పాకిస్థాన్‌లోని హిందువులపై అందరి దృష్టి: భారత క్రికెటర్ సంచలన పోస్ట్

పాకిస్థాన్‌లోని హిందువులపై అందరి దృష్టి: భారత క్రికెటర్ సంచలన పోస్ట్

హమాస్ దాడి తరువాత గాజాలో ఇజ్రాయెల్ సైన్యం భూతల ఆపరేషన్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఆ దాడులు ఇప్పుడు గాజా నగరమైన రఫాలో కొనసాగుతున్నాయి. అయితే, ఈ దాడుల్లో సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారనేది కొందరి వాదన. తాము ఉగ్రవాదులను మాత్రమే మట్టుబెడుతున్నామని ఇజ్రాయిల్ సైన్యం చెప్తుండగా.. వారి వ్యతిరేక శక్తులు మాత్రం అమాయకులైన ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని తమ గళాన్ని వినిపిస్తున్నారు. కొద్ది రోజులుగా ఈ ప్రచారం భారత దేశంలోనూ వినిపిస్తోంది.

'ఆల్ ఐస్ ఆన్ రఫా'

కొందరు బాలీవుడ్ నటీనటీమణులు 'ఆల్ ఐస్ ఆన్ రఫా' అనే పోస్టర్‌ను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. రఫాపై ఇజ్రాయెల్ దాడి అమానుషం అనేది వారి భావన. రఫా నగరంపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులను ఉద్దేశించి సెలెబ్రిటీలు అంతా 'అందరి కళ్లు రఫాపైనే ఉన్నాయి 'అనే ఫొటోను షేర్ చేస్తున్నారు. అయితే, భారత క్రికెటర్ రాహుల్ తెవాటియా మాత్రం పాకిస్థాన్‌లోని  హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాల అంశాన్ని లేవనెత్తారు. ప్రపంచంలో ఏ మూలన జరిగే కథనాలపై నోరు విప్పుతున్న భారత వనితలు.. పొరుగు దేశం పాకిస్థాన్‌లోని హిందువులపై జరుగుతున్న దాడులపై ఎందుకు నోరు మెదపట్లేరనేలా ప్రశ్నించారు.   

ఆల్ ఐస్ ఆన్ హిందూస్ ఇన్ పాకిస్థాన్

తెవాటియా 'ఆల్ ఐస్ ఆన్ హిందూస్ ఇన్ పాకిస్థాన్ (అందరి దృష్టి పాకిస్థాన్‌లోని హిందువులపై ఉంది)..' అని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్నాడు. దాయాది దేశంలో హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాలను ధైర్యంగా లెవనెత్తడంతో అతనిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పొరుగు దేశాలకు జై కొట్టే భారత ప్రముఖులు అతన్ని చూసి బుద్ధి తెచ్చుకోవాలని నెటిజన్లు హితవు పలుకుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

తప్పు సరిదిద్దుకున్న రోహిత్ సతీమణి

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ సతీమణి రితికా సజ్డే కూడా 'ఆల్ ఐస్ ఆన్ రఫా' అనే పోస్టర్‌ను షేర్ చేసింది. తీవ్ర విమర్శలు రావడంతో వెంటనే దానిని తొలగించింది. హిందువులపై దాడి జరిగినప్పుడు మీరు ఎక్కడున్నారు? కశ్మీర్ పండిట్లు, మణిపూర్‌లో హింస వంటి సమస్యలపై మీరు ఎప్పుడైనా స్పందించారా? అని రితికాను నెటిజన్లు నిలదీయడంతో వెంటనే ఆ పోస్ట్ డిలీట్ చేసింది.