్జెట్‌లో ఏయే వర్గాలకు ఊరట లభిస్తుందనే అంశంపై  మార్కెట్ లో అప్పుడే  ఊహాగానాలు మొదలయ్యాయి. దేశ ఆర్థిక వ్యవస్థ డౌన్ వర్డ్ ట్రెండ్ లో ఉన్నందున కేంద్రం కొన్ని కఠిన చర్యలు తీసుకుంటుందన్న అభిప్రాయాలు మార్కెట్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. నిర్మలా సీతారామన్ తాను ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో  ప్రధానంగా నాలుగు కీలక అంశాలు.. అంటే  మహిళలు, టెక్స్​టైల్​ పరిశ్రమ, వ్యవసాయం, ఎగుమతులపై దృష్టి పెట్టనున్నారని అంటున్నారు.

1)  టెక్స్ టైల్స్ సంగతి ఏం చేస్తారో!

మనదేశంలో అత్యంత ఎక్కువ స్థాయిలో ఉద్యోగాలు కల్పించేది టెక్స్ టైల్స్  రంగమే.  మన టెక్స్ టైల్స్ కు సహజంగా ఎక్స్ పోర్ట్  పొటెన్షియాలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే  సప్లయ్ విషయంలో అనేక అడ్డంకులు ఎదురవుతుండడంతో  ఈ ప్రభావం  టెక్స్ టైల్స్ ఎగుమతులపై  పడుతోంది. 2017 ఏడాదిలో టెక్స్ టైల్స్ ఎగుమతులు కేవలం 12.6 శాతానికే పరిమితం అయ్యాయి. దీనికి బోలెడన్ని కారణాలున్నాయి. పీయూశ్ గోయల్ ప్రవేశపెట్టిన  ఓట్ ఆన్ అకౌంట్ లో ఎగుమతులు పెంచడానికి కేంద్రం కొన్ని ప్రతిపాదనలు చేసింది. అయితే ఈ ప్రతిపాదనలు సరిపోవన్న వాదన వినిపిస్తోంది. రెండేళ్ల కిందట ఎకనమిక్ సర్వే పై  ఆర్థికవేత్త అరవింద్ సుబ్రహ్మణ్యం చేసిన స్టడీ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఎగుమతులను పెంచడం వల్ల ఉపాథి అవకాశాలు పెరుగుతాయి. ఉత్పత్తుల రంగంలో  కొన్నేళ్లుగా కొత్త ఉద్యోగాలే లేవు. బడ్జెట్​లో గవర్నమెంట్​ రాయితీలు ఇస్తే టెక్స్​టైల్స్​లో ఉద్యోగాలు పెరుగుతాయి. ఎగుమతులు కూడా పెరుగుతాయి.

2) ఆడవారికి ఏ విధంగా ఆసరా కల్పిస్తారో!

ఇండియా తొలి ఫుల్ టైం మహిళా ఫైనాన్స్ మినిస్టర్ గా రికార్డు సృష్టించిన నిర్మలా సీతారామన్ ఈసారి బడ్జెట్ లో మహిళల ఎంపవర్ మెంట్ కు సంబంధించి పక్కాగా కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్గనైజ్డ్ సెక్టార్ లో ఆడవారికి మరిన్ని ఉద్యోగాలు లభించేలా చర్యలు తీసుకోవడం తప్పనిసరి. ఆర్గనైజ్డ్ సెక్టార్ లో ఆడవారి ప్రాతినిధ్యం ఇప్పటికి బాగా తక్కువ. 2013 లెక్కలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. నిరుద్యోగుల్లో కూడా ఆడవారే ఎక్కువ మంది ఉన్నారు. 2017–18 ఏడాది లెక్కలు తీస్తే  ఉద్యోగాలు లేని ఆడవారు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగారు. పట్టణ ప్రాంతాల్లో వీరు 12.8 శాతం ఉంటే పల్లెల్లో 7.7 శాతం ఉన్నారు. ఇవన్నీ ఆర్గనైజ్డ్ సెక్టార్ కు సంబంధించిన లెక్కలే.  ఆర్గనైజ్డ్ సెక్టార్ లో మహిళలు ఎంత ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాల్లో  ఉంటే ఉమెన్ ఎంపవర్ మెంట్ అంతగా ఉన్నట్లు. దీంతో పోలిస్తే  అసంఘటిత రంగంలో పనిచేస్తున్న ఆడవారు బాగా తక్కువ. అన్ ఆర్గనైజ్డ్ సెక్టార్ లో ఎంత మంది ఆడవారు పనిచేస్తున్నారో తేల్చి చెప్పడానికి  సర్కార్ దగ్గర సరైన లెక్కా పత్రం లేదు.

 రెండు కోట్ల మంది ఉద్యోగాలకు దూరం

2005–12 లెక్కలు తీస్తే దేశవ్యాప్తంగా దాదాపుగా రెండు కోట్ల మంది ఆడవారు ఉద్యోగాలు కోల్పోయారు. ఒక వైపు పట్టణ ప్రాంతాల విస్తరణ చాలా స్పీడుగా జరుగుతున్నా  ఊరికి దూరంగా ఉండే కార్ఖానాలు, ఫ్యాక్టరీలకు వెళ్లడానికి ఆడవారికి సరైన రవాణా వ్యవస్థ లేదు. చాలా చోట్ల పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ సిస్టం కూడా అందుబాటులో లేదు. ఇదొక్కటే కాదు  పనిచేసే చోట్ల సేఫ్టీ కండిషన్స్ కూడా సరిగా లేవు. దీంతో దాదాపు రెండు కోట్ల మంది ఉద్యోగాలను వదిలిపెట్టినట్లు చెబుతున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పట్టణాలకు దూరంగా ఎక్కడో ఉండే కార్ఖానాలు, ఫ్యాక్టరీలకు ఆడవారు వెళ్లడానికి  వీలుగా   ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ ను  డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ సమస్య ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాదు. దేశవ్యాప్తంగా అన్ని  ప్రాంతాల్లో ఉంది. పని ప్రదేశాలకు వెళ్లడానికి ఆడవారికి సరైన రవాణా వ్యవస్థ ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన భద్రతను కూడా కల్పిస్తే ఆ ప్రభావం ఓవరాల్ గా దేశ ఉత్పత్తి రంగం పై పడుతుందన్న వాదన వినిపిస్తోంది. కేంద్రం ఈ మేరకు బడ్జెట్ లో చర్యలు ప్రతిపాదిస్తే  ఆడవారికి ఆర్గనైజ్డ్ , అన్ ఆర్గనైజ్డ్ సెక్టార్ లలో  ఆడవారికి పెద్ద సంఖ్యలో  ఉద్యోగాలు దొరుకుతాయి. దీంతో పాటు  ప్రభుత్వ రంగంలో  ‘వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ ’ ను పెంచాలన్న డిమాండ్ కూడా గట్టిగా వినిపిస్తోంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికే ఈ హాస్టల్స్ ఉన్నాయి. అయితే అవన్నీ  వైట్ కాలర్ ఉద్యోగాలు చేసే ఆడవారికే అందుబాటులో ఉన్నాయి. పెద్ద పెద్ద పరిశ్రమల్లో చిన్నా చితకా పనులు చేసుకునే వారికి కూడా అందుబాటులో ఉండేలా వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ ను పెంచాలంటున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా ఈ హాస్టల్స్ నుంచి పని ప్రదేశాలకు వెళ్లడానికి ఆడవారికి  ‘ ఓన్లీ లేడీస్ ’ వంటి బస్సులు ఏర్పాటు చేయాలంటున్నారు. ఉమెన్ వర్క్ ఫోర్స్ కు అన్ని విధాల అండగా ఉండేలా బడ్జెట్ లో కొన్ని ప్రత్యేక చర్యలు చేపట్టాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది.

3) వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్​పై ఫోకస్​ చేస్తారా?

దేశంలో నూటికి 80 మంది వ్యవసాయంపైనే ఆధారపడతారు. రైతు చేతుల్లో డబ్బు గలగలలాడితే పల్లెల ఆదాయం పెరిగినట్లే. కానీ.. కొంతకాలంగా వ్యవసాయానికి  ఆదరణ తగ్గింది. రైతులకు వ్యవసాయం భరోసా ఇవ్వకపోవడమే ప్రధాన కారణం. దీంతో  బడ్జెట్​లో  వ్యవసాయంపై స్పెషల్​ ఫోకస్ పెట్టాల్సిన అవసరం వచ్చింది. పంటలకు గిట్టుబాటు ధరలు రాకపోవడం, మార్కెట్ కనెక్టివిటీ లేకపోవడం వంటి అనేక సమస్యలను రైతులు ఎదుర్కొంటున్నారు.

మోడీ ఫస్ట్ టర్మ్​లో అగ్రికల్చర్ సెక్టార్​ను నిర్లక్ష్యం చేశారన్న విమర్శలు మూటగట్టుకున్నారు. వాటి నుంచి బయటపడటానికి ఈసారి బడ్జెట్ లో వ్యవసాయాన్ని  ప్రోత్సహించే దిశగా ప్రతిపాదనలు ఉంటాయని నిపుణులు ఆశిస్తున్నారు. పంటకు ధరలు నిర్ణయించడం, మార్కెట్ కనెక్టివిటీ పెంచడం, క్రాప్ ఇన్సూరెన్స్ , బ్యాంకుల నుంచి సులభంగా లోన్లు వచ్చేలా ఏర్పాట్లు  వంటి అంశాలపై  కేంద్రం ఫోకస్ చేయాలని నిపుణులు కోరుతున్నారు. ఒక సాధారణ రైతు దృష్టి నుంచి వ్యవసాయాన్ని  కేంద్రం చూడాలంటున్నారు. అలా చూసినప్పుడే చిన్న చిన్న కమతాలు సాగు చేసుకునే వారు పడే ఇబ్బందులు తెలుస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పంట పండించిన సామాన్య రైతుకు వ్యవసాయం బతుకుదెరువు ఇస్తుందన్న భరోసా కల్పించేలా మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిపుణులు కోరుతున్నారు. రైతుల నుంచి ఉత్పత్తులను సేకరించడానికి దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా పది వేల సంస్థలను ఏర్పాటు చేసే దిశగా కేంద్రం ఆలోచన చేస్తున్నట్లు కనబడుతోంది. అలాగే నేషనల్ హై వేస్, రాష్ట్రంలోని మేజర్ రోడ్డ వెంబడి గిడ్డంగుల వ్యవస్థను పక్కాగా ఏర్పాటు చేయడానికి సంబంధించి తాజా బడ్జెట్ లో  ప్రతిపాదనలు ఉంటాయని వ్యవసాయరంగ నిపుణులు ఆశిస్తున్నారు. ఇదొక్కటే కాదు రైతుకు ప్రభుత్వం ఒక గైడ్ లాగా ఉపయోగపడాలంటున్నారు. ఏ పంట వేసుకోవాలి ? ఎంత విస్తీర్ణంలో వేసుకోవాలి ? సాగులో తీసుకోవలసిన జాగ్రత్తలు ? పండించిన పంటను ఏ ధరకు అమ్ముకోవాలి ? వంటి అనేక అంశాలపై రైతుకు సర్కార్ ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇవ్వాలని వ్యవసాయ రంగ నిపుణులు కోరుతున్నారు. అగ్రికల్చర్ సెక్టార్ కు మేలు చేసే విధంగా చైనా, 80ల్లో అలాగే 90ల్లో చేసిన ప్రయత్నాలను, ప్రయోగాలను వ్యవసాయరంగ నిపుణులు గుర్తు చేస్తున్నారు.

4) ఎగుమతులకు ఎంకరేజ్​మెంట్​ ఉంటుందా?

ఎగుమతులు కీలకాంశం. అవి ఎంత ఎక్కువ ఉంటే ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వలు అంతగా ఉంటాయి. మేడిన్ ఇండియా వంటి కలలను సాకారం చేయడానికి విదేశీ మారక నిల్వలు చాలా అవసరం. దీంతో ఎగుమతులను పెంచడానికి సర్కార్ ఏం చేయబోతోంది అనే ఆసక్తి అందరిలో నెలకొంది. వ్యవసాయ ఉత్పత్తులను పెద్ద ఎత్తున పెంచడమే కాదు అదే రేంజ్ లో ఎగుమతులు పెంచడానికి కూడా కేంద్రం ఈ  బడ్జెట్ లో  ప్రపోజల్స్ పెట్టాల్సిన అవసరం ఉందంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. మన చుట్టుపక్కల దేశాల్లోకి మన ఉత్పత్తులు సులభంగా ప్రవేశించడానికి వీలుగా చర్యలు ఉండాలంటున్నారు. 2015 నుంచి పరిశీలిస్తే మన ఎక్స్ పోర్ట్స్  బాగా తగ్గాయి. కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల కిందట ప్రవేశపెట్టిన జీఎస్టీ పన్నుల విధానమే దీనికి కారణమన్న వాదన కూడా వినిపిస్తోంది.

సీనియర్​ సిటిజన్లకు, లేడీస్​కి ‘ట్యాక్స్​’ బొనాంజా?

సెంట్రల్​ బడ్జెట్​లో.. ఇన్​కం ట్యాక్స్​ కట్టేవాళ్లకు ఊరట లభించే అవకాశముంది. సీనియర్​ సిటిజన్లకు, ఆడవాళ్లకు  దీనివల్ల లాభం కలగనుంది. ప్రస్తుతం సీనియర్​ సిటిజన్లు రూ.3 లక్షల వరకు ఆదాయ పన్ను కట్టాల్సిన అవసరం లేదు. ఈ​ లిమిట్​ను మరో రూ.50 వేలు పెంచే సూచనలు ఉన్నాయి. లేడీస్​కి కూడా ఈ పరిమితి​ భారీగా పెరగొచ్చని అంటున్నారు. సెక్షన్​–80 ద్వారా లభిస్తున్న డిడక్షన్​ లిమిట్​ లక్షన్నర నుంచి రెండున్నర లక్షలకు పెరిగే ఛాన్స్​ ఉంది. పన్ను చెల్లించేవారి సంఖ్య పెరిగినా కేంద్రానికి ఆశించినంత ఆదాయం రావట్లేదు. దీనికి రెండు కారణాలు దారితీస్తున్నాయని సర్కారు భావిస్తోంది. ఒకటి.. కొత్తగా ట్యాక్స్​ రిటర్న్​లు ఫైల్​ చేసేవాళ్లకి పెద్ద మొత్తంలో పన్నులు కట్టే స్థాయిలో ఆదాయం లేకపోవటం. రెండు.. సరైన ట్యాక్స్​లు చెల్లించకపోవటం. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించనుంది. టెక్నాలజీ ఉపయోగించి సరైన పన్నులు చెల్లించనివారికి ఆ విషయాన్ని చెబుతుంది. తద్వారా వాళ్లు మరోసారి ఆ తప్పు చేయకుండా చూస్తుంది. నిజాయితీగా ట్యాక్స్​ కట్టేవారికి పన్ను భారాన్ని సాధ్యమైనంత తగ్గిస్తుంది. అలాంటి వారిని ఎంకరేజ్​ చేయటానికి చర్యలు చేపడుతుంది.